ఎమ్మెల్యే సీటు వద్దు... ఎంపీనే ముద్దు: ఏపీ కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే పరిస్థితి లేదు.. ఇక్కడ అధికారంలోకి రావడం కష్టమే.. కాబట్టి కాంగ్రెస్ నాయకులు అందరూ లోక్‌సభకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పని చేయాలి….. ఇదీ కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నాయకులకు ఇచ్చిన సందేశం. ఇటీవల ఏపీలో చేసిన కాంగ్రెస్ ప్రత్యేక భరోసా యాత్ర అనంతరం రాష్ట్రంలోని పరిస్థితిపై అగ్రనాయకులందరూ అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఐదు స్థానాలు […]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే పరిస్థితి లేదు.. ఇక్కడ అధికారంలోకి రావడం కష్టమే.. కాబట్టి కాంగ్రెస్ నాయకులు అందరూ లోక్‌సభకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పని చేయాలి….. ఇదీ కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ నాయకులకు ఇచ్చిన సందేశం.
ఇటీవల ఏపీలో చేసిన కాంగ్రెస్ ప్రత్యేక భరోసా యాత్ర అనంతరం రాష్ట్రంలోని పరిస్థితిపై అగ్రనాయకులందరూ అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నివేదిక ప్రకారం ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఐదు స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదని, లోక్‌సభకు మాత్రం గట్టి పోటీ మాత్రం ఇవ్వగలమని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
ఇక ఈ నివేదికను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీనియర్ల అభిప్రాయంతో ఏకీభవించినట్లు చెబుతున్నారు. ఈ నివేదిక ఆధారంగానే ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా రూపొందించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందట.కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు, ఏఐసీసీ స్థాయి నాయకులు లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు టి.సుబ్బిరామిరెడ్డి (విశాఖపట్నం), కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు (కాకినాడ), కాంగ్రెస్ పార్టీ ఒడిషా ఇంచార్జి గిడుగు రుద్రరాజు (రాజమండ్రి), రాహుల్‌కి అత్యంత సన్నిహితుడు జేడీ శీలం (బాపట్ల) వంటి నాయకులను లోక్‌సభ బరిలో దింపడానికి ఏఐసీసీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి సంతకం ప్రత్యేక హోదా మీద పెడుతుందనే ప్రచారం గ్రామస్థాయి నుంచి చేయాలని నిర్ణయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కంటే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా ఎన్నికయ్యేందుకు పార్టీ లోక్‌సభ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేయాలని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విశాఖ రైల్వే జోన్ పూర్తిస్థాయి ఏర్పాటు కూడా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని.. ఇందుకోసం ఏపీ ప్రజలు ఎక్కువ లోక్‌సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేలా సహకరించాలని ప్రచారం చేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఒకట్రెండు రోజుల్లో ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ అదిస్థానం సిద్దమవుతోంది.