Telugu Global
NEWS

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ " 2019కి అంతా రెడీ

టైటిల్ కోసం గత 18 ఏళ్లుగా భారత్ ఎదురుచూపులు సింధు, సైనాలను ఊరిస్తున్న ఆల్ – ఇంగ్లండ్ టైటిల్ తొలి రౌండ్‌లోనే సింధుకు సుంగ్ జీ సవాల్ క్రిస్టీ గిల్మోర్‌తో సైనా తొలి సమరం శ్రీకాంత్‌కు తొలి రౌండ్ ప్రత్యర్థి లీవరెడ్జ్ బ్యాడ్మింటన్ సీజన్లో అతిపెద్ద సమరం… 2019 ఆల్- ఇంగ్లండ్ ఓపెన్‌కు బర్మింగ్ హామ్ వేదికగా కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. గత 18 ఏళ్లుగా ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత స్టార్ ప్లేయర్లకు ఈ […]

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్  2019కి అంతా రెడీ
X
  • టైటిల్ కోసం గత 18 ఏళ్లుగా భారత్ ఎదురుచూపులు
  • సింధు, సైనాలను ఊరిస్తున్న ఆల్ – ఇంగ్లండ్ టైటిల్
  • తొలి రౌండ్‌లోనే సింధుకు సుంగ్ జీ సవాల్
  • క్రిస్టీ గిల్మోర్‌తో సైనా తొలి సమరం
  • శ్రీకాంత్‌కు తొలి రౌండ్ ప్రత్యర్థి లీవరెడ్జ్

బ్యాడ్మింటన్ సీజన్లో అతిపెద్ద సమరం… 2019 ఆల్- ఇంగ్లండ్ ఓపెన్‌కు బర్మింగ్ హామ్ వేదికగా కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది. గత 18 ఏళ్లుగా ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత స్టార్ ప్లేయర్లకు ఈ ఏడాది సైతం క్లిష్టమైన డ్రానే వచ్చింది. మార్చి 6 నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పీవీ సింధు హాట్ ఫేవరెట్‌గా టైటిల్ వేటకు దిగుతోంది.

బ్యాడ్మింటన్‌కే ఎవరెస్ట్

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌కు బర్మింగ్ హామ్‌లో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మార్చి 6 నుంచి వారం రోజుల పాటు జరిగే ఈ స్టార్స్ వార్‌లో ప్రపంచ మేటి బ్యాడ్మింటన్ స్టార్లు విక్టర్ యాక్సిల్ సన్, తాయి జు యింగ్, కిడాంబీ శ్రీకాంత్, సైనా నెహ్వాల్, పీవీ సింధు, యమగుచి, ఒకుహర ఢీ కొనబోతున్నారు.

కాలిగాయంతో కారోలినా అవుట్

మాజీ చాంపియన్ కారోలినా మారిన్ మాత్రం కాలి గాయంతో టోర్నీకి దూరమయ్యింది. టెన్నిస్‌లో వింబుల్డన్‌ను ఎంత గొప్పగా భావిస్తారో… ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఆల్ -ఇంగ్లండ్ ఓపెన్‌ను సైతం అంతే గొప్పగా పరిగణిస్తారు. చైనా, ఇండోనీసియా, మలేసియా, డెన్మార్క్ దేశాలకు చెందిన స్టార్ ప్లేయర్ల హవాతో సాగిపోయే ఆల్ ఇంగ్లండ్ చరిత్రలో భారత క్రీడాకారులు గత నాలుగు దశాబ్దాల కాలంలో రెండంటే రెండు సింగిల్స్ టైటిల్స్ మాత్రమే గెలుచుకోగలిగారు.

1980లో ప్రకాశ్, 2000లో గోపీచంద్

ఆల్- ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పడుకోన్ తొలిసారిగా 1980లో విజేతగా నిలిస్తే.. ఆ తర్వాత రెండు దశాబ్దాలకు 2000లో తెలుగుతేజం పుల్లెల గోపీచంద్ భారత్‌కు సింగిల్స్‌లో రెండో టైటిల్ అందించాడు. గత 18 సంవత్సరాలుగా పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారులు టైటిల్ కోసం ఎదురుచూస్తున్నారు.

2015 రన్నరప్ సైనా

ఇటీవలి కాలంలో సైనా మాత్రమే ఆల్ ఇంగ్లండ్ ఫైనల్స్ చేరి రన్నరప్‌గా నిలిచింది. 2015 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఫైనల్స్ చేరిన సైనా, చివరకు రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు పీవీ సింధు మాత్రం గత ఏడాది టోర్నీ సెమీస్ వరకూ వెళ్లి యమగుచి చేతిలో ఓటమితో లూసింగ్ సెమీఫైనలిస్ట్ గానే మిగిలిపోవాల్సి వచ్చింది.

క్లిష్టమైన డ్రా

ప్రస్తుత 2019 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ డ్రాలో మాత్రం భారత స్టార్ ప్లేయర్లు క్వార్టర్ ఫైనల్స్ దశ నుంచి గట్టి ప్రత్యర్థులతో తలపడాల్సి ఉంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడవ ర్యాంక్ ప్లేయర్ సింధు హాట్ ఫేవరెట్‌గా టైటిల్ వేటకు దిగుతోంది. తొలిరౌండ్‌లో సింధుకు కొరియా ప్లేయర్ సుంగ్ జీ సవాల్ విసురుతోంది. ఇటీవలే ముగిసిన ఇండోనీషియన్ మాస్టర్స్‌లో విజేతగా నిలిచిన సైనా మాత్రం తొలిరౌండ్‌లో క్రిస్టీ గిల్మోర్‌తో తలపడనుంది.

ఇక, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో లీవరెడ్జ్‌తో కిడాంబీ శ్రీకాంత్ పోటీపడతాడు. కాగా, మరో తొలిరౌండ్ సమరంలో డిఫెండింగ్ చాంపియన్ విక్టర్ యాక్సెల్ సన్‌తో సమీర్ వర్మ అమీతుమీ తేల్చుకోనున్నాడు. భారత ఆటగాళ్లు సాయి ప్రణీత్, ప్రణవ్ తొలి రౌండ్ గెలుపు కోసం ఒకరితో ఒకరు తలపడాల్సి ఉంది.

2001 తర్వాత నుంచి ఆల్ ఇంగ్లండ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత్ ఆశలన్నీ సింధు, సైనా, శ్రీకాంత్‌ల సత్తా పైనే ఆధారపడి ఉన్నాయి.

First Published:  5 March 2019 3:12 PM IST
Next Story