చినబాబు “దేశాన్ని” ముంచుతావా?
“నువ్వే చేస్తున్నావ్. అంతా నువ్వే చేస్తున్నావ్. అమెరికా అని, ఐటీ అని పెద్దపెద్ద మాటలు చెబుతుంటే ఏమో అనుకుని మురిసిపోయా. ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తుంటే తప్పు చేశానేమో అనిపిస్తుంది”అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్తాపం చెందుతున్నారని అంటున్నారు. ఒకవైపు పార్టీలో సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీని విడిచి వెళ్లిపోతుంటే దిక్కు తెలియని స్థితిలో ఉన్న చంద్రబాబుకు కొత్తగా తెరపైకి వచ్చిన ఈ డేటా లీక్స్ మరింత […]
“నువ్వే చేస్తున్నావ్. అంతా నువ్వే చేస్తున్నావ్. అమెరికా అని, ఐటీ అని పెద్దపెద్ద మాటలు చెబుతుంటే ఏమో అనుకుని మురిసిపోయా. ఇప్పుడు జరుగుతున్న తంతు చూస్తుంటే తప్పు చేశానేమో అనిపిస్తుంది”అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనస్తాపం చెందుతున్నారని అంటున్నారు.
ఒకవైపు పార్టీలో సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పార్టీని విడిచి వెళ్లిపోతుంటే దిక్కు తెలియని స్థితిలో ఉన్న చంద్రబాబుకు కొత్తగా తెరపైకి వచ్చిన ఈ డేటా లీక్స్ మరింత ఆందోళనకు గురి చేస్తుందని అంటున్నారు. ప్రభుత్వ డేటా మొత్తాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో చెలరేగుతున్న రాజకీయ దుమారానికి కారణం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అని చంద్రబాబు నాయుడు సన్నిహితుల వద్ద వాపోయినట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సంపూర్ణ డేటాను నిక్షిప్తం చేస్తున్నామనే పేరుతో…. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన రహస్య వివరాలను కూడా సేకరించి దాచడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.
పార్టీలో చాలామందికి ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ ఉందని తెలియదని, తెలుగుదేశం కార్యకర్తలకు సంబంధించిన జిల్లా వారి వివరాలు మాత్రమే ఉన్నాయని ఇన్నాళ్ళు భావించామని సీనియర్ నాయకులు సన్నిహితుల వద్ద చెబుతున్నారట. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా లీక్ కావడంతో పార్టీ పరువు బజారున పడిందని లోలోపల ఆందోళన చెందుతున్నారట తెలుగు తమ్ముళ్లు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ రాష్ట్రం విడిపోయినా హైదరాబాదులోనే పని చేయడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీని వరుసగా వెంటాడుతున్న కష్టాలకు కొత్తగా ఈ డేటా లీక్ వ్యవహారం కూడా చేరడంతో తనయుడు నారా లోకేష్ పై చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో సొంత సంస్థ గా భావిస్తున్న ఐటీ గ్రిడ్స్ ను ఇంకా హైదరాబాదులోనే ఉంచడం పట్ల కూడా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
కొత్తగా వచ్చిన ఈ కష్టం నుంచి బయటపడేందుకు ఐటీ నిపుణులతోను, న్యాయ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతోను తక్షణమే మాట్లాడాలని నారా లోకేష్ కు చంద్రబాబు నాయుడు హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు ఎంత మాట్లాడినా ప్రజలు విశ్వసించరని, డేటా లీక్స్ ద్వారా పోయిన పరువును కాపాడుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పుత్రరత్నం నారా లోకేష్ ను తీవ్రంగా మందలించినట్లు చెబుతున్నారు.