Telugu Global
NEWS

తలసాని సభకు భారీ సన్నాహాలు!

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం. ఆంధ్రప్రదేశ్ లోని బీసీ సమాజాన్ని ఒకటి చేస్తా. ఆంధ్రప్రదేశ్ లో నాకు చాలా కాలంగా స్నేహితులు, బంధువులు ఉన్నారు. వారందరితో కలిసి భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా” ఇవి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గుంటూరులో విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలు. ఈ మాటలకు అనుగుణంగానే మార్చి మూడవ తేదీన నిర్వహించనున్న బీసీ సమావేశం కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ ఎత్తున సన్నాహాలు […]

తలసాని సభకు భారీ సన్నాహాలు!
X

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఖాయం. ఆంధ్రప్రదేశ్ లోని బీసీ సమాజాన్ని ఒకటి చేస్తా. ఆంధ్రప్రదేశ్ లో నాకు చాలా కాలంగా స్నేహితులు, బంధువులు ఉన్నారు. వారందరితో కలిసి భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా” ఇవి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గుంటూరులో విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలు. ఈ మాటలకు అనుగుణంగానే మార్చి మూడవ తేదీన నిర్వహించనున్న బీసీ సమావేశం కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సభకు ప్రభుత్వ అనుమతులతో పాటు పోలీసుల అనుమతి కూడా సంపాదించిన తలసాని శ్రీనివాస యాదవ్ ఆంధ్రప్రదేశ్ లోని తన అనుచరులు, స్నేహితులు, బంధువులు అందరికీ పేరుపేరునా ఫోన్ ద్వారా ఆహ్వానాలు పంపుతున్నట్లు సమాచారం. రాష్ట్రాలు వేరైనా, భాషలు వేరైనా దేశ వ్యాప్తంగా బీసీలందరూ ఒక్కటేననే నినాదాన్ని బీసీల్లోకి తీసుకు వెళ్లేందుకు తలసాని శ్రీనివాస యాదవ్ సభను నిర్వహిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఈ సభ నిర్వహించడానికి కారణం తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తనను వ్యక్తిగతంగా ఓడించేందుకు తీవ్రంగా చంద్రబాబు ప్రయత్నించారని తలసాని శ్రీనివాస యాదవ్ ఆగ్రహంగా ఉన్నారు. సనత్‌నగర్ నుంచి పోటీ చేసిన తలసాని శ్రీనివాస యాదవ్ ని ఓడించాలని పట్టుబట్టి ఆ టిక్కెట్ ను కాంగ్రెస్ కు చెందిన మర్రి శశిధర్ రెడ్డికి రాకుండా టీడీపీకి ఇప్పించుకుని తలసానిని ఓడించడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ తలసానిని ఓడించి తీరాలని తెలుగుదేశం పార్టీ నాయకుల వద్ద చంద్రబాబునాయుడు అన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తనకు అత్యంత సన్నిహితులైన వారి ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న తలసాని శ్రీనివాస యాదవ్…. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ లో బీసీలతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో తలసాని శ్రీనివాస యాదవ్ ద్వారా చంద్రబాబు నాయుడు లబ్ధి పొందారని, ఆ విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు తన ఓటమే లక్ష్యంగా పని చేయడం తలసాని శ్రీనివాస యాదవ్ జీర్ణించు కోలేకపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గం నాయకులు కొందరు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారని, వారిని పట్టించుకోని చంద్రబాబు నాయుడు బీసీ కులస్థుడైన తనపై మాత్రం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం తలసానికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో బీసీలందరినీ ఐక్యం చేసి చంద్రబాబు నాయుడు ఓటమి కోసం కృషి చేయాలని తలసాని పట్టుదలతో ఉన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇందులో భాగంగా మార్చి మూడవ తేదీన నిర్వహించనున్న బీసీల సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

First Published:  2 March 2019 6:53 AM IST
Next Story