గౌరు చరిత పార్టీ మారేందుకు కారణాలు ఇవేనా?
కర్నూలు జిల్లా రాజకీయాల్లో అభ్యర్ధుల పార్టీ మార్పులు ఇంకా కొనసాగుతున్నాయి. టికెట్ రాదనే భయంతో కొందరు పార్టీలు జంప్ అవుతున్నారు. తాజాగా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్ బై చెప్పారు. గౌరు చరిత 2004లో నందికొట్కూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 2009లో పోటీ చేయలేదు. 2014లో పాణ్యం నుంచి వైసీపీ తరపున […]
కర్నూలు జిల్లా రాజకీయాల్లో అభ్యర్ధుల పార్టీ మార్పులు ఇంకా కొనసాగుతున్నాయి. టికెట్ రాదనే భయంతో కొందరు పార్టీలు జంప్ అవుతున్నారు. తాజాగా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త గౌరు వెంకటరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్ బై చెప్పారు.
గౌరు చరిత 2004లో నందికొట్కూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో 2009లో పోటీ చేయలేదు. 2014లో పాణ్యం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆరు నెలల కిందట వైసీపీలో చేరారు.
దీంతో అప్పటి నుంచి తమకు టికెట్ రాదనే అనుమానం గౌరు ఫ్యామిలీని వెంటాడుతోంది. ఇటు జగన్ కూడా ఇప్పటివరకూ టికెట్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గౌరు ఫ్యామిలీ అనుమానంతో పార్టీ వీడేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పాణ్యం టికెట్ ఇవ్వకపోతే కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను వినిపించారు. ఈ విషయాలపై కూడా పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే పార్టీ వీడే సమయంలో మాత్రం గౌరు ఫ్యామిలీ జగన్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. టికెట్ రాదనే భయంతోనే పార్టీ వీడుతున్నట్లు తెలిపారు.
మరోవైపు పాణ్యం రాజకీయాల్లో ఇప్పుడు ఓ చర్చ జరుగుతోంది. పాణ్యం నియోజకవర్గంలో కర్నూలు పట్టణంలోని 14 వార్డులు కలిశాయి. ఇక్కడే దాదాపు 70వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో ఈ ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. గౌరు ఫ్యామిలి నందికొట్కూరు లో కొద్దిగా ప్రభావం చూపగలరు. కానీ పాణ్యంలో చూపించలేరనేది ఓ వాదన. మరోవైపు శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటుకు గౌరు వెంకటరెడ్డిని పోటీ చేయమని పార్టీ నేతలు అడిగారట. అప్పట్లో ఆ సీటుకు ఆయన పోటీ చేయకపోవడం కూడా ఇప్పుడు మైనస్‌గా మారిందని అంటున్నారు.
ఎమ్మెల్సీగా పోటీ చేయకపోవడానికి నందికొట్కూరు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న గౌరు వెంకటరెడ్డి బావ శివానందారెడ్డి కారణమని అప్పట్లోనే ప్రచారం జరిగింది. బావకు ఎమ్మెల్సీ సీటు వస్తుందనే అంచనాతో వెంకటరెడ్డి పోటీకి రెడీ కాలేదట. దీంతో చంద్రబాబు వేసిన పాచికలతో ఆ సీటు కేఈ ప్రభాకర్‌కు వెళ్లింది.
మరోవైపు శివానందారెడ్డి ఈ సారి నంద్యాల ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా గౌరు ఫ్యామిలీని టీడీపీలోకి తీసుకువస్తానని తనకు ఎంపీ సీటు ఇవ్వాలని బేరం పెట్టారని తెలుస్తోంది. వాడుకుని వదిలేయడంలో నిపుణుడైన చంద్రబాబు ఈ ఆఫర్ కు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఈ నెల 8న గౌరు ఫ్యామిలీ టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
అయితే శివానందారెడ్డికి ఈ సారైనా ఎంపీ టికెట్ ఇస్తారనేది డౌటే. ఎమ్మెల్సీ సీటు లాగానే ఆశ చూపి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం చంద్రబాబు లక్షణం. ఇటు పాణ్యం టికెట్ కూడా రాకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని గౌరు ఫ్యామిలీ చెప్పడం వెనుక ఇదే కథ ఉందని అంటున్నారు.
ఈ రాజకీయాలే కాకుండా… 2016 నుండి 2017 మధ్యలో రెండు సార్లు గౌరు ఫ్యామిలీ పార్టీ మారాలని చూసిందని… కానీ మంత్రి పదవి హామీ ఇవ్వకపోవడంతో చేరలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి పార్టీలో వారి రాజకీయాలను జాగ్రత్తగా గమనించారని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి అనడానికి ఇదే నిదర్శనం.