ఆదాయం ఒడిషాకు.... నిర్వహణ విశాఖకు...!
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హమీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించింది. మోడీ ఏపీ పర్యటనకు రాబోయే ముందు ఈ కీలక ప్రకటన చేసింది. కాని ఈ జోన్ వల్ల ఇప్పుడు విశాఖకు ఒరిగే లాభమేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి, ఏడాదికి దాదాపు 7,500 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే వాల్తేర్ డివిజన్‌ను రెండు ముక్కలు చేసి రద్దు చేశారు. చత్తీస్‌గడ్, ఒడిషా […]
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హమీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను కేంద్రం ప్రకటించింది. మోడీ ఏపీ పర్యటనకు రాబోయే ముందు ఈ కీలక ప్రకటన చేసింది. కాని ఈ జోన్ వల్ల ఇప్పుడు విశాఖకు ఒరిగే లాభమేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి, ఏడాదికి దాదాపు 7,500 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే వాల్తేర్ డివిజన్‌ను రెండు ముక్కలు చేసి రద్దు చేశారు.
చత్తీస్‌గడ్, ఒడిషా ప్రాంతాల్లోని కిరండల్, కొరాపుట్ రైల్వే లైన్ల ద్వారా విశాఖ పోర్టుకు భారీ ఎత్తున ఖనిజ రవాణా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ రైల్వే లైన్లను కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి దానిలో కలిపేశారు. రాయగడ డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోనే ఉండబోతోంది. అంటే ఆ ఆదాయమంతా పాత జోన్‌కే వెళ్లనుండగా.. ఈ రైల్వే లైన్ల నిర్వహణ మాత్రం విశాఖ జోన్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక మరో విషయం ఏంటంటే.. ఉత్తరాంధ్రలోని పలు స్టేషన్లు ఇంకా ఒడిషాలోని కుర్థా డివిజన్ లోనే ఉంచారు. తెలుగు ప్రాంతాలతో కొత్త జోన్ ఏర్పాటు చేయమని డిమాండ్ ఉండగా.. ఈస్ట్ కోస్ట్ జోన్ అధికారుల లాబీయింగ్‌తో ఆదాయం ఉన్న ప్రాంతాలన్నీ అలాగే ఉంచి.. నామ్‌కే వాస్తే విశాఖ జోన్ ప్రకటించారని నిపుణులు చెబుతున్నారు.
ఇక రైల్వే జోన్ వస్తే స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందని భావించినా కేంద్ర జోన్ మాత్రమే ప్రకటించడం, ఆర్ఆర్‌బీ కేంద్రాన్ని ప్రకటించకపోవడం దీనికి విఘాతం కలిగించనుంది. ఆర్ఆర్‌బీ కేంద్రం లేకపోతే ఏపీ ప్రజలు తిరిగి పరీక్షలు రాయడానికి భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వెళ్లాల్సిందే.
విశాఖ రైల్వే జోన్ ప్రకటన హర్షనీయమే అయినా ఆదాయ వనరులన్నీ వేరే జోన్‌లో ఉంచి.. కేవలం పేరుకే జోన్ ప్రకటించడం అన్యాయమని.. ఈ కొత్త జోన్ నిలదొక్కుకోవడానికి తగినంత ఆదాయం కూడా వచ్చే పరిస్థితి ఉండదని కూడా తెలుస్తోంది.