Telugu Global
NEWS

ఏపీ కాంగ్రెస్.... సీటు గెలవాలంటే.... రెండు దశాబ్దాలు ఆగాల్సిందే!

కాంగ్రెస్ పార్టీ. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. దశాబ్దాల పాటు రాజకీయానుభవం ఉన్న నాయకులు ఈ పార్టీ స్వంతం. దేశంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పార్టీ. అయితే, ఒకే ఒక్క తప్పుతో ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవానికి వచ్చేందుకు తీవ్రాతి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో… అక్కడే వెతుక్కోవాలనే సామెతను అనుసరించి ఆంధ్రప్రదేశ్ లో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ఇవేవీ కలిసొచ్చేలా కనిపించడం […]

ఏపీ కాంగ్రెస్.... సీటు గెలవాలంటే.... రెండు దశాబ్దాలు ఆగాల్సిందే!
X

కాంగ్రెస్ పార్టీ. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న పార్టీ. దశాబ్దాల పాటు రాజకీయానుభవం ఉన్న నాయకులు ఈ పార్టీ స్వంతం. దేశంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పార్టీ. అయితే, ఒకే ఒక్క తప్పుతో ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోయింది.

ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవానికి వచ్చేందుకు తీవ్రాతి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో… అక్కడే వెతుక్కోవాలనే సామెతను అనుసరించి ఆంధ్రప్రదేశ్ లో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అయితే ఇవేవీ కలిసొచ్చేలా కనిపించడం లేదు. కనీసం మరో రెండు దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగేలా కనిపించడం లేదు. బడా బడా నాయకులున్నారు. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలున్నారు. లేనిదల్లా వారిని నమ్మే ఓటర్లేనని మరోసారి రుజువు అయ్యింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి మీ వెంట మేము ఉన్నాం అని చెప్పినా ప్రజల నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రావడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తిరుపతిలో జరిగిన భరోసా యాత్ర బహిరంగ సభే.

తిరుపతిలో బహిరంగ సభను చూసిన వారికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం మాట దేవుడెరుగు… కనీసం ఒక్క స్ధానంలో విజయం సాధించాలన్నా మరో రెండు దశాబ్దాలు పట్టేలా ఉంది అంటున్నారు. తిరుపతి సభకు వచ్చిన వారిలో సగానికి సగం మంది బలవంతంగా వచ్చిన వారే అని చెప్పకనే తెలుస్తోంది.

పోనీ వచ్చిన వారిలో ఉత్సాహం నింపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదరగొట్టే ప్రసంగాలు చేశారా అంటే అదీ లేదు. కాంగ్రెస్ నాయకుల్లోనే నిస్సారం…. నిస్తేజం… నిర్లిప్తత కొట్టచ్చినట్టుగా కనిపించాయి. దీనికి తోడు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కొందరు, ససేమిరా వద్దు అని మరికొందరు సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందే కీచులాడుకున్నారని సమాచారం.

ఇవన్నీ చూసిన వారికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటంటే ఒక్క శాసనసభ స్ధానంలో విజయం సాధించాలన్నా మరో ఇరవై ఏళ్లు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అంటే అప్పటికి ఇప్పుడున్న సీనియర్ నాయకుల స్ధానంలో వారి మనవలు, మనవరాళ్లు, ఇప్పుడు యూత్ నాయకుల కుమారులు, కుమార్తెలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశాలున్నాయంటున్నారు. అంత వరకూ ఎన్ని హోదాలు ప్రకటించినా…. ఆంధ‌్రప్రదేశ్ ప్రజలు తమకు చేసిన అన్యాయానికి కసి తీర్చుకునేలా ఉన్నారని అంటున్నారు.

First Published:  24 Feb 2019 11:30 AM IST
Next Story