దరఖాస్తులు వచ్చేశాయ్... టిక్కెట్లు ఇవ్వడమే తరువాయి
జనసేన. సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ. రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలనుకుంటుంది జనసేన. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని రెండు నెలల క్రితం ప్రకటించింది. శాసనసభకు, లోక్ సభ రెండు కలిపి ఇప్పటి వరకు పదిహేను వందల దరఖాస్తులు వచ్చాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 25 వరకు దరఖాస్తులు ఇవ్వడానికి నిర్ణయించింది […]
జనసేన. సినీ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ. రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీ. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు పోటీ చేయాలనుకుంటుంది జనసేన. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని రెండు నెలల క్రితం ప్రకటించింది.
శాసనసభకు, లోక్ సభ రెండు కలిపి ఇప్పటి వరకు పదిహేను వందల దరఖాస్తులు వచ్చాయని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 25 వరకు దరఖాస్తులు ఇవ్వడానికి నిర్ణయించింది జనసేన. టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య 2000 కంటే ఎక్కువ ఉంటుందని జనసేన నాయకులు ప్రకటిస్తున్నారు. పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవడం అంటే విజయం సాధించడం కాదని జనసేనకి ఇంకా అర్థం కాలేదని రాజకీయ పండితులు అంటున్నారు. దరఖాస్తులు వచ్చాయి… ఇక టిక్కెట్ల పంపిణీ మాత్రమే మిగిలి ఉందని జనసేన సీనియర్ నాయకులు చెబుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసే వారెవరైనా దరఖాస్తులు చేయాలని పిలుపు ఇవ్వడం వరకు బాగుంటుందని, టికెట్ల పంపిణీలోనే అసలు సమస్య ఎదురవుతుందని పార్టీ నాయకులే చెబుతున్నారు. శాసనసభ కు టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న వారిలో ప్రజా సంఘాలకు చెందిన వారు, క్రీడాకారులు, కళాకారులు ఉన్నారు. వీరెవరూ ఆర్థికంగా బలమైన వ్యక్తులు కాకపోవడంతో వీరికి టిక్కెట్లు దక్కుతాయా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.
ఎన్నికల క్షేత్రంలో కోట్లు ఖర్చు పెడితేనే విజయం సాధించే అవకాశాలు ఉన్న నేటి రోజుల్లో కవులు, కళాకారులు, క్రీడాకారులు ప్రజా సంఘాలకు చెందిన వారికి టిక్కెట్లు ఇస్తే వారు ఎలా గెలుస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలు ఇంకా గుర్తున్నాయి అని, అప్పుడు డబ్బులు ఉన్న వారికి టికెట్లు ఇచ్చినా వారు గెలవలేక పోయారని పవన్ కు తెలుసు అని పార్టీ నాయకులే చెబుతున్నారు. అలాంటప్పుడు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోమంటూ పిలుపు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీకి చెందిన వారు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది డబ్బులు అనే విషయం పూర్తిగా తెలుసునని, ఏదో చేస్తున్నాం అని భ్రమ కల్పించడం కోసం ఈ దరఖాస్తుల అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చారని అంటున్నారు.
ఒకవైపు పొత్తుల గురించి మాట్లాడుతూ మరోవైపు దరఖాస్తులు ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నలు వస్తున్నాయి.