ఓకే... కలిసి పోటీ చేద్దాం.... ప్రజలకు ఏం చెబుదాం?
చంద్రబాబు, పవన్ కల్యాణ్ రహస్యంగా భేటీ అయ్యారు… వారి మధ్య సీట్ల సర్దుబాటు కూడా ఖాయం అయింది. 25 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది అన్నది వైసీపీ అనుకూల పత్రిక తొలిపేజీలో సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. నిన్నటి వరకు చంద్రబాబును, లోకేష్‌ను, టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో టీడీపీ-జనసేన పొత్తును ప్రజలకు ఏ కోణంలో వివరించాలన్న దానిపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జరిగినట్టు పత్రిక వెల్లడించింది. కేంద్రం, బీజేపీ, టీఆర్‌ఎస్. ఈ మూడు కారణాలను చూపి టీడీపీ-జనసేన పొత్తును సమర్ధించుకోవాలన్నది […]
చంద్రబాబు, పవన్ కల్యాణ్ రహస్యంగా భేటీ అయ్యారు… వారి మధ్య సీట్ల సర్దుబాటు కూడా ఖాయం అయింది. 25 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది అన్నది వైసీపీ అనుకూల పత్రిక తొలిపేజీలో సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది. నిన్నటి వరకు చంద్రబాబును, లోకేష్‌ను, టీడీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో టీడీపీ-జనసేన పొత్తును ప్రజలకు ఏ కోణంలో వివరించాలన్న దానిపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జరిగినట్టు పత్రిక వెల్లడించింది.
కేంద్రం, బీజేపీ, టీఆర్‌ఎస్. ఈ మూడు కారణాలను చూపి టీడీపీ-జనసేన పొత్తును సమర్ధించుకోవాలన్నది చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆలోచనగా పత్రిక వెల్లడించింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి కాసేపు ఈ కథనం పూర్తిగా నిజం అనుకుందాం. కానీ జనసేన- టీడీపీ పొత్తును సమర్ధించుకునేందుకు చెబుతున్న కారణాలను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు అన్నది ప్రధాన ప్రశ్న.
టీఆర్‌ఎస్ ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోంది కాబట్టి దాన్ని అడ్డుకునేందుకే జత కట్టాం అని చెప్పడం ఒక ఎత్తుగడ. కానీ ఆ వాదన నిలవడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పొత్తు కోసం హరికృష్ణ శవం పక్కనే కూర్చుని కేటీఆర్‌తో చంద్రబాబు చర్చలు జరిపారన్నది వంద శాతం నిజం. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా అంగీకరించారు. కాబట్టి టీఆర్ఎస్‌ను బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తే మరి మీరెందుకు ఆ పార్టీతో పొత్తు చర్చలు జరిపారు అన్నది సామాన్యుడి నుంచి ఎదురయ్యే ప్రశ్న.
అదే సమయంలో గతంలో కేసీఆర్ ఆంధ్రా బిర్యాని పేడలా ఉంటుందని చెప్పారని ఈ మధ్య లోకేష్ గుర్తు చేశారు. అది ఉద్యమ సమయంలో చేసిన కామెంట్స్. ఆ మాటలు అన్న తర్వాత, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి పిలిపించి,
కేసీఆర్‌కు ఇదే లోకేష్ , చంద్రబాబులు రాచమర్యాదలు చేసిన విషయం కూడా ప్రజలకు గుర్తుంది. కేసీఆర్ దుర్గమ్మ దర్శనానికి వస్తే మంత్రి దేవినేని ఉమా చేసిన హడావుడి అందరికీ గుర్తుంది.
ఇక పవన్ కల్యాణ్ అజ్ఞాత వాసి చిత్రం విడుదల సమయంలో ప్రగతిభవన్‌కు వెళ్లి గంట పాటు ఎదురుచూసి కేసీఆర్‌ను కలిసి, బయటకు వచ్చి కేసీఆర్ పాలన చాలా బాగుంది అని కితాబిచ్చిన అంశం గుర్తింది. మొన్నటికి మొన్న గవర్నర్ విందులో కేటీఆర్, కేసీఆర్‌తో పవన్ కల్యాణ్ సరదా సన్నివేశాలు గుర్తున్నాయి.
కాబట్టి పవన్ కల్యాణ్ కూడా టీఆర్‌ఎస్‌ను బూచిగా చూపించి టీడీపీతో పొత్తు పెట్టుకుంటా అంటే అది జనం హర్షించరు. కేవలం సొంతంగా పోటీ చేసి ఓట్లు తప్ప సీట్లు సాధించే సామర్థ్యం లేనందునే పొత్తుకు పవన్ కల్యాణ్ సాకులు చెబుతున్నారని జనం భావించే అవకాశం ఉంది.
అదే చేస్తే పవన్ కల్యాణ్ పార్టీని నిలబెట్టుకునేందుకు రాజకీయం చేస్తున్నారే గానీ… ప్రజల కోసం, మార్పు కోసం రాజకీయం చేయడం లేదన్నది ప్రజలు భావించే అవకాశం ఉంది.
మరో మార్గం… కేంద్రం అన్యాయం చేసింది కాబట్టి చంద్రబాబుతో కలిసి పోరాటం చేసేందుకే పొత్తు అని చెప్పడం. కేంద్రం అన్యాయం చేసింది నిజమే. మరీ నాలుగున్నరేళ్లు కేంద్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు. కేంద్రం ఇంతకంటే ఏ రాష్ట్రానికైనా ఎక్కువ ఇచ్చిందేమో ఎవరైనా నిరూపించండి అని వైసీపీకి చంద్రబాబు ఎందుకు సవాల్ చేశారు. అద్బుతమైన ప్యాకేజ్ ఇచ్చారంటూ అసెంబ్లీ సాక్షిగా మోడీని అభినందిస్తూ తీర్మానం ఎందుకు చేశారు.
కోట్లాది రూపాయలు పెట్టి దీక్షల పేరుతో ప్రజాధనం వృథా చేయడమే పోరాటమా?. జనసేన- చంద్రబాబు పొత్తు పెట్టుకుంటే ఈ ప్రశ్నలకు టీడీపీ కాదు… పవన్ కల్యాణ్ కూడా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయినాఏపీలో రెండు మూడు శాతం
మించి ఓట్లు లేని బీజేపీని సాకుగా చూపి ఎన్నికలకు వెళ్తే దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందన్నది చూడాలి.
అన్నింటికి మించి పవన్ కల్యాణ్‌ను ఇష్టపడుతున్న వారిలో యువత, రాజకీయాల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న వారు
ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ వెళ్లి చంద్రబాబుతో కలిస్తే అది జనసేనకు నాలుగు సీట్లు గెలిచేందుకు ఉపకరించవచ్చేమో గానీ… కొత్త పంథాలో రాజకీయం, రాజకీయ ప్రక్షాళన, మార్పు వంటి నీతులు చెప్పే అర్హత పవన్
కల్యాణ్ కోల్పోవచ్చు.