ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే....
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు కాంగ్రెస్ ను దెబ్బ కొట్టినా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గెలిచి తీరాలి అన్న పట్టుదలతో పని చేస్తోంది. శాసనసభ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుందని, శాసనసభ ఎన్నికల్లో స్థానికంగా పాలించే వారిపట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని, అదే లోక్‌సభ ఎన్నికలలో వారి ఆలోచన జాతీయ స్థాయిలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో […]
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు కాంగ్రెస్ ను దెబ్బ కొట్టినా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గెలిచి తీరాలి అన్న పట్టుదలతో పని చేస్తోంది.
శాసనసభ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుందని, శాసనసభ ఎన్నికల్లో స్థానికంగా పాలించే వారిపట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని, అదే లోక్‌సభ ఎన్నికలలో వారి ఆలోచన జాతీయ స్థాయిలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పట్ల… ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఈ అసంతృప్తిని తమ వైపు తిప్పుకోగలిగితే గెలువడం పెద్ద కష్టం కాదని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గణనీయంగానే విజయం సాధించారు. దీనిని బట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలను వివరించాలని పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా మహిళల ఓట్లతో గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపట్ల ఎంత చులకనగా వ్యవహరిస్తోందో ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని నిర్ణయించారు. కేబినెట్ విస్తరణలో మహిళలకు ప్రాధాన్యం కల్పించకపోవడం పట్ల మహిళలకు వివరించాలని నిర్ణయించారు.
అలాగే తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడుస్తున్నా పాలన ప్రారంభించ లేదని, దీనివల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితిలో మంత్రివర్గ విస్తరణ తర్వాత వచ్చిన అంతర్గత విభేదాలను కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా చెబుతున్నారు. ఇక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ చేత వీలైనన్ని ఎక్కువ సభలలో మాట్లాడించాలని భావిస్తున్నారు.
మంగళవారం ఢిల్లీలో జరిగిన వార్ రూమ్ సమావేశంలో ఇదే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించారని అంటున్నారు.