Telugu Global
NEWS

నేనే రాజు.... నేనే మంత్రి

నేనే రాజు.. నేనే మంత్రి… ఇది వెండితెరపై విజయవంతమైన చిత్రం. సినిమాలో హీరో అన్నీ తానే అని నిరూపించుకున్న చిత్రం. ఈ సినిమాకీ… తెలంగాణ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పెద్దగా తేడా లేనట్టుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అటు పార్టీ వర్గాలలోనూ, రాజకీయ పక్షాలలోనూ కూడా వినపడుతోంది. దీనికి తాజా ఉదాహరణ రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణ అంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో అనూహ్యంగా […]

నేనే రాజు.... నేనే మంత్రి
X

నేనే రాజు.. నేనే మంత్రి… ఇది వెండితెరపై విజయవంతమైన చిత్రం. సినిమాలో హీరో అన్నీ తానే అని నిరూపించుకున్న చిత్రం. ఈ సినిమాకీ… తెలంగాణ లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పెద్దగా తేడా లేనట్టుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అటు పార్టీ వర్గాలలోనూ, రాజకీయ పక్షాలలోనూ కూడా వినపడుతోంది. దీనికి తాజా ఉదాహరణ రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణ అంటున్నారు.

మంత్రివర్గ విస్తరణలో అనూహ్యంగా సీనియర్ మంత్రులను పక్కన పెట్టారు కేసీఆర్. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన,… ఆ తర్వాత రెండు సార్లు అధికారంలోకి రావడానికి కృషి చేసిన సీనియర్ నాయకులు హరీష్ రావు కు మంత్రి పదవి దక్కలేదు.

తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి కావడానికి హరీష్ రావు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని ఎన్నికల వేదికల మీద చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మాత్రం ఆయనకు మొండి చేయి చూపించారు. ఆయనతోపాటు పలువురు సీనియర్ నాయకులకు కూడా మంత్రివర్గంలో చోటు లేకుండా చేశారు.

తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేసిన తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు మాట కూడా చెల్లుబాటు అయినట్టుగా లేదు. మంత్రివర్గ విస్తరణలో తారక రామారావు వర్గంగా చెబుతన్న వారిలో ఏ ఒక్కరికి స్థానం దక్కలేదు. మంత్రి పదవి కోసం లోక్ సభ స్ధానం వదులుకుని వచ్చిన బాల్క సుమన్ కూడా నిరాశ చెందాల్సి వచ్చింది. ఆయన కేవలం మంత్రి పదవి కోసం మాత్రమే శాసనసభ్యుడిగా పోటీ చేశారు.

ఆయనతోపాటు కడియం శ్రీహరి, మరికొందరు సీనియర్ నాయకులు కూడా తరచుగా కేటీఆర్ ని కలుస్తున్నారని భావించిన కేసీఆర్ వీరికి చెక్ పెట్టారని చెబుతున్నారు. పార్టీలో ఎప్పటికైనా తానే నెంబర్ వన్ అని, మిగిలిన వారు తాత్కాలికమేనని చెప్పేందుకే ముఖ్యమంత్రి ఇలా చేశారంటున్నారు.

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. అయితే ఆమె హరీష్ రావు వర్గమని భావించిన ముఖ్యమంత్రి పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదని చెబుతున్నారు.

ఇక మిగిలిన ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు కూడా కేటీఆర్ ను తరచుగా కలిసిన కారణంగా మంత్రి పదవులు దక్కించుకోలేకపోయారని అంటున్నారు. ఇలా తెలంగాణలో తానే రాజు… తానే మంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పార్టీలో అంటున్నారు.

First Published:  21 Feb 2019 5:20 AM IST
Next Story