Telugu Global
NEWS

పైకి ఏడవలేం.... లోపల కుమిలిపోలేం....

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం పెరిగిందా..? ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు… ఎస్టీ ప్రజా ప్రతినిధుల్లో ఎవ్వరికీ మంత్రిపదవి దక్కలేదు. అంతే కాదు… కొందరు సీనియర్లు కూడా మంత్రిపదవి దక్కని వారిలో ఉన్నారు. మంత్రి పదవి దక్కని వారు, వారి అనుచరులు, నియోజకవర్గంలో ఉన్న మిత్రులు “ఇదేంటి… మీకు రాకపోవడమేమిటి” వంటి ఊరడింపు మాటలతో మంత్రిపదవి రాని వారిని మరింత బాధకు గురి చేస్తున్నారు. మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఓ మహిళా ఎమ్మెల్యే అయితే ఏకంగా […]

పైకి ఏడవలేం.... లోపల కుమిలిపోలేం....
X

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధుల్లో నైరాశ్యం పెరిగిందా..? ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలు… ఎస్టీ ప్రజా ప్రతినిధుల్లో ఎవ్వరికీ మంత్రిపదవి దక్కలేదు. అంతే కాదు… కొందరు సీనియర్లు కూడా మంత్రిపదవి దక్కని వారిలో ఉన్నారు. మంత్రి పదవి దక్కని వారు, వారి అనుచరులు, నియోజకవర్గంలో ఉన్న మిత్రులు “ఇదేంటి… మీకు రాకపోవడమేమిటి” వంటి ఊరడింపు మాటలతో మంత్రిపదవి రాని వారిని మరింత బాధకు గురి చేస్తున్నారు.

మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఓ మహిళా ఎమ్మెల్యే అయితే ఏకంగా రాజ్ భవన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. గత శాసనసభలో కూడా మహిళా మంత్రి ఎవ్వరూ లేరు. దీంతో పార్టీలో వ్యతిరేకత వస్తుందనుకున్నారో…. మరో కారణమో తెలియదు కాని పద్మా దేవేందర్ రెడ్డిని మాత్రం డిప్యూటీ స్పీకర్ చేశారు. ఈసారి అది కూడా ఉండే పరిస్ధితి లేదని అంటున్నారు.

ఈ సారి శాసనసభకు ముగ్గురు మహిళలు శాసన సభ్యులుగా విజయం సాధించారు. వారిలో పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. ఒక వేళ ఆమెను కాదనుకుంటే…. గొంగడి సునీతకు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారమూ జరిగింది. అయితే వీరిద్దరికీ మొండి చేయి చూపారు కేసీఆర్.

ఇక గిరిజన ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కలేదు. గత ప్రభుత్వంలో అజ్మీరా చందూలాల్ మంత్రిగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో మిగిలిన వారిలో ఏ ఒక్క ఎస్టీ శాసనసభ్యుడికైనా మంత్రి పదవి వస్తుందని భావించారు. వారిలో ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కలేదు.

మంత్రి పదవులు దక్కని వారంతా మింగలేక… కక్కలేక.. ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరీ ఇంత కఠినంగా వ్యవహరించారెందుకో తెలియదంటూ తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట.

భవిష్యత్ లో మరో ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఆ సమయంలో మహిళలకు, ఎస్టీలకు ఛాన్స్ ఉంటుందని సరిపెట్టుకోవాలని కొందరు సీనియర్లు వారిని ఓదారుస్తున్నారు.

మరోవైపు తమకు మంత్రి పదవి దక్కక తామే బాధలో ఉంటే…. తమను కలిసి తమ గోడు చెప్పుకుంటున్న వారిని చూసి నవ్వాలో… ఏడవాలో తెలియడం లేదని పలువురు సీనియర్లు అంటున్నారు.

First Published:  19 Feb 2019 10:49 PM GMT
Next Story