వేధింపులకు మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఆత్మహత్యాయత్నం
మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆత్మహత్యాయత్నం గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దౌర్జన్యాలను భరించలేక మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆదినారాయణ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు ఆస్పత్రి వద్ద హంగామా చేశారు. పోలీసులకు ఎమ్మెల్యే పేరు చెప్పవద్దంటూ ఆదినారాయణ, ఆయన కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన మీడియాపైనా యరపతినేని అనుచరులు వీరంగం […]
మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడు ఆత్మహత్యాయత్నం గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దౌర్జన్యాలను భరించలేక మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆదినారాయణ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు ఆస్పత్రి వద్ద హంగామా చేశారు. పోలీసులకు ఎమ్మెల్యే పేరు చెప్పవద్దంటూ ఆదినారాయణ, ఆయన కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన మీడియాపైనా యరపతినేని అనుచరులు వీరంగం వేశారు.
మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావు కుమారుడైన ఆదినారాయణ, ఆయన బావమర్ది బెల్లంకొండ పూర్ణచంద్రరావుకు దాచేపల్లి మండలం కేసానుపల్లిలో 2.1 ఎకరాల భూమి ఉంది. అందులో తెల్లరాయి నిక్షేపాలు ఉండడంతో క్వారీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మైనింగ్ అనుమతులు కూడా వచ్చాయి.
అయితే ఈ భూమిపై ఏపీ మైనింగ్ డాన్‌గా పేరుతెచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కన్నుపడింది. ఆ భూమిని ఆక్రమించేందుకు రంగంలోకి దిగాడు. ఏకంగా అనుచరులను పంపించి ఆదినారాయణ భూమిలో తవ్వకాలు మొదలుపెట్టాడు ఎమ్మెల్యే. ఈ విషయం తెలుసుకున్న ఆదినారాయణ తన భూమి తనకు అప్పగించాల్సిందిగా పదిరోజులుగా ఎమ్మెల్యేను వేడుకుంటున్నాడు.
బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా యరపతినేని వ్యవహారం కావడం అటు వైపు కూడా చూడలేదు. రాత్రి ఆదినారాయణ సోదరుడు కోటేశ్వరరావు నేరుగా ఎమ్మెల్యే యరపతినేని వద్దకు వెళ్లి భూమి ఇవ్వాల్సిందిగా వేడుకున్నాడు. అందుకు ససేమిరా అన్న యరపతినేని… కావాలంటే అంతో ఇంతో ఇస్తాను తీసుకుని వెళ్లు అంటూ తేల్చేశాడు.
అనంతరం నేరుగా ఆదినారాయణకే ఫోన్ చేసిన ఎమ్మెల్యే యరపతినేని గట్టిగా బెదిరించాడు. భూమి గురించి మరిచిపో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మరోదారి లేక ఆదినారాయణ ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి కొన ఊపిరితో ఉన్న ఆదినారాయణను ఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యే యరపతినేని… మైనింగ్ లాండ్ కోసం తమను వదిలిపెట్టడని…. తమకు టీడీపీ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని ఆదినారాయణ సోదరులు కోటేశ్వరరావు, లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి తమ కుటుంబం ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చిందని… చివరకు తమకు టీడీపీ పెద్దలే ఇలాంటి శాస్తి చేశారని వాపోయారు. మాజీ ఎమ్మెల్యే కొడుకులమైన తమకే ఇలా జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు.