Telugu Global
NEWS

పాతాళంలో భారత్- పాక్ క్రీడాసంబంధాలు !

భారత్ తెగదెంపులతో పాక్ విలవిల భారత్ బహిష్కరణతో పాక్ క్రికెట్ బోర్డు దివాళా దిగజారిపోయిన పాకిస్థాన్ హాకీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ -పాక్ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాదు…క్రీడాసంబంధాలు సైతం ఏడాది ఏడాదికీ తీసికట్టుగా మారిపోతున్నాయి. భారత్ తో సంబంధాలు బెడిసికొట్టడంతో పలువిధాలుగా పాక్ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైపోతోంది. అంతేకాదు….పాకిస్థాన్ క్రీడారంగం సైతం పతనం అంచులకు చేరింది. భారత్ తోడ్పాటు లేకుంటే మనుగడ సాగించలేమన్న వాస్తవం ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ హాకీ సమాఖ్యలకు అర్ధమైపోయింది. భారత్, పాకిస్థాన్…దక్షిణాసియాలో […]

పాతాళంలో భారత్- పాక్ క్రీడాసంబంధాలు !
X
  • భారత్ తెగదెంపులతో పాక్ విలవిల
  • భారత్ బహిష్కరణతో పాక్ క్రికెట్ బోర్డు దివాళా
  • దిగజారిపోయిన పాకిస్థాన్ హాకీ

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ -పాక్ ద్వైపాక్షిక సంబంధాలు మాత్రమే కాదు…క్రీడాసంబంధాలు సైతం ఏడాది ఏడాదికీ తీసికట్టుగా మారిపోతున్నాయి.

భారత్ తో సంబంధాలు బెడిసికొట్టడంతో పలువిధాలుగా పాక్ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైపోతోంది. అంతేకాదు….పాకిస్థాన్ క్రీడారంగం సైతం పతనం అంచులకు చేరింది. భారత్ తోడ్పాటు లేకుంటే మనుగడ సాగించలేమన్న వాస్తవం ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, పాకిస్థాన్ హాకీ సమాఖ్యలకు అర్ధమైపోయింది.

భారత్, పాకిస్థాన్…దక్షిణాసియాలో రెండు అతిపెద్ద దేశాలు. 1947 కు ముందు వరకూ అఖండ భారత్ లో భాగంగా ఉన్న ఈ రెండు ప్రాంతాలూ దేశవిభజనతో…రెండుదేశాలుగా అవతరించిన నాటినుంచే.. దాయాదులుగా మారిపోయాయి.

భారత్ పెద్దమనసుతో సహనం, సంయమనం పాటిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నా…పాకిస్థాన్ మాత్రం ద్వేషభావంతో, పగప్రతీకారాలతో కాశ్మీర్ కుంపటిని రాజేస్తూ…రగిలిస్తూనే వస్తోంది. చైనా, అమెరికా దేశాల అండతో పేట్రేగిపోతూ భారత్ లో అశాంతిని సృష్టించడానికి సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ వస్తోంది.

క్రీడాసంబంధాలపై రాజకీయ ప్రభావం

వాస్తవానికి …క్రీడలు వేరు, రాజకీయాలు వేరు. క్రీడలతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. అయితే…భారత్, పాక్ దేశాలలో మాత్రం క్రీడాసంబంధాలను రాజకీయాలు, రాజకీయ సంబంధాలు తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి.

దేశవిభజనతోనే హాకీ, క్రికెట్ వారసత్వాలను రెండుదేశాలు పంచుకొని ప్రపంచ స్థాయిలో తమ సత్తా చాటుకొంటూ వస్తున్నాయి. అయితే…క్రికెట్, హాకీ, టెన్నిస్ , బిలియర్డ్స్ అండ్ స్నూకర్, స్క్వాష్ లాంటి క్రీడల్లో భారత్ తన ప్రత్యేకతను కాపాడుకొంటూ వస్తుంటే….పాక్ క్రీడారంగం మాత్రం కునారిల్లిపోతూ వస్తోంది.

హాకీలో భారత్ కళకళ- పాక్ వెలవెల…

దేశవిభజనకు ముందు వరకూ ప్రపంచ స్థాయిలో హాకీ అనగానే భారత్ పేరు మాత్రమే గుర్తుకు వచ్చేది. దేశవిభజన తర్వాత ఒలింపిక్స్ , ప్రపంచ హాకీలో భారత ఆధిపత్యానికి పాకిస్థాన్ గండికొడుతూ వచ్చింది.

అయితే…గత దశాబ్దకాలంలో భారత హాకీ ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడితే…పాకిస్థాన్ హాకీ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ప్రపంచ, ఒలింపిక్స్ హాకీ టోర్నీలకు పాక్ జట్టు నేరుగా అర్హత సాధించలేక చతికిలపడిపోతోంది. భారత్ తో ద్వైపాక్షిక హాకీ సిరీస్ లు లేక పాక్ తీవ్రంగా నష్టపోతోంది.

క్రికెట్లో పాక్ బోర్డు దివాళా…

పెద్దమనుషుల క్రీడ క్రికెట్లో ఇటు భారత్, అటు పాకిస్థాన్ దేశాలకు గొప్పవారసత్వం, గొప్పగొప్ప క్రికెటర్లను అందించిన ఘనత సైతం ఉన్నాయి. ఈ రెండుదేశాల క్రికెట్ బోర్డులు కలసి వన్డే ప్రపంచకప్ ను సైతం నిర్వహించాయి.

ప్రపంచ క్రికెట్లోనే గట్టి ప్రత్యర్థులుగా, దాయాది జట్లుగా నిలిచాయి. భారత్, పాక్ జట్లు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయంటే చాలు…స్టేడియాలు కిటకిటలాడిపోటం సాధారణ విషయమే. భారత్ జట్టు పాక్ లో పర్యటిస్తే అక్కడి క్రికెట్ బోర్డుకు కాసుల వర్షమే. అదే పాక్ జట్టు భారత్ లో పర్యటించినా బీసీసీఐకి డబ్బే డబ్బు.

ముంబైపై దాడితో అసలుకే మోసం…

క్రీడాపరంగా భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్న సమయంలో ముంబై మహానగరంపై ఉగ్రవాదులదాడితో కథ మళ్లీ మొదటికొచ్చింది. పాకిస్థాన్ తో క్రీడాసంబంధాలను భారత ప్రభుత్వం తెగతెంపులు చేసుకొంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచిపోషించినంత కాలం ద్వైపాక్షిక క్రీడాసంబంధాలు ఉండనే ఉండవంటూ తేల్చి చెప్పింది.

ప్రపంచ క్రికెట్ కు భారత్ అతిపెద్ద మార్కెట్ మాత్రమే కాదు…క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు సైతం భారత్ మాత్రమే. బీసీసీఐతో చక్కటి సంబంధాలతో శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ఓ వైపు ఆర్ధిక నష్టాలను పూడ్చుకొని, అప్పుల ఊబినుంచి బయటపడితే…పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం దివాళతీసే పరిస్థితికి చేరుకొంది.

భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ లు లేక పాకిస్థాన్ వందల కోట్ల రూపాయల మేర నష్టపోయింది. పైగా భారత్ తమతో సిరీస్ లు ఆడటం లేదంటూ ఐసీసీలో కేసు వేసినా విఫలం కాకతప్పలేదు. ఉగ్రవాదుల భయంతో స్వదేశంలో సిరీస్ లు నిర్వహించలేని పాకిస్థాన్ దుబాయ్, అబుదాబీ తటస్థ వేదికలుగా అంతర్జాతీయ సిరీస్ లకు ఆతిథ్యమిచ్చే దయనీయమైన స్థితికి దిగజారిపోయింది.

క్రీడాకారుల పాత్రా అంతంతే!

ఉభయదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం కోసం రెండుదేశాల క్రీడాకారులు తమవంతు పాత్ర నిర్వర్తిస్తుంటే.. పాక్ పాలకులు మాత్రం ఉగ్రవాదులను ఉసిగొలుపుతూ ద్వైపాక్షిక సంబంధాలకు దారుణంగా విఘాతం కలిగిస్తున్నారు.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ 1970 దశకంలోనే భారత యువతి రీటా లూత్రాను తన జీవితభాగస్వామిగా చేసుకొంటే…పాకిస్థాన్ మాజీ ఓపెనర్ మొహిసిన్ ఖాన్ భారత నటి రీనా రాయ్ ను వివాహం చేసుకొన్నాడు.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం… మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ను నిఖా చేసుకొని పాకిస్థాన్ కోడలిగా మారింది. రెండుదేశాల క్రీడాకారులు తమవంతుగా సంబంధాల బాగుకోసం పాటుపడుతున్నా…. పాక్ పాలకుల దుశ్చర్యలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ వస్తోంది.

రెండడుగులు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నస్థాయిలో ఉభయదేశాల సంబంధాలు ఉంటే….క్రీడాసంబంధాలు మెరుగుపడాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది.

First Published:  17 Feb 2019 4:41 AM IST
Next Story