Telugu Global
National

అలీగఢ్ విద్యార్థులపై దేశద్రోహ కేసు

రిపబ్లికన్ టీవీ చానల్ కు చెందిన పత్రికా విలేకరులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ పర్యవసానంగా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన 14 మంది విద్యార్థులపై దేశద్రోహం కేసు మోపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుబంధంగా ఉన్న యువజన విభాగానికి చెందిన ముఖేశ్ సింఘ్ లోధీ ఫిర్యాదు మేరకై విద్యార్థులపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. లోధీకి ఈ ఘర్షణతో ఎలాంటి సంబంధం లేదు. ఘర్షణ జరుగుతున్నప్పుడు అటు వేపు నుంచి వెళ్తున్న లోధీ ఫిర్యాదు […]

అలీగఢ్ విద్యార్థులపై దేశద్రోహ కేసు
X

రిపబ్లికన్ టీవీ చానల్ కు చెందిన పత్రికా విలేకరులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ పర్యవసానంగా అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన 14 మంది విద్యార్థులపై దేశద్రోహం కేసు మోపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుబంధంగా ఉన్న యువజన విభాగానికి చెందిన ముఖేశ్ సింఘ్ లోధీ ఫిర్యాదు మేరకై విద్యార్థులపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.

లోధీకి ఈ ఘర్షణతో ఎలాంటి సంబంధం లేదు. ఘర్షణ జరుగుతున్నప్పుడు అటు వేపు నుంచి వెళ్తున్న లోధీ ఫిర్యాదు మేరకు దేశద్రోహం కేసు దాఖలైంది. విద్యార్థులు “పాకిస్తాన్ జిందాబాద్”, “భారత్ ముర్దాబాద్” నినాదాలు చేయడం తాను విన్నానని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారట. ఇంతకన్నా వైపరీత్యం ఏముంటుంది.

ఆలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఎదుట మోహరించిన సాయుధ పోలీసులు

అసలు ఆ విశ్వవిద్యాలయం ఆవరణలో ఏం జరిగింది అన్న విషయంలో వివరాలైతే తెలియవు కాని మామూలుగా దేశ ద్రోహం కేసులు నమోదు చేసినట్టుగానే ఈ కేసూ నమోదైంది. బ్రిటిష్ వారి పాలన సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే వారిపై దేశ ద్రోహం కేసులు మోపడం పరిపాటిగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా కాల దోషం పట్టిన చట్టాన్ని తమకు గిట్టని వారిపై అమలు చేయడం మామూలైపోయింది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసిన ఘనత అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలకూ ఉండడం మరో వైపరీత్యం.

ఒక టీవీ చానల్ ప్రతినిధులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై భారత ప్రభుత్వాన్ని పడదోసే ప్రయత్నం చేసే వారి మీద మోపవలసిన దేశద్రోహం కేసు మోపడం వైపరీత్యమే. అధికారంలో ఉన్న పార్టీలు ఈ చట్టాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నాయనడానికి మచ్చు తునక.

వచ్చే ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ చట్టాన్ని వినియోగిస్తోందని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. చీటికీ మాటికీ దేశద్రోహం కేసులు మోపకూడదన్న నియమం ఉన్నా పదే పదే అదే జరుగుతోంది. “చట్టా విరుద్ధమైన కార్యకలాపాలను మాత్రమే నేరంగా పరిగణించాలి” అని సుప్రీంకోర్టు 2011 లో స్పష్టం చేసినా ఆ ఆదేశాన్ని పట్టించుకునే వారే లేరు. అందుకే ఎన్ని దేశద్రోహం కేసులు మోపినా అవి న్యాయ పరిశీలనలో రుజువు కావడం లేదు.

2014 నుంచి 2016 మధ్య 112 దేశద్రోహ కేసులు నమోదు చేస్తే రెండింట్లో మాత్రమే ఈ ఆరోపణలు న్యాయస్థానంలో రుజువు అయినాయి. అంటే ఈ చట్టాన్ని కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నట్టే. దారిన పోయే దానయ్య ఫిర్యాదు ఆధారంగా దేశద్రోహం కేసు మోపడం అంత దుర్మార్గం ఇంకేముంటుంది.

2016 నుంచి అస్సాంలో బీజేపీ ప్రభుత్వం 251 దేశద్రోహ కేసులు నమోదు చేసింది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో దేశద్రోహం చట్టాలవంటివి ఉండడం ఘోరం. ఈ చట్టాన్ని రద్దు చేయనంత కాలం దుర్వినియోగం జరుగుతూనే ఉంటుంది.

First Published:  14 Feb 2019 10:55 AM IST
Next Story