ఊగిసలాటలో ఆమంచి....
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశం ముగిసింది. తన నియోజకవర్గంలో పరిస్థితిని ఆయన సీఎంకు వివరించారు. ఇరువురు సుమారు 30 నిముషాలపాటు చర్చలు జరిపారు. ఆమంచిని ముఖ్యమంత్రి వద్దకు మంత్రి శిద్ధా రాఘవరావు తీసుకువెళ్లారు. గత కొంత కాలంగా ఆమంచి పార్టీలో అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆమంచి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించాక తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తన నియోజక వర్గంలో […]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశం ముగిసింది. తన నియోజకవర్గంలో పరిస్థితిని ఆయన సీఎంకు వివరించారు. ఇరువురు సుమారు 30 నిముషాలపాటు చర్చలు జరిపారు. ఆమంచిని ముఖ్యమంత్రి వద్దకు మంత్రి శిద్ధా రాఘవరావు తీసుకువెళ్లారు.
గత కొంత కాలంగా ఆమంచి పార్టీలో అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు ఆమంచి మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించాక తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తన నియోజక వర్గంలో అభివృద్ధి పనులు చేసిన విషయం వాస్తవమేనని ఆయన అన్నారు. పార్టీలో తాను ఇబ్బందులు పడుతున్నానని, తనపై విమర్శలు ఎక్కువ అయ్యాయని చెప్పారు. ఈ విషయాలన్నీ చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తానని, సీఎం చెప్పిన దానిబట్టి తన నిర్ణయం ఉంటుందని ఆమంచి అన్నారు.
నిన్ననే చంద్రబాబుతో ఆమంచి సమావేశం కావాల్సి ఉంది. అయితే సీఎం సూచన మేరకు తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. ఆమంచిని పిలుపించుకుని 2 గంటలపాటు చర్చలు జరిపారు.
చీరాలలో తాను రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నవారికి రెండు పదవులు దక్కడంతో పార్టీ నాయకత్వంపై ఆమంచి కినుక వహించారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు, లోకేష్ జోక్యంతో మంత్రి శిద్ధా రాఘవ రావును చర్చలకు పంపారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబు ఈసారి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో రాయబారం నడిపించారు. త్రిమూర్తులు ఆమంచితో చర్చలు జరిపారు. పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలోనే ఈరోజు మంత్రి శిద్ధా రాఘవ రావు మళ్ళీ ఆమంచిని కలిసి ఆయనను ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకుని వెళ్ళారు. ఆమంచి ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. సమావేశం ముగిసాక విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే నేను ఇక్కడికి వచ్చానని, నా అంతట నేను రాలేదని ఆమంచి అన్నారు. రెండు మూడు రోజుల్లో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో మాట్లాడి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాక పార్టీలో ఉండాలో, బయటకు వెళ్ళాలో నిర్ణయించుకుంటానని ఆమంచి తెలిపారు.