నాకు ఓట్లు కొనడం రాదు...!
“ నేను రాజకీయ నాయకుడిని. నిజమే. కానీ నాకు ఓట్లు కొనడం, అడగడం రెండూ రావు” అని లోక్ సభ మాజీ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఓ ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగతంగా తాను ఎలాంటి వాడు, రాజకీయంగా ఎలాంటి వాడు వంటి అంశాలను నిష్కర్షగా చెప్పారు. పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసిన తనను ఓట్లు అడగడానికి కూడా వెళ్లవద్దని వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పేవారని, నీ […]
“ నేను రాజకీయ నాయకుడిని. నిజమే. కానీ నాకు ఓట్లు కొనడం, అడగడం రెండూ రావు” అని లోక్ సభ మాజీ సభ్యుడు, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఓ ఛానల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగతంగా తాను ఎలాంటి వాడు, రాజకీయంగా ఎలాంటి వాడు వంటి అంశాలను నిష్కర్షగా చెప్పారు.
పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసిన తనను ఓట్లు అడగడానికి కూడా వెళ్లవద్దని వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పేవారని, నీ పని గాంధీభవన్‌లో కూర్చుని విలేకరుల సమావేశంలో మాట్లాడటం మాత్రమే అని అనేవారని ఉండవల్లి తెలిపారు. తనకు ఆర్థిక బలం గాని, కులం బలం గాని లేవని, ఈ విషయం వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసునని ఉండవల్లి స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసిన ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తన విజయం కోసం పాటుపడ్డారని, తాను ఎవరికీ ఒక్క రూపాయి కూడా పంచ లేదని చెప్పారు.
ఇటీవల విజయవాడలో తాను నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కేవలం ప్రత్యేక హోదా కోసం మాత్రమేనని ఉండవల్లి స్పష్టం చేశారు. ఈ సమావేశం వెనుక తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ ను కలిపేందుకు చేసే ప్రయత్నం ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “నాకు ఇద్దరు వ్యక్తులను కలపడమే రాదు. ఇక రెండు పార్టీలను ఎలా కలుపుతాను. రెండు పార్టీలను కలిపేంతటి రాజకీయ నాయకుడు కాదు నేను” అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
పవన్ కళ్యాణ్ తనను పిలిచే వరకు వ్యక్తిగతంగా ఆయనను ఎప్పుడూ కలుసుకోలేదని, టీవీ లలో ఆయన సినిమా చూడటం తప్ప థియేటర్‌లో కూడా ఎప్పుడు ఆయన సినిమా చూడలేదని ఉండవల్లి అన్నారు. “పవన్ కళ్యాణ్ నాకు గౌరవం ఇచ్చారు. నన్ను పిలిచి కొన్ని సలహాలు అడిగారు. నేను చెప్పాను. అలాగే నేను ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇదే మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం.” అని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. వైఎస్. రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్. జగన్మోహాన రెడ్డి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని కోరుకుంటున్న వాళ్లలో తానూ ఒకడినని ఉండవల్లి అన్నారు.