Telugu Global
NEWS

చంద్రబాబు కోసం రంగంలోకి యువహీరోలు

నాలుగున్నరేళ్లుగా ఏపీలో ఏం జరిగినా చిత్ర పరిశ్రమ నుంచి యువ హీరోలు స్పందించలేదు. ప్రత్యేక హోదా కోసం జనం రోడ్డెక్కిన సమయంలో కొందరు కమెడియన్లు జనంతో గళం కలిపారే గానీ… కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు మాత్రం నోరెత్త లేదు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో కొందరు యువ హీరోలు… రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు అండగా గళమెత్తుతున్నారు. తటస్త ముసుగులో జనాన్ని డ్రైవ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో వైఫల్యాలకు మోడీ సర్కారే కారణమని చంద్రబాబు చేస్తున్న […]

చంద్రబాబు కోసం రంగంలోకి యువహీరోలు
X

నాలుగున్నరేళ్లుగా ఏపీలో ఏం జరిగినా చిత్ర పరిశ్రమ నుంచి యువ హీరోలు స్పందించలేదు. ప్రత్యేక హోదా కోసం జనం రోడ్డెక్కిన సమయంలో కొందరు కమెడియన్లు జనంతో గళం కలిపారే గానీ… కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు మాత్రం నోరెత్త లేదు.

అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో కొందరు యువ హీరోలు… రాజకీయాలు మాట్లాడడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు అండగా గళమెత్తుతున్నారు. తటస్త ముసుగులో జనాన్ని డ్రైవ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

రాష్ట్రంలో వైఫల్యాలకు మోడీ సర్కారే కారణమని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు…. యువహీరోలు వంతపాడుతున్నారు. ఇటీవల కియో కారును ప్రదర్శించిన సమయంలో ఇద్దరు యువహీరోలు అత్యుత్సాహంతో ప్రభుత్వం గ్రేట్ అంటూ పొడిగేశారు. అయితే నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో సదరు హీరోలపై దాడి జరిగింది.

నాలుగున్నరేళ్లుగా హోదా కోసం పోరాటం చేస్తుంటే ఏనాడు ఏసీ గది దాటి రాని మీరు, రాష్ట్రంలో మహిళా అధికారులను ఇసుకలో పడేసి కొట్టినా నోరెత్తని మీరు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎమ్మెల్యేలను కొంటుంటే అది తప్పు…. అని చెప్పలేని మీరు, ఇప్పుడు ఒక కారును ఆవిష్కరించగానే చప్పట్లు కొడతారా?. ఇన్నాళ్లకు నిద్ర లేచారా?. లేక ఎన్నికలొస్తున్నాయి కాబట్టి చంద్రబాబు కోసం తటస్తుల ముసుగులో జూలు విదుల్చుతున్నారా ? అని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రంలో ఏం జరిగినా స్పందించని మీరు… ఒక కారు ఆవిష్కరించగానే స్పందించారంటే దీని బట్టే మీ హీరోల ప్రాధాన్యత విలాసాలకే గానీ, ప్రజల యోగక్షేమాలకు కాదన్న విషయం అర్థమవుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు.

కియో కారు ప్రదర్శన సందర్భంగా హీరో రామ్‌ చేసిన ట్వీట్‌కు కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. కులాభిమానంతో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. అందుకు రామ్.. ఇక్కడ కులం లేదు… ప్రాంతం లేదు… అని సమాధానం ఇచ్చారు.

మంచు మనోజ్‌ కూడా చంద్రబాబు పోరాటానికి మద్దతు పలికారు. మోహన్‌ బాబు కుటుంబం ఆ మధ్య మోడీని కలిసి ఆయన్ను గొప్పనాయకుడిగా అభివర్ణించింది. ఫొటోలు దిగి వచ్చింది.

మంచు మనోజ్‌ మాత్రం… ”మా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి…. లేదంటే మీరు ఎవరి సన్నిధిలో అయితే ఆ ప్రమాణం చేశారో…. ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాక తప్పదు….’’ అని మోడీని హెచ్చరించారు.

నాలుగున్నరేళ్లుగా జనం హోదా కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేసిన సమయంలో చంద్రబాబు… హోదా వల్ల ఏమొస్తుంది?. హోదా ఏమైనా సంజీవినా అని ప్రశ్నించినప్పుడు నోరెత్తని హీరోలు… ఇప్పుడు చంద్రబాబు తరహాలోనే…. మోడీని టార్గెట్‌ చేయడం బట్టి కొందరు యువ హీరోలు చంద్రబాబుకు మద్దతుగా రంగంలోకి దిగారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు… ఏపీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కూడా సరిగా అమలు కావడం లేదని… తన కాలేజీకి 20 కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని… ఆ భారం భరించలేక ఆస్తులను తాకట్టు పెట్టుకోవాల్సి వస్తోందని మోహన్ బాబు ఆవేదన చెందారు.

First Published:  2 Feb 2019 3:12 AM IST
Next Story