గనులు కావు-మృత్యు కుహరాలు
మేఘాలయలో ఇరుకైన సొరంగాలు తవ్వి ఖనిజాలను వెలికి తీసే క్రమంలో గని కార్మికులు ప్రాణాలు కోల్పోవడం “సబ్కా సాథ్, సబ్కా వికాస్” నినాదాలు ఇచ్చే వారికి సిగ్గు చేటు. అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ గనుల తవ్వకాల్లో కొన్ని వర్గాలకు చెందిన అనేకమంది జీవితాలు బలైపోతున్నాయి. గనులలో నుంచి ఖనిజాలు వెలికి తీసే క్రమంలో వీరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇరుకైన సొరంగాలు తవ్వి ఖనిజాన్వేషణ చేయడం నిజానికి చట్ట విరుద్ధమైంది. ముఖ్యంగా ఇది తూర్పు జైతియా హిల్స్ […]
మేఘాలయలో ఇరుకైన సొరంగాలు తవ్వి ఖనిజాలను వెలికి తీసే క్రమంలో గని కార్మికులు ప్రాణాలు కోల్పోవడం “సబ్కా సాథ్, సబ్కా వికాస్” నినాదాలు ఇచ్చే వారికి సిగ్గు చేటు. అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ గనుల తవ్వకాల్లో కొన్ని వర్గాలకు చెందిన అనేకమంది జీవితాలు బలైపోతున్నాయి. గనులలో నుంచి ఖనిజాలు వెలికి తీసే క్రమంలో వీరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
ఇరుకైన సొరంగాలు తవ్వి ఖనిజాన్వేషణ చేయడం నిజానికి చట్ట విరుద్ధమైంది. ముఖ్యంగా ఇది తూర్పు జైతియా హిల్స్ లో జరుగుతోంది. వంద అడుగులు, అంతకన్నా ఎక్కువ లోతుకు గనులు తవ్వుతారు. వీటికి ఎప్పుడు కూలిపోతాయో తెలియని వెదురుకర్రల మెట్లు మాత్రమే ఉంటాయి. ఈ సొరంగాలు ఎలుకలు చేసిన బొరియాల్లా ఉంటాయి. బొగ్గు నిలవలు ఉన్న చోటికి వెళ్లడానికి ఈ సొరంగాలు తవ్వుతారు.
నేపాల్, బంగ్లాదేశ్, అస్సాం నుంచి వచ్చిన వలస కార్మికులు ఈ గనుల తవ్వకంలో పాల్గొంటారు. కొంతమంది స్థానికులు కూడా ఉంటారు. భూగర్భంలో గనుల తవ్వకానికి తొమ్మిదేళ్లు అంతకన్న తక్కువ వయసు ఉండి పొట్టిగా ఉండే వారు బాగా సరిపోతారని భావిస్తారు. వారి తలలకు దివిటీల లాంటివి కట్టుకుని, పారల్లాంటివి తీసుకుని గనిలోకి దిగుతారు. పికాసులు మొదలైన వాటితో బొగ్గు తవ్వుతారు. ఈ బొగ్గును గంపల్లోకో, చక్రాల బండి లాంటి దాన్లోనో నింపుతారు. వీరు సాధారణంగా ఎక్కువ సమయం పని చేస్తారు.
2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ తరహా గనుల తవ్వకాన్ని నిషేధించేదాకా నిబంధనలు లేని, ప్రమాదకరమైన ఈ పనిని మేఘాలయలో “కుటీర పరిశ్రమ” అనేవారు. అయితే ఈ నిషేధాన్ని అమలు చేయడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. నిజానికి ఈ నిషేధాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చే అనేక పార్టీలు ఎన్నికలలో పోటీ చేశాయి. మేఘాలయలో గనుల తవ్వకం నుంచే ఎన్నికల నిధులు సమకూరుతాయి.ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు, శాసన సభ్యులలో చాలా మంది ఈ నిధులను వినియోగించుకున్న వారే. లేదా ఆ గనుల యజమానులే.
2018 ఎన్నికలలో అభ్యర్థులుగా ఉన్న వారు గనుల తవ్వకంతోనో, బొగ్గు రవాణాతోనో సంబంధం ఉన్న వారే. గనులకు సంబంధించిన నిబంధనల నుంచి మేఘాలయకు ఎప్పుడూ మినహాయింపు ఇవ్వలేదు. కాని ప్రస్తుత ప్రభుత్వం ఈ “అక్రమాన్ని” కప్పి పుచ్చాలని ప్రయత్నిస్తోంది.
గనుల తవ్వకం వల్ల స్థానికులకు మేలు కలుగుతుందని లేదు. సమాజానికి సంబంధించిన వనరులను ప్రైవేటీకరించారు. లేదా బొగ్గు నిలవలు ఉన్న భూములను ఆక్రమించారు. ఇది భూమిలేని వారి సంఖ్య పెరగడానికి ఉపయోగపడుతోంది. జైతియా హిల్స్ లో ప్రతి చదరపు కిలో మీటర్ కు 50 మంది గని కార్మికులు ఉంటారు.
ఆర్థిక వ్యవస్థలో బొగ్గు ప్రధానం కావడం ఓ విషాదం. గనుల పుణ్యమా అని ఇతర జీవనోపాధులు మాయమై పోయాయి. పెట్టుబడి, వనరులు ఎక్కువగా ఉన్న వారు సహజంగానే అధిక లాభాలు సంపాదిస్తున్నారు. మరో వంక ఎవరి పేరు చెప్పి గనుల తవ్వకం జరుగుతోందో ఆ స్థానికులు గనుల వ్యాపారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతకవలసి వస్తోంది.
2018 డిసెంబర్ 13న ఈ చీకటి బిలాల్లో 15 మంది కార్మికుల జీవితాలు సమాధి అయిపోయాయి. లైటీన్ నది జలాలు ఈ గనిలోకి ప్రవేశించినందువల్ల ఈ దుర్ఘటన జరిగింది. అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంది. అయితే మొదట కీలకమైన కొంత సమయం వృధా అయింది. గనిలో నుంచి నీళ్లు తోడడానికి యంత్రాలు రెండు వారాల తర్వాత కాని చేరలేదు. సహాయ కార్యక్రమాలకోసం నౌకా దళం వారిని రంగంలోకి దించినా శిథిలమైన కళేబరాలను వెలికి తీయడం కష్టమైంది.
2019 జనవరి ఆరున ఇదే జిల్లాలో మరో ఇద్దరు గని కార్మికులు మరణించారు. 2013లో అయిదుగురు గని కార్మికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. పడి పోవడం వల్ల, గనులు కూలడం, నీరు ముంచెత్తడంవల్ల మరణాలు, గాయాల పాలు కావడం గనులున్న ప్రాంతాలలో రోజూ ఎదురవుతూనే ఉంటుంది. దీనికి ఎవరినీ బాధ్యులను చేయడం లేదు.
ఎలుక బొరియల్లంటి చిన్న చిన్న సొరంగాలు తవ్వి బొగ్గు వెలికి తీయడం పర్యావరణానికి కూడా నష్టం కలగజేస్తోంది. జైతియా హిల్స్ ను “అడుగంటిన నదుల” ప్రాంతాలు అంటారు. అధిక గంధకం, ఖనిజ అవశేషాలు నదులున్న ప్రాంతాలను విషపూరితంగా, ఆంల భరితంగా మారాయి. దీనివల్ల చేపలు అంతరించాయి. నేల నాణ్యత తగ్గింది. గనులకోసం అడవులను నరికి వేశారు. పొలాలు నాశనమయ్యాయి. బొగ్గు నిలవ చేయడం వల్ల పొలాలకు నష్టం కలిగింది.
గనులు తవ్వి మూసి వేయకుండా వదిలేసిన ప్రాంతాలు మృత్యు కుహరాల్లా మారిపోయాయి. పర్యావరణానికి నష్టం కలిగినందువల్ల ఆ ప్రాంతం మాఫియా ముఠాలకు నిలయమైంది. బాల కార్మిక వ్యవస్థ పెరిగిపోయింది. (2010లో వేసిన అంచనా ప్రకారం బాల కార్మికులు 70,000 మంది ఉన్నట్టు అంచనా). కార్మికుల ప్రాణాలు, భద్రత గురించి పట్టించుకునే వారు లేరు. నిబంధనలను అమలు చేస్తామన్న ప్రభుత్వ హామీని ఎవరూ నమ్మడం లేదు. శాస్త్రీయ పద్ధతుల్లో గనుల తవ్వకం కూడా దీనికి సమాధానంగా కనిపించడం లేదు. ఎందుకంటే బొగ్గు స్తరాలు లోతున పరచుకుని ఉన్నాయి. అందువల్ల విస్తారమైన ప్రాంతంలో తవ్వకాలు జరపవలసి వస్తుంది. ఇక్కడ దొరికే బొగ్గు కూడా ఏమంత నాణ్యమైంది కాదు. అంటే ఆర్థికంగా పెద్ద ప్రయోజనం ఉండదు.
గనుల్లో తరచుగా జరుగుతున్న ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహించాలి? నయా ఉదారవాద విధానాలు అనుసరిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమైపోతోంది. మేఘాలయలో ఈ రకమైన గనుల తవ్వకం మీద నిషేధం ఉన్నా, అక్రమాలు జరుగుతున్నా వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ గనుల్లోకి ప్రవేశించాలంటే కార్మికులు ఎలకల్లాగా పాకుతూ వెళ్లాలి. అయితే అలాగే బయటికి రావడం మాత్రం కష్టం.
(ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో)