కొడుకు బతికొస్తాడని శ్మశానంలో 40రోజులుగా ఎదురుచూపులు
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరులో మూడ నమ్మకాలతో ఓ యువకుడి సమాధి వద్ద తల్లిదండ్రులు శ్మశానంలో కాపు కాశారు. చనిపోయిన మీ కుమారుడు 40రోజులకు బయటకు వస్తాడని భూత వైద్యుడు చెప్పడంతో లక్షలు ఖర్చు చేసి ఎదురు చూశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో భూత వైద్యుడు పరార్ అయ్యాడు. తుపాకుల శీను అనే యువకుడు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి స్థానికంగా కారును అద్దెకు నడుపుతూ బతికేవాడు. ఇటీవల స్వైన్ ఫ్లూ సోకి చనిపోయాడు. […]
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరులో మూడ నమ్మకాలతో ఓ యువకుడి సమాధి వద్ద తల్లిదండ్రులు శ్మశానంలో కాపు కాశారు. చనిపోయిన మీ కుమారుడు 40రోజులకు బయటకు వస్తాడని భూత వైద్యుడు చెప్పడంతో లక్షలు ఖర్చు చేసి ఎదురు చూశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో భూత వైద్యుడు పరార్ అయ్యాడు.
తుపాకుల శీను అనే యువకుడు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి స్థానికంగా కారును అద్దెకు నడుపుతూ బతికేవాడు. ఇటీవల స్వైన్ ఫ్లూ సోకి చనిపోయాడు. దీంతో స్థానిక శ్మశానంలో ఖననం చేశారు. అయితే కొద్దిరోజులకు ఒక భూత వైద్యుడు…. శీను తల్లిదండ్రుల వద్దకు వచ్చి మీ కొడుకు అనారోగ్యంతో చనిపోలేదని… చేతబడి చేసి కొందరు చంపారని నమ్మించాడు.
40 రోజులకు సమాధి నుంచి మీ కుమారుడు బయటకు వస్తాడని… చేతబడి చేసిన వాడు ఆ సమయంలో మరోసారి దాడి చేసి చంపేస్తాడని నమ్మించాడు. కాబట్టి 40 రోజుల పాటు సమాధి వద్ద పూజలు చేస్తూ కాపు కాయాల్సిందిగా భూత వైద్యుడు సూచించారు.
అలా చేస్తే చనిపోయిన మీ అబ్బాయిని తాను తిరిగి బతికిస్తానని నమ్మించాడు. ఆరు లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. భూత వైద్యుడి మాటలు నమ్మిన శీను తల్లిదండ్రులు నెల రోజులకు పైగా శ్మశానంలోనే కాపు కాస్తున్నారు. రాత్రివేళ కూడా అక్కడే ఉంటున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు శ్మశానానికి వెళ్లి వారిని గట్టిగా ప్రశ్నించారు.
తొలుత తమ కుమారుడిని మరిచిపోలేక ఇక్కడే ఉంటున్నామని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి, బంధువులను పిలిపించి విచారించగా అసలు విషయం చెప్పారు. భూతవైద్యుడి మాటలు నమ్మి తాము శ్మశానంలో కాపు కాసినట్టు అంగీకరించారు. అలాంటి పనులు చేయవద్దని మందలించి శీను తల్లిదండ్రులను పోలీసులు వదిలేశారు. భూతవైద్యుడి కోసం గాలిస్తున్నారు.