వామపక్షం.... ఎవరి పక్షం?
వామపక్షాలు. అంటే భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పార్టీలు. వీటిని సీపీఐ, సీపీఎంలుగా వ్యవహరిస్తారు. ఈ రెండు పార్టీలకు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు కొంత కార్యకర్తల బలం ఉండేది. రాను రాను ఆ పార్టీల తప్పిదాలతో ఆ క్యాడర్ కాస్త దూరం అయ్యింది. ఇక అప్పటి నుంచి ఈ రెండు ఏదో ఒక ప్రధాన పార్టీ పంచన చేరి రెండో, మూడో స్ధానాలతో తమ అస్ధిత్వాన్ని కాపాడుకుంటున్నాయి. వీరిని ఎలా వాడుకోవాలో […]
వామపక్షాలు. అంటే భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పార్టీలు. వీటిని సీపీఐ, సీపీఎంలుగా వ్యవహరిస్తారు. ఈ రెండు పార్టీలకు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు కొంత కార్యకర్తల బలం ఉండేది. రాను రాను ఆ పార్టీల తప్పిదాలతో ఆ క్యాడర్ కాస్త దూరం అయ్యింది.
ఇక అప్పటి నుంచి ఈ రెండు ఏదో ఒక ప్రధాన పార్టీ పంచన చేరి రెండో, మూడో స్ధానాలతో తమ అస్ధిత్వాన్ని కాపాడుకుంటున్నాయి. వీరిని ఎలా వాడుకోవాలో అందరి కంటే ఎంతో ఎక్కువగా తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అలాగే వాడుకున్నారు. ఆనక తన నైజాన్ని ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు వామపక్ష పార్టీలను అంతే సులువుగా వదిలేశారు.
వీరికి బద్ధ శత్రువుగా భావించే భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు. ఇక అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాలు దిక్కు లేని పక్షుల్లాగే మారిపోయాయి. మళ్లీ వారికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూపంలో మరో గోడ చేర్పు దొరికింది. పవన్ కల్యాణ్ తన పార్టీ జనసేనను ప్రకటించడానికి ముందు నుంచే వామపక్షాలకు చెందిన నాయకులతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. తనకు కుడిఎడమలుగా సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నాయకులను పక్కన పెట్టుకుని విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ కు యువతలో మంచి క్రేజ్ ఉండడంతో అది తమకు కలిసి వస్తుందని వామపక్షాలకు చెందిన నాయకులు ఆశలు పెంచుకున్నారు.
అయితే, రోజురోజుకు సీన్ రివర్స్ అవుతోంది. తమను పక్కన పెట్టుకుని అనేక కార్యక్రమాలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవల వామపక్షాల నాయకులను పట్టించుకోవడం లేదంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్ కు సహకరించాలంటూ సీపీఐ, సీపీఎంలకు చెందిన రాష్ట్ర నాయకత్వం ఆయా జిల్లాల నాయకులను ఆదేశించారని సమాచారం.
అయితే, అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ వామపక్షాలకు చెందిన నాయకులను అసలు పట్టించుకోలేదని ఆ పార్టీలకు చెందిన వారు వాపోయారని సమాచారం. పవన్ కల్యాణ్ తో జోడి కడితే మళ్లీ పాత ప్రాభవం వస్తుందని ఆశించిన వామపక్షాలకు నిరాశే ఎదురయ్యేలా ఉందంటున్నారు. పైగా పవన్ కల్యాణ్ చూపులు కొత్తగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నాయని, ఎన్నికల సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు వెనుక నుంచి ఒకరికి ఒకరు సహకరించుకుంటారంటున్నారు.
ఇదే జరిగితే వామపక్ష పార్టీలు ఎవరి పక్షం వహిస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి వామపక్షాల పరిస్థితి ముందు పవన్… వెనుక చంద్రబాబు అన్నట్టుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.