Telugu Global
Others

టీడీపీకి కోట్లు కురిపించిన "కోడి కత్తి"

(ఎస్‌.వి.రావు) సంక్రాంతికి కోడిపందాలు ఆడించడం అనేది ఒకప్పుడు సంస్కృతిలో భాగం. అప్పుడప్పుడు, అక్కడక్కడా ఈ పందాలు నిర్వహించేవారు.  కానీ ఆ సంస్కృతి, ఆచార వ్యవహారాలు క్రమంగా రాజకీయ అవసరాల కోసం…. అధికారంలో ఉన్నవారు వాడుకునే స్థాయికి మారిపోయాయి. ఇప్పుడది వ్యాపారంగా కూడా మారిపోయింది. గడిచిన దశాబ్ద కాలంలో ఇది విశృంఖలం కాగా ఈ మధ్య కాలంలో కోడి పందాలు అధికార పార్టీకి కోట్లు కూడబెట్టే ఆదాయ వనరుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం, […]

టీడీపీకి కోట్లు కురిపించిన కోడి కత్తి
X

(ఎస్‌.వి.రావు)

సంక్రాంతికి కోడిపందాలు ఆడించడం అనేది ఒకప్పుడు సంస్కృతిలో భాగం. అప్పుడప్పుడు, అక్కడక్కడా ఈ పందాలు నిర్వహించేవారు. కానీ ఆ సంస్కృతి, ఆచార వ్యవహారాలు క్రమంగా రాజకీయ అవసరాల కోసం…. అధికారంలో ఉన్నవారు వాడుకునే స్థాయికి మారిపోయాయి. ఇప్పుడది వ్యాపారంగా కూడా మారిపోయింది.

గడిచిన దశాబ్ద కాలంలో ఇది విశృంఖలం కాగా ఈ మధ్య కాలంలో కోడి పందాలు అధికార పార్టీకి కోట్లు కూడబెట్టే ఆదాయ వనరుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం, వ్యాపారం, ఆదాయం లక్ష్యంగా కోడిపందాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

అధికార పార్టీ తన నేతల ఆదాయానికి కోడి పందాలను అడ్డంగా వాడుకుంది. ప్రజలు…. ముఖ్యంగా వ్యసనపరుల బలహీనతను ఆసరాగా చేసుకొని సొమ్ముచేసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే నేతలు లక్షలు కాదు కోట్ల రూపాయలు సునాయాసంగా సంపాదించారు. వ్యవసాయం, చేపలు, రొయ్యల వ్యాపారం ద్వారా నాలుగు రూపాయలు సంపాదించుకున్న గోదావరి జిల్లాల రైతాంగం సొమ్ము వ్యసనపరుల మూలంగా అధికార పార్టీ నేతలు, కొందరు పోలీస్‌ అధికారుల జేబుల్లోకి చేరింది ఈ సంక్రాంతి సమయంలో.

ఈ పండుగ రోజుల్లో…. వారం రోజుల పాటు కోడిపందాల ఆటకు ప్రభుత్వం చూసిచూడనట్లు అనుమతించడం ద్వారా వందల కోట్ల రూపాయలు అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కొందరు పోలీస్‌ అధికారులు సొమ్ముచేసుకున్నారు. ప్రతీ నియోజక వర్గంలోనూ సరాసరిన ఈ విధంగా రోజుకు కనీసం 2 నుంచి 3 కోట్ల రూపాయలు అధికార పార్టీ నేతలకు, కొందరు పోలీస్‌ లకు చేరిందనడం అతిశయోక్తికాదు.

పైగా ఇందులో అధునాతన పద్ధతులను అవలంభించి సాధారణ వీడియో కెమెరాలతో పాటు డ్రోన్‌ కెమెరాల ద్వారాను చిత్రీకరించి కోడిపందాల్లో సంపాదనను ఆడిట్‌ తరహాలో రాబట్టుకున్నారంటే ఈ సంస్కృతి క్రమంగా అక్రమ ఆదాయ వనరుగా ఏ స్థాయిలో స్థిర పడిందో స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించడం, తమిళనాడులో జల్లికట్టు పోటీలు కొన్ని దశాబ్దాలుగా సంస్కృతి సంప్రదాయాలుగా వస్తున్నాయి. అప్పట్లో ఇవి కొన్ని ప్రాంతాలకు పరిమితమై ఉండేవి. తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందాలు ప్రతీ గ్రామానికి విస్తరించాయి.

కోడి పందాలు ఇప్పుడు పూర్తిగా వ్యాపారంగా, అధికార పార్టీకి కోట్లను కుమ్మరించే వనరుగా వృద్ధి చెందింది. ఈ పోటీలపై హైకోర్ట్‌, సుప్రీంకోర్టుల్లోనూ కేసులు దాఖలయ్యాయి. ఈ పందేల వల్ల జరుగుతున్న జీవహింసపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కోర్టులు సైతం తీవ్రంగా పరిగణించాయి.

గత ఏడాది జరిగిన కోడిపందాలపై అప్పటి ఏపీ, తెలంగాణ హైకోర్ట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అవేవి ఇప్పుడు అడ్డం కాలేదు. పైగా అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పరిధిలోని పోలీస్‌ అధికారులకు వసూళ్ళ లక్ష్యాలను నిర్ణయించారు. గోదావరి జిల్లాలో అయితే ప్రతీ గ్రామంలోనూ ఈ సంక్రాంతికి కోడి పందాలను అనుమతించారు. ఐ భీమవరం, వెంప, ఫత్తేపురం తదితర గ్రామాల్లో పెద్ద స్థాయిలో నిర్వహించారు.

అయితే ప్రతీ గ్రామంలోనూ రోజుకు కనీసం 50వేల రూపాయల చొప్పున పోలీసులకు చెల్లించాలి. పెద్ద మొత్తంలో పందాలు నిర్వహిస్తే రెండు లక్షలు, ఐదు లక్షలు, యాబై లక్షల రూపాయల వరకు రోజుకు చెల్లించాలనే షరతు మీద పోలీసులు కోడి పందాలను అనుమతించారు. నిర్వాహకులు ఆ మొత్తాలను ముందుగానే పోలీసులకు చెల్లించారు. తొలుత మూడు రోజులకు అనుమతించిన పోలీసులు నాయకుల సలహా మేరకు ఆ తర్వాత మరో రెండు రోజులు పొడిగించారు.

ఈ విధంగా ప్రతీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోను అంటే ప్రతి మండలంలోనూ రోజుకు గ్రామాల సంఖ్య ఆధారంగా లక్షల రూపాయలు ఆదాయం అక్రమంగా లభించింది. ఆ మొత్తం నుంచి 75 శాతం అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చేరింది. మిగిలిన మొత్తాలు పోలీస్‌ అధికారులకు స్థాయిలను బట్టి అందచేశారు. ఈ అనుమతి ఫీజే కాకుండ ప్రతి పందెం నుంచి ప్రధాన పోటీదారుల మధ్య జరిగిన డబ్బు లావాదేవీల్లో రాయల్టీ పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు చేరింది.

కోడిపందాల వద్ద ప్రధానంగా బరి (గ్రౌండ్‌) లు ఉంటాయి. అత్యధికంగా వెంపలో 16 బరిలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు, వందల సంఖ్యలో నాయకులు హాజరయ్యారు. వీరితోపాటు సామాన్య ప్రజలు ముఖ్యంగా యువకులు కోళ్లపై పందాలు కాశారు.

ఇలా ప్రతీ గ్రామంలోనూ కనీసం రెండు, మూడు బరిలు ఏర్పాటయ్యాయి. కోడి పందాలతో పాటు పేకాట, గుండాట, చక్రం ఆట లాంటి అనేక జూదాలు కూడా అనుబంధంగా, సమాంతరంగా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అదే విధంగా అక్కడ ఆహార పదార్ధాల విక్రయం కూడా పెద్ద వ్యాపారమే. ఇక మద్యం ఏరులైపారింది. ట్రాఫిక్‌ సైతం స్తభించిపోయి సామాన్యులు ఇబ్బంది పడ్డారు. హోటళ్ళ గదులు పూర్తిగా నిండిపోయి కిటకిటలాడాయి. రెండువేల రూపాయలు ధర పలికే హోటల్‌ గది బ్లాక్‌లో 10వేల రూపాయలకు చేరింది.

ప్రతీ పందెంలోనూ లక్షల రూపాయలు పందెం కాయడం ఆనవాయితీ అయ్యింది. దీనివల్ల డబ్బు ఎంతమంది పోగొట్టుకుంటారో అదే సమయంలో అంతే మంది సంపాయించుకుంటారు. ఈ విధంగా పైనకాసే పందెంలో ఎటువంటి రాయల్టీ ఎవరికీ ఉండదు. లక్షల రూపాయలు రెండు నిమిషాల వ్యవధిలో చేతులు మారుతుంటుంది. ఈ విధంగా వ్యాపారం జరగడం వల్ల అనుబంధ వ్యాపారాలు కూడా లక్షల్లోనే జరుగుతుంటాయి. ఫలితంగా నిర్వాహకులకు రోజుకు లక్షల్లో ఆదాయం ఉంటుంది. అందువల్ల పోలీసులకు, ప్రజాప్రతినిధులకు యాబైవేల నుంచి యాబై లక్షల వరకు రోజుకు చెల్లించడం ఏమాత్రం కష్టం కాదు. మధ్యలో నష్టపోయేది సామాన్య ప్రజలతోపాటు కోళ్ళ ప్రాణాలు.

కోళ్ళ పందాలను దాదాపు ప్రతిచోట అధికారికంగానూ, అనధికారికంగానూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులే ప్రారంభిస్తుంటారు. తద్వారా ఓట్ల పరంగా ప్రయోజనం ఉంటుందని వారి ఆశ. ప్రజల సంస్కృతిని ఈ విధంగా ఓట్ల కోసం, ఆదాయం కోసం గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం ప్రోత్సహించలేదు. ఇప్పుడు ఈ పందాలు డబ్బు సంపాదనలో పతాకస్థాయికి చేరాయి.

ఇక కోడి పందాల నిర్వహణను కెమెరాలతోనూ చిత్రీకరించారు. డ్రోన్లను ఉపయోగించారు. దీనివల్ల గెలుపొటములపై విభేదాలు తలెత్తితే క్రికెట్ తరహాలో సమస్యను పరిష్కరించడానికి ఆ వీడియోను టీవీ స్క్రీన్‌పై రీప్లే చేస్తుంటారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సైతం సంస్కృతిక ఆదాయ విష వలయంలో భాగమైపోయింది.

First Published:  19 Jan 2019 2:07 AM IST
Next Story