Telugu Global
NEWS

భారత నవయువ తరంగం.... ఖేలో ఇండియా !

గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల పాలిటవరం సత్తా ఉంటే చాలు 6 లక్షల 28వేల ఉపకార వేతనం ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన భారత క్రీడారంగ దశదిశను మార్చే ఖేలో ఇండియా కార్యక్రమం అప్పుడే రెండో ఏడాదిలోకి ప్రవేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కలల రూపంగా… మహారాష్ట్ర ఆతిథ్యంలో ప్రారంభమైన 2019 ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ లో దేశంలోని 29 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 6వేల మంది క్రీడాకారులు… 18 రకాల క్రీడాంశాలలో పోటీపడుతున్నారు. కేంద్రప్రభుత్వ […]

భారత నవయువ తరంగం.... ఖేలో ఇండియా !
X
  • గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల పాలిటవరం
  • సత్తా ఉంటే చాలు 6 లక్షల 28వేల ఉపకార వేతనం

ప్రపంచంలోనే అత్యధిక యువజన జనాభా కలిగిన భారత క్రీడారంగ దశదిశను మార్చే ఖేలో ఇండియా కార్యక్రమం అప్పుడే రెండో ఏడాదిలోకి ప్రవేశించింది.

ప్రధాని నరేంద్ర మోదీ కలల రూపంగా… మహారాష్ట్ర ఆతిథ్యంలో ప్రారంభమైన 2019 ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ లో దేశంలోని 29 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 6వేల మంది క్రీడాకారులు… 18 రకాల క్రీడాంశాలలో పోటీపడుతున్నారు.

కేంద్రప్రభుత్వ వినూత్న పథకం….

జనాభా పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారత్… ఎన్నో రంగాలలో కళ్ళు చెదిరే ప్రగతి సాధించినా….క్రీడారంగంలో మాత్రం వెనుకబడే ఉంది.

ఈ పరిస్థితిని నివారించడానికి, క్రీడారంగ ప్రక్షాళన కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం గత ఏడాదే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ కార్యక్రమం అనూహ్య ఫలితాలను అందించింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మెరికల్లాంటి యువక్రీడాకారులను వెలుగులోకి తీసుకువచ్చింది.

1756 కోట్లతో ప్రత్యేక బడ్జెట్….

ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉన్నా భారత క్రీడారంగ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి గత ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, పథకాలను సమగ్రంగా సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ….ఖేలో ఇండియా అనే వినూత్న కార్యక్రమానికి గత ఏడాదే న్యూఢిల్లీలో అంకురార్పణ చేశారు.

గతంలో ఉన్న రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, పట్టణ ప్రాంతాలలో మౌలిక క్రీడా సదుపాయల కల్పన పథకం, క్రీడారంగంలో జాతీయ ప్రతిభాన్వేషణ పథకాలను మిళితం చేయడం ద్వారా ఖేలో ఇండియా కార్యక్రమానికి తుదిరూపు ఇచ్చారు. ఈ పథకం అమలు కోసం 1,756 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ ను ఏర్పాటు చేశారు.

ఖేలో ఇండియా 2018 సూపర్ హిట్….

2018 ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ ను న్యూఢిల్లీ వేదికగా…విజయవంతంగా నిర్వహించారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిథిలోని 651 జిల్లాలలో ప్రతిభాన్వేషణ శిబిరాలు నిర్వహించడం ద్వారా మొత్తం 16 క్రీడాంశాలలో…. 12వేల 415 మంది బాలబాలికలను గుర్తించారు. వీరంతా 17 సంవత్సరాలలోపు వారే.

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన తొమ్మిదిరోజుల పోటీలలో భాగంగా… అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, జూడో, కబడ్డీ, ఖో-ఖో, షూటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, కుస్తీ అంశాలలో పోటీలు నిర్వహించారు.

హర్యానా అగ్రస్థానం….

ఖేలో ఇండియా నేషనల్ స్కూల్ గేమ్స్ విజేతల కోసం… 199 స్వర్ణ, 199 రజత, 275 కాంస్య పతకాలను ప్రదానం చేశారు. ఈ పోటీలలో హర్యానా నుంచి అత్యధికంగా 396 మంది పాల్గొంటే…. మహారాష్ట్ర నుంచి రికార్డు స్థాయిలో 188 మంది బాలికలు, యువతులు పాల్గొన్నారు.

ఈ పోటీలు నిర్వహించడంలో 912 మంది వాలంటీర్లు, 1200 మంది అధికారులు, సాంకేతిక నిపుణులు పాలుపంచుకొన్నారు. చివరకు హర్యానా జట్టు అత్యధిక పతకాలతో ఓవరాల్ విజేతగా నిలిచింది.

మహారాష్ట్ర ఆతిథ్యంలో 2019 ఖేలో ఇండియా….

ద్వితీయ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ కు మహారాష్ట్ర ఆతిథ్యమిస్తోంది. 360 కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో 10 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు… యువతీ యువకులు మాత్రమే పాల్గొనే వీలుంది.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 6వేల మంది ఖేలో ఇండియా ద్వారా తమ సత్తా చాటుకోడానికి తహతహలాడుతున్నారు. పూణే లోని బాలేవాడీ కాంప్లెక్స్, ముంబైలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్ స్టిట్యూట్, ఎన్ డిఏ హాకీ గ్రౌండ్, మహేంద్ర హాకీ స్టేడియం వేదికలుగా పోటీలు నిర్వహిస్తున్నారు.

ప్రారంభ ఖేలో ఇండియా గేమ్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన స్టార్ షూటర్లు మను బాకర్, సౌరవ్ చౌదరి, మేహులీ ఘోశ్, అథ్లెట్ జిస్నా మాథ్యూ, వెయిట్ లిఫ్టర్ లాల్ రిన్ నుంగా, స్విమ్మర్ శ్రీహరి నటరాజ్, ఆర్చర్ ఆకాశ్ మాలిక్, సాక్షి చౌదరి, అభినవ్ షా, ప్రతిమా కుమార్, లాల్ టాన్ చుంగ్, కర్మాన్ కౌర్ తండీ ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నారు.

ఖేలో ఇండియా ఫలాలు….

2018 ఖేలో ఇండియా గేమ్స్ ద్వారా దూసుకొచ్చిన మను బాకర్, సౌరవ్ చౌదరీ…గోల్డ్ కోస్ట్ వేదికగా ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు మోత మోగిస్తే….అర్జెంటీనా రాజధాని బ్యునోస్ ఏర్స్ వేదికగా ముగిసిన 2018 యువజన ఒలింపిక్స్ లో భారత బృందం పతకాల మోత మోగించింది.

గతంలో ఎన్నడూలేని విధంగా దేశానికి 3 స్వర్ణాలతో సహా మొత్తం 13 పతకాలు అందించడం ద్వారా గర్వకారణంగా నిలిచారు.

ఏంతలో ఎంత మార్పు….

2014 యూత్ ఒలింపిక్స్ లో రెండంటే రెండు పతకాలు మాత్రమే సాధించిన భారత్…2018 ఒలింపిక్స్ లో మాత్రం మూడు స్వర్ణాలు, 9 రజతాలు, ఓ కాంస్యంతో సహా మొత్తం 13 పతకాలతో సంచలనం సృష్టించింది.

భారత అథ్లెట్ల ఈ ఘనత వెనుక…ఖేలో ఇండియా పథకం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన…. ప్రతిభావంతులైన అథ్లెట్లను గుర్తించి..నెలవారీ ఉపకార వేతనాలతో పాటు…అత్యాధునిక శిక్షణ అందచేసిన కారణంగానే….మను బాకర్, జెర్మీ లాల్ రినుంగా, సౌరవ్ చౌధరి లాంటి నవతరం అథ్లెట్లు వెలుగులోకి రాగలిగారు.

2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల్లో భారత్ పతకాల సంఖ్య అనూహ్యంగా పెరగటం వెనుక ఖేలో ఇండియా పథకం ద్వారా వచ్చిన యువఅథ్లెట్ల కష్టం, ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతగానో దాగున్నాయి.

62 కిలోల వెయిట్ లిఫ్టింగ్ లో మిజోరం కుర్రాడు జెర్మీ లాల్ రినుంగా బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. యువజన ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన భారత తొలి క్రీడాకారుడిగా రికార్డుల్లో చేరాడు.

బాలికల 10 మీటర్ల ఏర్ పిస్టల్ షూటింగ్ లో మను బాకర్, బాలుర 10 మీటర్ల ఏర్ పిస్టల్ షూటింగ్ లో సౌరవ్ చౌధరి స్వర్ణభేరి మోగించారు.

వెండికొండలు….

ఇక…బాలుర 10 మీటర్ల ఏర్ రైఫిల్ షూటింగ్ లో తుషార్ మానే, బాలికల 10 మీటర్ల ఏర్ రైఫిల్ విభాగంలో మేహులీ ఘోష్, బాలికల 44 కిలోల జూడోలో తబాబీ దేవి, బాలుర బ్యాడ్మింటన్ సింగిల్స్ లో లక్ష్య సేన్, బాలికల 43 కిలోల కుస్తీలో సిమ్రన్, బాలుర విలువిద్య వ్యక్తగత విభాగంలో ఆకాశ్ మాలిక్, 5 కిలోమీటర్ల నడకలో సూరజ్ పన్వర్ రజత పతకాలు అందించారు. బాలుర, బాలికల హాకీ విభాగాలలో సైతం భారతజట్టు రజత పతకాలు సాధించాయి.

ఇక..బాలుర ట్రిపుల్ జంప్ లో ప్రవీణ్ చిత్రవేల్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద…భారత బృందం 13 క్రీడల్లో పతకాలు సాధించడం విశేషం. హాకీ, జూడో, షూటింగ్ క్రీడల్లో తొలిసారిగా భారత అథ్లెట్లు పతకాలు సంపాదించారు.

జకార్తా వేదికగా ముగిసిన 2018 ఆసియాక్రీడల్లో భారత్ 69 పతకాలతో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాదు…యువజన ఒలింపిక్స్ లో సైతం అదేస్థాయి ఫలితాలు సాధించడమూ…. శుభ సూచకం మాత్రమే కాదు…. మరో రెండేళ్లలో టోక్యో వేదికగా జరుగబోయే ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధించడానికి ఖేలో ఇండియా పథకంతో అంకురార్పణ జరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ప్రతిభావంతులకు ఉపకారవేతనాలు….

ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ లో పాల్గొన్న వారిలో అసాధారణ ప్రతిభావంతులైన వెయ్యిమందికి…నెలకు 500 నుంచి 2 వేల రూపాయల వరకూ ఉపకార వేతనంగా అందిస్తారు.

వివిధ క్రీడల్లో శిక్షణ కోసం ఎంపిక చేసిన వెయ్యి మంది క్రీడాకారులకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన క్రీడాశిక్షణ, చదువు, ఆహార వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఒక్కొక్కరికీ 6 లక్షల 28వేల రూపాయలు చొప్పున ఉపకార వేతనంగా చెల్లించనున్నారు.

2018లో ప్రారంభమైన ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ పథకం కోసం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈ మొత్తాన్ని 2019 నుంచి ఏడాదికి 10 కోట్ల రూపాయల మేర పెంచుతూ పోతారు.

అంతేకాదు…. శిక్షణ కోసం బాలబాలికల సంఖ్యను సైతం ఏడాది ఏడాదికీ పెంచే విధంగా చర్యలు తీసుకొన్నారు.

First Published:  13 Jan 2019 12:04 PM IST
Next Story