Telugu Global
CRIME

ప్రేయసి కోసం స్నేహితుడి హత్య.... మూడేళ్లకు బయటపడ్డ అస్థిపంజరం

మూడేళ్ల తర్వాత ఒక హత్య కేసు మిస్టరీ వీడింది. అనూహ్యంగా మృతుడి అస్థిపంజరం బయటపడడంతో హంతకుడు దొరికిపోయాడు. తన ప్రేయసిని తప్పుదారి పట్టిస్తున్నాడన్న అనుమానంతో స్నేహితుడినే చంపేసి … ఆ తర్వాత మిస్సింగ్ అంటూ నమ్మించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్‌కు చెందిన విజయ్, జయప్రకాశ్‌ మంచి స్నేహితులు. ఉద్యోగం కోసం 2015లో ఢిల్లీ వెళ్లి దాబ్రీ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగారు. ఉద్యోగ  ప్రయత్నాలు ఫలించి ఇద్దరికీ ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయి. అదే సమయంలో […]

ప్రేయసి కోసం స్నేహితుడి హత్య.... మూడేళ్లకు బయటపడ్డ అస్థిపంజరం
X

మూడేళ్ల తర్వాత ఒక హత్య కేసు మిస్టరీ వీడింది. అనూహ్యంగా మృతుడి అస్థిపంజరం బయటపడడంతో హంతకుడు దొరికిపోయాడు. తన ప్రేయసిని తప్పుదారి పట్టిస్తున్నాడన్న అనుమానంతో స్నేహితుడినే చంపేసి … ఆ తర్వాత మిస్సింగ్ అంటూ నమ్మించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మెదక్‌కు చెందిన విజయ్, జయప్రకాశ్‌ మంచి స్నేహితులు. ఉద్యోగం కోసం 2015లో ఢిల్లీ వెళ్లి దాబ్రీ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి ఇద్దరికీ ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చాయి. అదే సమయంలో విజయ్ ఒక యువతిని ప్రేమిస్తూ ఉండేవాడు. ప్రేయసి విషయాలను తొలుత స్నేహితుడు జయప్రకాశ్‌తో విజయ్ పంచుకునేవాడు.

విజయ్ ప్రేయసితో జయప్రకాశ్‌ కూడా ఫోన్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ప్రేయసిని తనకు దూరం చేసేందుకు జయప్రకాశ్‌ ప్రయత్నిస్తున్నాడన్న అనుమానం విజయ్‌కు వచ్చింది. ఆ అనుమానం మరింత ముదిరి హత్యకు ప్లాన్‌ చేశాడు. ఒకరోజు జయప్రకాశ్‌తో గొడవ పెట్టుకుని అపార్ట్‌మెంట్‌లోనే ఫ్యాన్‌ మోటార్‌తో తలపై మోది హత్య చేశాడు.

అనంతరం అపార్ట్‌మెంట్‌ పైభాగంలో పూల మొక్కల కోసం ఏర్పాటుచేసిన మట్టితొట్టెలో జయప్రకాశ్‌ శవాన్ని పాతిపెట్టాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితుడు జయప్రకాశ్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు కూడా చేశాడు. అనంతరం ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేశాడు. ఈ హత్య 2016 ఫిబ్రవరి 12న జరిగింది.

అప్పటి నుంచి జయప్రకాశ్‌ను అంతా తప్పిపోయాడు అనే అనుకున్నారు. కానీ ఇటీవల ఢిల్లీలోని అపార్ట్‌మెంట్‌ యజమాని ఇంటికి మరమ్మతులు చేయిస్తున్న సమయంలో మట్టి తొట్టెను తొలగించేందుకు కూలీల సాయంతో ప్రయత్నించాడు. ఆ సమయంలో అందులో ఆస్థిపంజరం బయటపడింది. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.

గతంలో జయప్రకాశ్‌, విజయ్ అనే యువకులు అద్దెకు ఉండేవారని… జయప్రకాశ్ కనిపించకుండాపోయాడని విజయ్‌ ఫిర్యాదు చేసిన విషయాన్ని పోలీసులకు ఇంటి యజమాని గుర్తు చేశాడు.

దీంతో పోలీసులు ఆస్థిపంజరం, జయప్రకాశ్‌ కుటుంబసభ్యుల డీఎన్‌ఏలకు ల్యాబ్‌లో పోలీసులు పరీక్షలు జరిపించారు. రెండు డీఎన్‌ఏలు ఒకటేనని తేలడంతో హైదరాబాద్‌లో ఉన్న విజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే తాను హత్య చేసినట్టు విజయ్ అంగీకరించాడు.

First Published:  11 Jan 2019 1:11 AM IST
Next Story