సంక్రాంతి పిండి వంటలు…. కొబ్బరి బూరెలు
Kobbari Burelu: సంక్రాంతి పిండి వంటలు…. కొబ్బరి బూరెలు
కావల్సిన వస్తువులు:
- బియ్యప్పిండి- అర కేజీ
- బెల్లం – 300 గ్రా
- పచ్చికొబ్బరి – ఒక చిప్ప
- ఏలకుల పొడి- ఒక టీస్పూన్
- నూనె – బూరెలు కాలడానికి అవసరమైనంత (పై దినుసులకు సుమారు అర కేజీ నూనె అవసరమవుతుంది)
కొబ్బరి బూరెలు తయారీ:
బియ్యాన్ని ముందు రోజు నానబెట్టి ఉదయం పిండిని(అరిసెలకు దంచినట్లే తడి బియ్యాన్ని దంచి జల్లించాలి) సిద్ధం చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురిమి పక్కన పెట్టుకోవాలి.
బెల్లాన్ని పాకం పట్టి (బూరెలకు లేత పాకం సరిపోతుంది, గవ్వలకు పట్టే పాకం కంటే మరికొంత చిక్క పడితే చాలు) కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి కలపాలి. కొబ్బరి సమంగా కలిసిన తర్వాత బియ్యప్పిండి వేసి కలపాలి. బియ్యప్పిండి ఉండలు కట్టకుండా సమంగా కలిసేలా కలపాలి. ఇది బూరెల పిండి.
బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత బూరెల పిండిని చిన్న గోళీ అంత తీసుకుని అరచేతిలో కానీ పాలిథిన్ పేపర్ మీద కాని వేసి వేళ్లతో వత్తి నూనెలో వేయాలి. రెండు వైపులా కాలిన తర్వాత తీసేయాలి. నూనె లో నుంచి తీసిన పది నిమిషాలకు (వేడి తగ్గిన తర్వాత) తింటే బూరె రుచిగా ఉంటుంది.