కెప్టెన్ కొహ్లీ అపురూప సిరీస్ విజయం
కంగారూ సిరీస్ విజయంతో కొహ్లీ టాప్ ఆసియా దేశాల ఏకైక కెప్టెన్ విరాట్ కొహ్లీ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఓ అపూర్వ, అసాధారణ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్ట్ సిరీస్ లో ఓడించిన సారథిగా నిలిచాడు. ఈ ఘనతను సొంతం చేసుకొన్న ఆసియా దేశాల క్రికెట్ తొలి కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సిడ్నీలో ముగిసిన ఆఖరి టెస్ట్ .. వర్షం దెబ్బతో […]
- కంగారూ సిరీస్ విజయంతో కొహ్లీ టాప్
- ఆసియా దేశాల ఏకైక కెప్టెన్ విరాట్ కొహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ ఓ అపూర్వ, అసాధారణ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓ టెస్ట్ సిరీస్ లో ఓడించిన సారథిగా నిలిచాడు. ఈ ఘనతను సొంతం చేసుకొన్న ఆసియా దేశాల క్రికెట్ తొలి కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా సిడ్నీలో ముగిసిన ఆఖరి టెస్ట్ .. వర్షం దెబ్బతో డ్రాగా ముగియడంతో టీమిండియా 2-1తో సిరీస్ ను కైవసం చేసుకొంది. గత 71 సంవత్సరాలలో టీమిండియా తొలిసారిగా కంగారూలను కంగారూ గడ్డపై చిత్తు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
హేమాహేమీలకు దక్కని గౌరవం…
గత భారత కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, మహేంద్రసింగ్ ధోనీలకు దక్కని గౌరవం కొహ్లీకి సొంతమయ్యింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ దేశాల గడ్డపై టీమిండియాకు టెస్ట్ విజయాలు అందించిన తొలి కెప్టెన్ గా సైతం విరాట్ కొహ్లీ చరిత్ర సృష్టించాడు.
సౌరవ్ గంగూలీ పేరుతో ఉన్న అత్యధిక విదేశీ టెస్ట్ విజయాల రికార్డును సైతం కొహ్లీ అధిగమించాడు. ప్రస్తుత సిడ్నీ టెస్ట్ వరకూ… విదేశీ గడ్డపై 25 టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన కొహ్లీకి ిఇది రికార్డుస్థాయిలో 11వ గెలుపు కావడం ఓ రికార్డు.
దాదాను మించిన కొహ్లీ….
సౌరవ్ గంగూలీ 28 టెస్టుల్లో 11 గెలుపు, 10 ఓటమి, 7 డ్రా మ్యాచ్ ల రికార్డుతో ఉంటే….విరాట్ కొహ్లీ మాత్రం 25 టెస్టుల్లో 11 విజయాలు, 9 పరాజయాలు, 5 డ్రాల రికార్డుతో అగ్రస్థానంలో నిలిచాడు.
విదేశీ సిరీస్ ల్లో కెప్టెన్ గా గంగూలీ విజయశాతం 51.78 శాతంగా ఉంటే…విరాట్ కొహ్లీకి 54.16 శాతం ఉండటం విశేషం.
ఇంతకు ముందే శ్రీలంక, వెస్టిండీస్ గడ్డపై టీమిండియాకు టెస్ట్ సిరీస్ విజయాలు అందించిన కొహ్లీ…ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపైనా తన జట్టును విజేతగా నిలపడం మరో అరుదైన రికార్డుగా నిలిచింది.
గాల్లో తేలిపోతున్న విరాట్….
క్రికెటర్ గా తన కెరియర్ లో ఇదో అద్భుత విజయంగా, అసాధారణ ఘనతగా మిగిలిపోతుందంటూ విరాట్ కొహ్లీ పొంగిపోతున్నాడు. సిడ్నీ టెస్ట్ డ్రాగా ముగియడంతోనే…కొహ్లీ తన జట్టు సభ్యులతో కలసి కేరింతలు కొట్టాడు.
జట్టు సభ్యులను చూసి తాను గర్విస్తున్నానని…గత 71 సంవత్సరాలలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సిరీస్ విజేతగా నిలవడం ఇదే మొదటిసారని…11 ప్రయత్నాలలో తొలిసారిగా సఫలమయ్యామని మురిసిపోతున్నాడు.
సిరీస్ గెలుపు అంటే ఇదేరా….
బ్యాటింగ్ లో పూజారా, కొహ్లీ, రహానే, మయాంక్ అగర్వాల్, బౌలింగ్ లో పేస్ త్రయం జస్ ప్రీత్ బుమ్రా, షమీ, ఇశాంత్ శర్మ, స్పిన్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ ల అసాధారణ ఆటతీరుతోనే కంగారూ గడ్డపై టీమిండియా ఈ అపురూప విజయం సాధించగలిగింది.
ఎనిమిదిన్నర దశాబ్దాల భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుత ఈ బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ విజయం అపూర్వ విజయంగా మిగిలిపోతుంది.