పోర్‌బందర్.... బాపూ పుట్టిన నేల
”గాంధీ పుట్టిన ప్రదేశమా ఇది” అని పాడుకోవాలన్నంత ఉత్సాహంగా అడుగుపెడతాం పోర్‌బందర్‌లో. నిజమే అది జాతిపితకు జన్మనిచ్చిన ప్రదేశమే. అయితే స్వచ్ భారత్ అంటూ దేశమంతా చీపుళ్లతో చిమ్ముతున్న ప్రభుత్వాలు, స్వచ్ భారత్ ప్రోగ్రామ్‌కి గాంధీజీ కళ్లద్దాలనే చిహ్నంగా నిర్ణయించిన ప్రభుత్వం, గాంధీ జయంతి రోజునే స్వచ్ భారత్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన ప్రభుత్వాలు… పోర్‌బందర్ వీథులను చిమ్మకుండా ఎందుకు వదిలేశాయో అర్థం కాదు. పోర్‌బందర్ జిల్లా కేంద్రం. ప్రభుత్వ ఆఫీసులు బ్రిటిష్ కాలం నాటి చెక్క తలుపులు, […]
”గాంధీ పుట్టిన ప్రదేశమా ఇది” అని పాడుకోవాలన్నంత ఉత్సాహంగా అడుగుపెడతాం పోర్‌బందర్‌లో. నిజమే అది జాతిపితకు జన్మనిచ్చిన ప్రదేశమే.
అయితే స్వచ్ భారత్ అంటూ దేశమంతా చీపుళ్లతో చిమ్ముతున్న ప్రభుత్వాలు, స్వచ్ భారత్ ప్రోగ్రామ్‌కి గాంధీజీ కళ్లద్దాలనే చిహ్నంగా నిర్ణయించిన ప్రభుత్వం, గాంధీ జయంతి రోజునే స్వచ్ భారత్ ప్రోగ్రామ్‌ని ప్రారంభించిన ప్రభుత్వాలు… పోర్‌బందర్ వీథులను చిమ్మకుండా ఎందుకు వదిలేశాయో అర్థం కాదు.
పోర్‌బందర్ జిల్లా కేంద్రం. ప్రభుత్వ ఆఫీసులు బ్రిటిష్ కాలం నాటి చెక్క తలుపులు, తుప్పు పట్టిన ఇనుపగేట్లతో నిర్వహణ సరిలేని పురాతన భవనాల్లా ఉంటాయి. ఆవులు నడివీథుల్లో తిరుగుతూ వాహనాలకు అడ్డు వస్తుంటాయి. ప్రభుత్వ కార్యాలయాల గేటు తెరిచి ఉంటే ఏ మాత్రం సంశయించకుండా ఆవరణలోకి వెళ్తుంటాయి.
ఫాదర్ ఆఫ్ నేషన్ పుట్టిన ఊరిని ప్రత్యేకంగా గుర్తించి అభివృద్ధి చేయడం, నిర్వహణకు నిధుల కొరత రాకుండా శాశ్వత కార్పస్ ఫండ్ కేటాయించడం వంటివేమీ ఉండవా… అని ఒక్క క్షణం మనసు మెలిపెట్టినట్లవుతుంది.
అన్నీ ఉన్నాయి!
పోర్‌బందర్‌లో గాంధీజీ పుట్టిన బాపూ మహల్ ఉంది. దాని పక్కనే గాంధీజీ గౌరవార్థం కట్టిన కీర్తిమందిర్ ఉంది. యాభై వేల షిప్పుల రవాణాకు అనువైన భారీ పోర్టు ఉంది.
పోర్టుకు కేటాయించిన తీరం కాకుండా స్వచ్ఛమైన ఇసుకతో చక్కటి చౌపాటీ బీచ్ ఉంది. బర్డ్ సాంక్చురీ ఉంది. ప్లానిటోరియం (తారా మందిర్) ఉంది.
కల్చరల్, హిస్టారికల్, జామెట్రికల్ స్టడీస్‌ను ప్రదర్శించే భారత్ మందిర్ ఉంది. రామకృష్ణ మిషన్ ఉంది. ఏడవ శతాబ్దం నాటి శివాలయం ఉంది. పట్టణంలోకి ప్రవేశించడానికి చక్కటి నేషనల్ హైవే, అత్యాధునికమైన ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్ ఉన్నాయి. అది ఉంది ఇది లేదు అనడానికి వీల్లేదు.
ఒక్క స్వచ్‌భారత్ పరిశుభ్రత తప్ప అభివృద్ధి చెందిన పట్టణానికి ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే… కృష్ణుని స్నేహితుడు సుధాముని మందిరం, వాళ్లిద్దరికీ చదువు చెప్పిన సాందీపుని మందిరం కూడా ఉన్నాయి. అవి రెండూ విశాలమైన నిర్మాణాలు.
సుధాముని మందిరం వందల ఏళ్ల నాటిది. ఈ ఆలయంలో అటుకుల ప్రసాదంగా ఉంటుంది. ఆ ప్రసాదానికి ”ఇంత” అని ధర ఏమీ ఉండదు. ప్రసాదం తీసుకుని మనకు తోచినంత పళ్లెంలో వేయవచ్చు, వేయకపోవచ్చు. పూజారులు, హారతి పళ్లేలు ఉండవు. సాందీపుని మందిరాన్ని హరి మందిర్ అంటారు. దీని నిర్మాణశైలి కూడా అద్భుతంగా ఉంటుంది.
ఇళ్లు ఒకదాని వెనుక ఒకటి
గాంధీజీ పుట్టిన బాపూ మహల్‌కి వెనుక వైపే ఉంటుంది కస్తూర్బా గాంధీ ఇల్లు. ఆ ఇళ్లను బట్టి చూస్తే గాంధీజీ కంటే కస్తూర్భాది సంపన్న కుటుంబం అనిపిస్తుంది. గాంధీజీ ఇంటి ఎక్స్‌టర్నల్ ఎలివేషన్ లో పర్షియన్ శైలి కనిపిస్తుంది. ఆ ఇంట్లో గాంధీజీ పుట్టిన ప్రదేశంలో స్వస్తిక్ గుర్తు ఉంటుంది.
గోడకు గాంధీజీ రాట్నం వడుకుతున్న పెయింటింగ్, దానికి పత్తి తోరణం ఉంటాయి. ఇంటి నిర్మాణ శైలి గొప్పగా ఉండదు, కానీ వైవిధ్యంగా ఉంటుంది. ముందు వరండా, వెనుక గదులు, దాదాపుగా మూడవ వంతు గదికి అటక ఉంటుంది. ఆ అటక మీద లోపలగా పెట్టిన వస్తువును కిందికి దించాలంటే నిచ్చెన మీద నుంచి అందే అవకాశమే ఉండదు.
మనిషి అటక లోపలికి దూరి వెళ్లాల్సిందే. ఏడాదికి సరిపడిన దినుసులను సేకరించి దాచుకోగలిగినంత అటకలవి. పై అంతస్థుకి వెళ్లడానికి చెక్క మెట్లు, మెట్ల టర్నింగ్ లో పట్టుకుని ఎక్కడానికి ఆధారంగా లావుపాటి పలుపుతాడు ఉంటాయి.
వర్షాల్లేనప్పుడు వండుకోవడానికి పూర్తి స్థాయి వంటగది, వర్షాల్లో తడవకుండా వండుకోవడానికి మరో చిన్న ఏర్పాటు ఉంది. ఆ ఇంటి వెనుక దారి నుంచి బయటపడితే కస్తూర్భా ఇంటికి చేరుకుంటాం. ఆ రెండు ఇళ్లకు మధ్య వారధి లాంటి నిర్మాణం (తర్వాత పర్యాటకుల కోసం కట్టినది) ఉంది.
కస్తూర్భా ఇంట్లో ప్రతి పడగ్గదికి ఒక మూల చిన్న గట్టు ఉంది. దానిని బాత్‌రూమ్ అనలేం, కానీ వాడిన నీరు బయటకు వెళ్లే ఏర్పాటు కూడా ఉంది. బాపూ మహల్‌కు పక్కనే కీర్తిమందిర్, దాని నిర్మాణం, నిర్వహణ కూడా బాగుంటాయి. ఇది కేవలం గాంధీజీ గౌరవార్థం కట్టిన మందిరం. సంస్మరణ మందిరం లాంటిది.
బాపూ మందిర్, రీక్తి మందిర్‌ల నుంచి బయట పడిన తర్వాత రోడ్డు కూడలిలో గాంధీజీ పాలరాతి విగ్రహం ఉంది. ఆ కూడలిని గాంధీ చౌక్ అంటారు. పెద్ద విశాలమైనదేమీ కాదు, ఇరుకు రోడ్లే. పోర్‌బందర్ సముద్ర తీరాన ఉన్న పట్టణం కావడంతో బ్రిటిష్ పాలన ప్రభావం, భవన నిర్మాణంలో నాటి ఆనవాళ్లు ఎక్కువగా ఉంటాయి.
ఇక్కడ హుజూర్ ప్యాలెస్‌ను చూడడం కూడా గొప్ప అనుభూతి. పోర్‌బందర్ రాజు నట్వర్ సింగ్ నిర్మించిన ప్యాలెస్ ఇది. సముద్ర తీరాన ఉంది. పట్టణమంతా చుట్టి రావడానికి ఐదారు గంటలు పడుతుంది. అన్నీ చూశాక సముద్ర తీరానికి వస్తే… సాయంత్రం సూర్యుడు అరేబియా సముద్రానికి సలామ్ చేయడానికి నీటి మీదకు దిగుతున్నట్లు కనిపిస్తాడు.
-మంజీర