ఉత్తమ్, భట్టి అంత పని చేశారా?
ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు నిరాశ మిగిల్చాయి. అయితే ఓటమికి వెనుక కారణాలేంటి? అనే అంశాలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు దృష్టిపెట్టారు. అయితే ప్రధానంగా నాయకత్వ లోపమే కారణమని వాదనలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు ఓ ఆసక్తికర అంశాన్ని కూడా కొందరు కాంగ్రెస్ నేతలు సమీక్ష సమావేశంలో బయటపెడుతున్నారు. కనీసం ఇంకా 10 నుంచి 15 కాంగ్రెస్ గెలిచే సీట్లు ఓడిపోవడానికి పీసీసీ నాయకత్వమే కారణమని ఎత్తిచూపుతున్నారు. ఎన్నికలంటేనే డబ్బు. ఎలక్షన్ ఫండ్ ముఖ్యం. […]
ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు నిరాశ మిగిల్చాయి. అయితే ఓటమికి వెనుక కారణాలేంటి? అనే అంశాలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు దృష్టిపెట్టారు.
అయితే ప్రధానంగా నాయకత్వ లోపమే కారణమని వాదనలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు ఓ ఆసక్తికర అంశాన్ని కూడా కొందరు కాంగ్రెస్ నేతలు సమీక్ష సమావేశంలో బయటపెడుతున్నారు. కనీసం ఇంకా 10 నుంచి 15 కాంగ్రెస్ గెలిచే సీట్లు ఓడిపోవడానికి పీసీసీ నాయకత్వమే కారణమని ఎత్తిచూపుతున్నారు.
ఎన్నికలంటేనే డబ్బు. ఎలక్షన్ ఫండ్ ముఖ్యం. పార్టీ పరంగా అభ్యర్థులకు అంతో ఇంతో సాయం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్థికంగా బలంగా లేదు. కానీ ఇతర రాష్ట్రాలు, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన డబ్బుతో పార్టీ ఫండ్ ఏర్పాటు చేశారు.
జనరల్ నియోజక వర్గానికి కోటి రూపాయలు, బీసీ అభ్యర్థులు ఉన్న చోట రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని నేతలకు సూచించారు. క్యాండిడేట్లు ఆర్థికంగా వెనుకబడిన చోట వారికి సాయం చేయాలని పీసీసీ నేతలను ఆదేశించారు.
కాంగ్రెస్ హైకమాండ్ సూచనలను పక్కన పెట్టి పీసీసీ నేతలు వ్యవహరించారని ఇప్పుడు పోస్టుమార్టమ్‌లో తేలుతుంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఈ నిధులను పక్క దారి పట్టించారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరు చెరో 15 నియోజక వర్గాలకు పంచాల్సిన డబ్బులను తమ నియోజక వర్గాల్లో ఖర్చు పెట్టారని కొందరు కాంగ్రెస్ నేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు.
వీరి నియోజక వర్గాల్లో భారీగా ఖర్చు పెట్టడంతో వారు గెలిచారని…. లేకపోతే కష్టంగా ఉండేదని అంటున్నారు. తమ జేబుల్లో డబ్బులు తీయకుండా పార్టీ డబ్బులు ఖర్చు పెట్టారని వాపోతున్నారు.
ఈఇద్దరు నేతలు పార్టీ పరంగా కొంచెం ఆర్థిక సాయం చేయడంతో పాటు… పార్టీ ఇచ్చిన డబ్బులను సక్రమంగా పంపిణీ చేసి ఉంటే ఐదు నుంచి పది నియోజక వర్గాల్లో పరిస్థితి వేరుగా ఉండేదని వీరు వివరిస్తున్నారు.