ప్రపంచ క్రికెట్లో భారత బుల్లెట్ రిషభ్ పంత్
20 ఏళ్ల వయసులోనే తొలి టెస్ట్ సెంచరీ పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన వికెట్ కీపింగ్ టీమిండియా అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం రిషభ్ టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్…కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజు ఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు. 12 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ…విదేశీ గడ్డపై సాధించిన అత్యధిక పరుగుల రికార్డును రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు. […]
- 20 ఏళ్ల వయసులోనే తొలి టెస్ట్ సెంచరీ
- పవర్ ఫుల్ బ్యాటింగ్, పదునైన వికెట్ కీపింగ్
- టీమిండియా అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం రిషభ్
టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్…కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరిటెస్టు రెండోరోజు ఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు. 12 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ…విదేశీ గడ్డపై సాధించిన అత్యధిక పరుగుల రికార్డును రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు.
ఢిల్లీ టు టెస్ట్ క్రికెట్….
రిషభ్ పంత్… భారత క్రికెట్లో మాత్రమే కాదు…అంతర్జాతీయ క్రికెట్లోనూ మార్మోగిపోతున్న పేరు. రిషభ్ పంత్.. ఈ పేరులోనే ఏదో తెలియని శక్తి, పవర్, వైబ్రేషన్.
21 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడు…క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ వయసుకు మించిన ప్రతిభతో వారేవ్వా అనిపించుకొంటున్నాడు. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్, ఇన్ స్టంట్ వన్డే క్రికెట్… ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్ క్రికెట్… ఇలా ఫార్మాట్ ఏదైనా నిర్భయంగా బ్యాటింగ్ చేయడంలో మొనగాడు.
జూనియర్ స్థాయి నుంచే….
జూనియర్ స్థాయి నుంచే…ఎటాకింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా సత్తా చాటుకొన్న రిషభ్….టీమిండియా దిగ్గజం, జూనియర్ టీమ్ శిక్షకుడు రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటుదేలాడు.
ఢిల్లీ లోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన రిషభ్ …ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో సభ్యుడిగా ఐపీఎల్ లో పాల్గొనడం ద్వారా తన బ్యాట్ పవర్ ఏంటో చాటుకొన్నాడు.
ఇండియా-ఏ జట్టులో సభ్యుడిగా సైతం నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడమేకాదు.. ధోనీ, దినేశ్ కార్తీక్, పార్థివ్ పటేల్, వృద్ధిమాన్ సాహా లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా…సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు.
టీ-20తో టెస్ట్ క్యాప్….
బెంగళూరు వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టీ-20 మ్యాచ్ ద్వారా…టీమిండియా క్యాప్ అందుకొన్న రిషభ్…2018 ఇంగ్లండ్ టూర్ లోనే…టెస్ట్ అరంగేట్రం చేశాడు.
నాటింగ్ హామ్ వేదికగా ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ ద్వారా 20 ఏళ్ల చిరుప్రాయంలోనే రిషభ్ పంత్ టెస్ట్ క్యాప్ సాధించాడు.
ఇంగ్లండ్ పైనే టెస్ట్ శతకం…
అదే సిరీస్ లో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఆఖరిటెస్ట్ మ్యాచ్ ఆఖరి ఇన్నింగ్స్ లో రిషభ్ ఓ మెరుపు సాధించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.
ఆఖరిటెస్ట్ ఆఖరిరోజు ఆటలో…. ఫైటింగ్ సెంచరీ సాధించడం ద్వారా… గతంలో ఏ భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సాధించని ఘనతను సొంతం చేసుకొన్నాడు. కేవలం 20 ఏళ్ల వయసులోనే… ఓ టెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన టీమిండియా తొలి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టించాడు.
ఓపెనర్ రాహుల్ తో కలసి ఆరో వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన రిషభ్ పంత్..15 బౌండ్రీలు, 4 సిక్సర్లతో… కేవలం తన రెండోటెస్ట్ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లోనే మూడంకెల స్కోరు సాధించగలిగాడు.
2007 సిరీస్ లో ఇంగ్లండ్ పై నాలుగో ఇన్నింగ్స్ లో మహేంద్రసింగ్ ధోనీ సాధించిన 76 పరుగుల నాటౌట్ స్కోరే… అప్పటి వరకూ…. నాలుగో ఇన్నింగ్స్ లో ఓ భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అత్యధిక స్కోరుగా ఉంది. అయితే…ఆ రికార్డును రిషభ్ పంత్… ఓవల్ టెస్ట్ ద్వారా తెరమరుగు చేయగలిగాడు.
కంగారూ గడ్డపై రిషభ్ షో….
ఆ తర్వాత…ఆస్ట్రేలియాతో ప్రారంభమైన … నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సైతం…వికెట్ కీపింగ్ తో పాటు…బ్యాటింగ్ లోనూ రిషభ్ పంత్ మెరుపులు మెరిపించాడు.
వికెట్ కీపర్ గా ….మొదటి మూడుటెస్టుల్లోనే 21 క్యాచ్ లు పట్టి…నరేన్ తమానే, కిర్మాణీల పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.
ఇక…బ్యాటింగ్ లో సైతం…రిషభ్ తన బ్యాటింగ్ పవరేంటో…కంగారూ బౌలర్లకు రుచి చూపించాడు. వన్ డౌన్ చతేశ్వర్ పూజారా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలతో కలసి కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడం ద్వారా…టీమిండియా స్కోరు 600 మార్క్ చేరడంలో ప్రధానపాత్ర వహించాడు.
9వ టెస్టులో రెండో సెంచరీ….
కీలక భాగస్వామ్యాలు నమోదు చేయడంతో పాటు… పంత్ మొత్తం 189 బాల్స్ ఎదుర్కొని 15 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో తన కెరియర్ లోనే అత్యుత్తమ స్కోరు సాధించాడు.
ఈ క్రమంలో ..కంగారూ గడ్డపైన సెంచరీ సాధించిన భారత తొలి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు…గత పుష్కరకాలంగా …మహేంద్ర సింగ్ ధోనీ పేరుతో ఉన్న రికార్డును సైతం.. పంత్ అధిగమించాడు.
2006 సిరీస్ లో భాగంగా ఫైసలాబాద్ వేదికగా జరిగిన టెస్టులో అప్పటి భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏకంగా 148 పరుగుల స్కోరు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును ఆస్ట్రేలియా గడ్డపై 159 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా రిషభ్ పంత్ అధిగమించాడు.
ఫ్యూచర్ స్టార్ రిషభ్….
కేవలం .. 21 సంవత్సరాల వయసులోనే… రిషభ్ పంత్… తన కెరియర్ లో ప్రస్తుత సిడ్నీ టెస్ట్ వరకూ ఆడిన తొమ్మిది టెస్టు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 700కు పైగా పరుగులు సాధించడం విశేషం.
ఒక్కమాటలో చెప్పాలంటే…. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీకి…. ఈ ఢిల్లీ డైనమైటే అసలు సిసలు వారసుడని… భారత్ క్రికెట్ అమ్ములపొదిలో తాజా అస్త్రమని ప్రత్యేకంగా చెప్పాలా మరి.