Telugu Global
NEWS

సిడ్నీ టెస్టు రెండోరోజు ఆటలో టీమిండియా 7 వికెట్లకు 622 డిక్లేర్

చతేశ్వర్ పూజారా 193, రిషభ్ పంత్ 159 నాటౌట్, జడేజా 81 పరుగులు 7వ వికెట్ కు పంత్ – జడేజా సరికొత్త రికార్డు సిడ్నీ టెస్టు రెండోరోజు ఆటలో … నయావాల్ చతేశ్వర్ పూజారా, మిడిలార్డర్ ఆటగాళ్లు రిషభ్ పంత్, రవీంద్ర జడేజా చెలరేగిపోడంతో… టీమిండియా భారీస్కోరుతో ఇన్నింగ్స్ ను ముగించింది. 7 వికెట్లకు 622 పరుగులతో డిక్లేర్ చేసింది. సమాధానంగా ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 24 పరుగుల స్కోరుతో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో […]

సిడ్నీ టెస్టు రెండోరోజు ఆటలో టీమిండియా 7 వికెట్లకు 622 డిక్లేర్
X
  • చతేశ్వర్ పూజారా 193, రిషభ్ పంత్ 159 నాటౌట్, జడేజా 81 పరుగులు
  • 7వ వికెట్ కు పంత్ – జడేజా సరికొత్త రికార్డు

సిడ్నీ టెస్టు రెండోరోజు ఆటలో … నయావాల్ చతేశ్వర్ పూజారా, మిడిలార్డర్ ఆటగాళ్లు రిషభ్ పంత్, రవీంద్ర జడేజా చెలరేగిపోడంతో… టీమిండియా భారీస్కోరుతో ఇన్నింగ్స్ ను ముగించింది. 7 వికెట్లకు 622 పరుగులతో డిక్లేర్ చేసింది.

సమాధానంగా ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 24 పరుగుల స్కోరుతో నిలిచింది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన టీమిండియా… పరుగుల మోత మోగించింది.

తొలిరోజు ఆటలో 19వ శతకం బాదిన పూజారా…డబుల్ సెంచరీ సాధించడం లో విఫలమయ్యాడు. చివరకు 193 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. రిషభ్ పంత్ 159 పరుగుల స్కోరుతో నాటౌట్ కాగా…రవీంద్ర జడేజా 81 పరుగులకు అవుటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో లయన్ 4 వికెట్లు, హేజిల్ వుడ్ 2, స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.

7వ వికెట్ కు సరికొత్త రికార్డు…

టీమిండియా జోడీ రిషభ్ పంత్- రవీంద్ర జడేజా …ఏడో వికెట్ భాగస్వామ్యానికి 204 పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పారు.

ఈ ఇద్దరు ఎడమచేతి వాటం ఆటగాళ్లు..కంగారూ బౌలర్లను ఓ ఆటాడుకొన్నారు. సిడ్నీ వేదికగా 7వ వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన భారతజంటగా రికార్డుల్లో చేరారు.

రిషభ్ పంత్ మొత్తం 189 బంతులు ఎదుర్కొని 15 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 159 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిస్తే… రవీంద్ర జడేజా 114 బాల్స్ లో 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 81 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

జడేజా కెరియర్ లో ఇది 10 టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. 30 ఏళ్ల జడేజా ప్రస్తుత సిడ్నీ టెస్ట్ వరకూ 41 మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, 10 అర్థ సెంచరీలతో సహా 1485 పరుగులు సాధించాడు.

పూజారా డబుల్ మిస్….

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పూజారా జోరు కొనసాగుతోంది.

సిడ్నీ టెస్ట్ తొలిరోజు ఆటలో సెంచరీ సాధించిన పూజారా…రెండో రోజు ఆటలో మాత్రం…డబుల్ సెంచరీకి ఏడు పరుగుల దూరంలో అవుటయ్యాడు.

మొత్తం 373 బాల్స్ ఎదుర్కొని 22 బౌండ్రీలతో 193 పరుగుల స్కోరుకు…ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ కు అవుటయ్యాడు.

తన కెరియర్ లో ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు సాధించిన పూజారా… నాలుగో డబుల్ మాత్రం పూర్తి చేయలేకపోయాడు. ప్రస్తుత సిరీస్ లో ఇప్పటి వరకూ ఆడిన ఏడు ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలతో సహా 520కి పైగా పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ప్రస్తుత సిడ్నీ టెస్ట్ వరకూ 68 మ్యాచ్ లు ఆడిన పూజారా 18 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలతో సహా 5వేల 500 పరుగులు సాధించడం విశేషం.

అప్పుడు ధోనీ… ఇప్పుడు రిషభ్…

టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్… కంగారూ గడ్డపై సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సిడ్నీ టెస్టు రెండోరోజు ఆటలో రిషభ్ పంత్ మెరుపు సెంచరీతో చెలరేగిపోయాడు. 12 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ…విదేశీ గడ్డపై సాధించిన అత్యధిక పరుగుల రికార్డును రిషభ్ పంత్ తెరమరుగు చేశాడు.

2006 సిరీస్ లో భాగంగా ఫైసలాబాద్ వేదికగా ముగిసిన టెస్టులో అప్పటి భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏకంగా 148 పరుగుల స్కోరు సాధించాడు.

ఇప్పుడు ఆ రికార్డును ఆస్ట్రేలియా గడ్డపై 159 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా రిషభ్ పంత్ అధిగమించాడు.

పంత్ మొత్తం 189 బాల్స్ ఎదుర్కొని 15 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో తన కెరియర్ లోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు.

21 సంవత్సరాల రిషభ్ పంత్ తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన తొమ్మిది టెస్టు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 700కు పైగా పరుగులు సాధించడం విశేషం.

First Published:  4 Jan 2019 10:45 AM IST
Next Story