ససాన్ గిర్.... సింహం షికారు చేసే నేల
ఒకప్పుడు అమితాబ్ బచన్ గుజరాత్ టూరిజాన్ని భుజాల మీద మోస్తూ విపరీతంగా టీవీల్లో కనిపించేవాడు. సింహంలాంటి కంఠంతో మాట్లాడుతూ తల మీద కౌబాయ్ హ్యాట్‌ను సవరించుకుంటూ జీపు దిగేవాడు. జూలు విదుల్చుకుంటున్నట్లు బైనాక్యులర్స్ తీసేవాడు. కెమెరాను సింహాల మీదకు ఎక్కు పెట్టేవాడు. ఆ అడ్వర్టయిజ్‌మెంట్‌ని చూసిన వాళ్లు వింటి నుంచి వదిలిన బాణంలా గిర్ అడవులకు పరుగులు తీసేటట్లు ఉండేదా యాడ్. ”ససాన్ గిర్ అడవులను చూసొద్దాం. సింహం జూలుతో ఆడుకుందాం” అన్నంతగా ప్రభావితం చేసేది ఆ […]
ఒకప్పుడు అమితాబ్ బచన్ గుజరాత్ టూరిజాన్ని భుజాల మీద మోస్తూ విపరీతంగా టీవీల్లో కనిపించేవాడు. సింహంలాంటి కంఠంతో మాట్లాడుతూ తల మీద కౌబాయ్ హ్యాట్‌ను సవరించుకుంటూ జీపు దిగేవాడు. జూలు విదుల్చుకుంటున్నట్లు బైనాక్యులర్స్ తీసేవాడు. కెమెరాను సింహాల మీదకు ఎక్కు పెట్టేవాడు.
ఆ అడ్వర్టయిజ్‌మెంట్‌ని చూసిన వాళ్లు వింటి నుంచి వదిలిన బాణంలా గిర్ అడవులకు పరుగులు తీసేటట్లు ఉండేదా యాడ్. ”ససాన్ గిర్ అడవులను చూసొద్దాం. సింహం జూలుతో ఆడుకుందాం” అన్నంతగా ప్రభావితం చేసేది ఆ యాడ్.
గుజరాత్ రాష్ట్రంలో ఉంది ససాన్‌గిర్ ఫారెస్ట్. సోమనాథ్ నుంచి 74 కి.మీ.ల దూరం. గంటన్నర ప్రయాణంలో చేరుకోవచ్చు, కానీ ఫారెస్ట్ జోన్‌ని ఎంజాయ్ చేయాలంటే మెల్లగా వెళ్తే రెండు గంటలు పడుతుంది. ఈ అడవిలో రెండు వందల రకాల పక్షులుంటాయి. వంద రకాల చిన్న పెద్ద జంతువులుంటాయి. యాభై – అరవై రకాల చెట్లుంటాయి.
ప్రయాణం చిన్న తుప్పలను దాటి దట్టమైన అడవిలోకి వెళ్లే కొద్దీ మన కళ్లు ఆ చెట్లను, పక్షులను పట్టించుకోవడం మానేస్తాయి. సింహం కోసం వెతుకులాటలో పడిపోతాయి. ఫారెస్ట్‌లో డైరెక్షన్ సూచిస్తూ సైన్‌బోర్డులుంటాయి. అడవి లోపలకి బయటి వాహనాలను అనుమతించరు. వాటిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పాయింట్ దగ్గర వరకే అనుమతిస్తారు.
అక్కడి నుంచి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాహనాల్లో వెళ్లాలి. ఆ వాహనాల విండోలకు ఇనుప మెష్ ఉంటుంది. ఆ వాహనాల్లో ప్రయాణించడానికి టికెట్ తీసుకోవాలి.
అడవిలోని చిన్న జంతువులే కాదు ఏకంగా సింహమే వచ్చి వాహనం మీద లంఘించినా సరే లోపలి వాళ్లకు ఇబ్బంది కలగనంత పటిష్టంగా ఉంటుందా మెష్. ఆ వాహనాలు పర్యాటకులను సింహాలు, ఇతర జంతువులు సంచరించే ప్రదేశాల్లో తిప్పుతాయి.
నీటి మడుగులో సేద దీరే జంతువులు, చెట్టు కింద నిద్రపోతున్న సింహాలు, అప్పుడు నిద్రలేచి వచ్చే వాహనాలను ”ఇది మాకు మామూలే” అన్నట్లు చూసే సింహాలు, గదుల్లో తిరుగుతున్న సింహం పిల్లలు కనిపిస్తాయి.
సింహం పిల్లలను పెద్ద జంతువులు చంపి తినకుండా రక్షణ కోసం వాటిని గదుల్లో ఉంచుతారు. ఆ గదులకు చుట్టూ విశాలమైన ఆవరణకు చుట్టూ గట్టి ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ నుంచి మనం వాటిని, అవి మనల్ని చూసుకోవచ్చు.
జూన్ నుంచి అక్టోబర్ వరకు నో ఎంట్రీ
గిర్ అడవుల్లోకి ఏడాదిలో ఎప్పుడైనా వెళ్లవచ్చు. కానీ డెన్స్ జోన్‌కి జూన్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు నిషేధం. అది సింహాల మేటింగ్ సీజన్. ఆ సమయంలో సింహాలు చాలా వైల్డ్‌గా వ్యవహరిస్తాయి. కాబట్టి ఆ సమయంలో అనుమతించరు. ఒక్కో ఏడాది వర్షాలు ఆలస్యమై సీజన్ ఆలస్యంగా మొదలైతే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా నిషేధం కొనసాగుతుంది.
కాబట్టి గిర్ ఫారెస్ట్ కి వెళ్లడానికి నవంబర్ నుంచి మార్చి లోపు మంచి సమయం. దట్టమైన జోన్ లో జీప్ సఫారీ చేయాలన్నా ఇదే మంచి సమయం.
మన సింహాల నిలయమైన గిర్ అడవుల్లో 1965లో నేషనల్ పార్కు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ససాన్ జోన్‌లో గిర్ సాంక్చురీ ని ఏర్పాటు చేశారు. ఇదంతా సింహాలను పరిరక్షించి, వాటి సంతతిని పెంచడానికే. ఇప్పుడు గిర్ ఫారెస్ట్‌లో మూడు వందలకు పైగా సింహాలుంటాయి. ఆదివారం గిర్ ఫారెస్ట్‌కి వెళ్లేటట్లయితే లయన్ షోను మిస్ కాకూడదు.
అడవిలో అమర్చిన కెమెరాలు క్యాప్చర్ చేసిన సహజమైన దృశ్యాలను ప్రదర్శిస్తారు. సింహం వేటాడ్డం నుంచి సింహం అడుగుల చప్పుడుకి ఇతర జంతువులు బెదిరి ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీయడం వరకు అనేక సీన్లుంటాయి.
మొదట్లో 2,560 చదరకు కిలోమీర్ల విస్తీర్ణం ఉండేది గిర్ ఫారెస్ట్. ఇప్పుడది పదిహేను వందల లోపుకి కుదించుకుపోయింది. ఎన్ని వన్యప్రాణులున్నా పర్యాటకుల మీద దాడి చేసినటువంటి అవాంఛనీయ సంఘటనలు కనిపించవు. వన్యప్రాణుల మీద తుపాకీ ఎక్కు పెట్టడం వంటి చట్టవ్యతిరేకమైన పనేదీ చేయకుండా పద్ధతిగా చూసి రావాలి. వాటికి హాని కలిగించడం సాహసం ఏ మాత్రం కాదు, అది నేరం.
– మంజీర