థార్.... గ్రేట్ డెజర్ట్
ఎడారికి గొప్పతనమేంటో విచిత్రం… అనుకుంటాం. కానీ థార్ ఎడారికి కొన్ని గొప్పతనాలున్నాయి. ఆ గొప్పతనాలే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇది మనదేశంలోనూ, పాకిస్థాన్‌లోనూ విస్తరించింది… అని చదువుతాం. కానీ అది కాదు నిజం. దేశ విభజనలో ఎడారి రెండుగా చీలిపోయింది. కొన్ని కుటుంబాల మధ్య బంధాలు తెగిపోయినట్లే ఎడారికి కూడా రెండు భాగాలయింది. సరిహద్దు రేఖ గీసేసిన తర్వాత ఓ ఇరవై ఏళ్లకు జరిగిన ఘోరం ఏంటో తెలుసుకుని అటు ఉండిపోయిన వాళ్లు ఇటు వైపు రావడానికి, ఇటు […]
ఎడారికి గొప్పతనమేంటో విచిత్రం… అనుకుంటాం. కానీ థార్ ఎడారికి కొన్ని గొప్పతనాలున్నాయి. ఆ గొప్పతనాలే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇది మనదేశంలోనూ, పాకిస్థాన్‌లోనూ విస్తరించింది… అని చదువుతాం. కానీ అది కాదు నిజం. దేశ విభజనలో ఎడారి రెండుగా చీలిపోయింది.
కొన్ని కుటుంబాల మధ్య బంధాలు తెగిపోయినట్లే ఎడారికి కూడా రెండు భాగాలయింది. సరిహద్దు రేఖ గీసేసిన తర్వాత ఓ ఇరవై ఏళ్లకు జరిగిన ఘోరం ఏంటో తెలుసుకుని అటు ఉండిపోయిన వాళ్లు ఇటు వైపు రావడానికి, ఇటు ఉన్న వాళ్లు అటు వైపు వెళ్లడానికి అనుమతిచ్చింది ప్రభుత్వం.
అప్పుడు సరిహద్దు ఆవల ఉన్న తమ సమీప బంధువుల కోసం మనదేశంలో ఉన్న వేలాది ముస్లిం కుటుంబాలు పాకిస్థాన్‌కు వెళ్లిపోయాయి. అలాగే హిందూ కుటుంబాలు మనదేశానికి వచ్చాయి.
పంపకం ఇలాగ
మొత్తం రెండు లక్షల ముప్పై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుందీ ఎడారి. అందులో రెండు లక్షల చదరపు కిలోమీటర్లు మనదేశంలో ఉంది. మనం థార్ అంటున్నాం.
పాకిస్థాన్ వాళ్లు తమ ప్రాంతంలో ఉన్న భాగానికి ఖలిస్తాన్ ఎడారి అని పేరు పెట్టుకున్నారు. మనదేశంలో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో, పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది ఈ ఎడారి.
నాటి నది… నేటి ఎడారి
అలహాబాద్ త్రివేణి సంగమం అంటే గంగ, యమున, సరస్వతి నదుల సమ్మేళనం అని చెబుతారు. గంగ కనిపిస్తుంది, యమున కనిపిస్తుంది. సరస్వతి ఎక్కడ? అని అడిగితే అంతర్లీనంగా ప్రవహిస్తోందని చెప్పి మభ్య పెడతారు. నిజానికి సింధు నాగరకత కాలం నాటి ఈ నది నేలలో ఇంకి పోయి ఎడారిగా మారిందని చెబుతున్నారు పరిశోధకులు.
ఘగ్గర్ నది దాని పాయ అంటారు. అప్పట్లో ప్రజల దాహార్తిని తీర్చిన నది. నీరు ఇంకిపోయింది. నది ఎండి పోయింది. జనం వలస పోయారు. వెళ్లిన వాళ్లు వెళ్లగా, ఉన్న వాళ్లు తమదైన ప్రత్యేక సంస్కృతిని స్థిరీకరించారు.
ఇప్పుడు ఎడారిలో లుని అనే ఉప్పు నీటి నది ప్రవహిస్తోంది థార్ ఎడారిలో. ఇందిరా కెనాల్ ఈ ఎడారి మధ్య ప్రవహిస్తూ పంటలను, గొంతులను తడుపుతోంది. ప్రపంచంలో ఎడారిలో నివసిస్తున్న జనం లెక్క చూస్తే… అత్యధిక జనాభా కలిగిన ఎడారి ఇదే.
ఇక్కడ ఎందుకు పర్యటించాలి?
దేశంలో ఇన్ని టూరిస్టు ప్లేస్‌లుండగా ఎడారికెళ్లడం ఎందుకు? అంటే… ఈ ఎడారిలో అభయారణ్యాలున్నాయి. అరుదైన పక్షిజాతులున్నాయి. వన్యప్రాణులున్నాయి. ఎడారికే పరిమితమైన ఒయాసిస్సులున్నాయి. వింటర్‌లో డెజర్ట్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఏడాది మొత్తం ఇక్కడి వాళ్లు చేసుకునే పండుగలన్నీ ఒక్కసారే జరుపుతున్నట్లు ఉంటుంది వేడుక. ఆ కల్చర్‌ను ప్రతిబింబించే ఆటలు, పాటలుంటాయి.
పాముల ఆటలు, పపెట్ షో, జానపద నృత్యాలు, గిరిజనుల గేయాలుంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీలకు పడిపోతాయి. అందుకే రాత్రిళ్లు చలిమంటలు వేస్తారు. నెగళ్ల దగ్గర చలికాచుకుంటూ ట్రైబల్ డాన్స్‌ను ఎంజాయ్ చేయడానికి ఇది మంచి అవకాశం.
డాన్స్‌తోపాటు డాన్సర్‌ల దుస్తులు, ఆభరణాలు ఎడారి సంస్కృతికి అద్దం పడుతుంటాయి. ఎడారి ఆహారమూ ప్రత్యేకమైనదే. థార్ ఎడారిలో జీప్ సఫారీ, కామెల్ సఫారీ రెండూ ఉంటాయి.
కుటుంబం మొత్తం వెళ్లినట్లయితే జీప్ సఫారీ ఓకే. కానీ హనీమూన్ కపుల్‌కి కామెల్ సఫారీ మధురానుభూతినిస్తుంది.
ట్రైబల్ కల్చర్
ఎడారి జనావాసాల్లో జిప్సీ, బిష్ణోయి, భిల్లు, మినా, లోహారు, గరసియాన్, సహారియా, రాబారి తెగల వాళ్లు నివసిస్తారు. వాళ్ల వస్ర్తధారణలో, డాన్సుల్లో కూడా తేడా ఉంటుంది. వేటికవే భిన్నంగా ఉంటాయి. స్పష్టమైన వైవిధ్యం కనిపిస్తుంది. ఈ ఫెస్టివల్‌లో రాజస్థాన్ రాజఠీవికూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
ఈ టూర్‌లో గైడ్‌లను అడిగి స్థానిక వాటర్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ని తెలుసుకోవాలి. అది ఒక సైన్స్. సరదాగా టైమ్ స్పెండ్ చేయడానికి, కల్చరల్ డైవర్సిటీని, బయో డైవర్సిటీని ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్రదేశం. అందుకే సల్మాన్ ఖాన్ కూడా వెళ్లాడు.
అయితే వన్య ప్రాణులను చూడడానికి బైనాక్చులర్స్ తీసుకెళ్లకుండా, భుజానికి గన్ తగిలించుకుని వెళ్లాడు. మనం బైనాక్యులర్స్‌తో వెళ్తే చాలు. కేసుల బారిన పడకుండా, కోర్టు మెట్లెక్కకుండా ఎడారి ట్రిప్‌ను స్వీట్‌మెమొరీగా గుర్తుంచుకోవచ్చు.
– మంజీర