Telugu Global
International

గువాహ‌టి.... కామాఖ్య సాక్షిగా ఎలిఫెంట్ స‌ఫారీ

బ్ర‌హ్మ పుత్ర న‌ది, నీలాచ‌ల్ కొండ‌, ఆ కొండ మీద కామాఖ్య ఆల‌యం, కొండ శిఖ‌రం మీద భువ‌నేశ్వ‌రి ఆల‌యం గువాహ‌టి స్పెష‌ల్స్‌. భువ‌నేశ్వ‌రి ఆల‌యం నుంచి చూస్తే గువాహ‌టి న‌గ‌రం మొత్తం క‌నిపిస్తుంది. ఈ న‌గ‌రానికి విమానంలో వెళ్లేట్ల‌యితే ఏరియ‌ల్ వ్యూని మిస్ కాకూడ‌దు. గ్రీన‌రీ మ‌ధ్య బ్ర‌హ్మ‌పుత్ర న‌ది అందంగా క‌నిపిస్తుంది. ఈ న‌ది అస్సాం రాష్ట్రాన్ని రెండుగా చీలుస్తూ ప‌శ్చిమం నుంచి తూర్పు వ‌ర‌కు సాగిపోతుంది ప్ర‌వాహం. బ్ర‌హ్మ పుత్ర నదికి ద‌క్షిణాన […]

గువాహ‌టి.... కామాఖ్య సాక్షిగా ఎలిఫెంట్ స‌ఫారీ
X

బ్ర‌హ్మ పుత్ర న‌ది, నీలాచ‌ల్ కొండ‌, ఆ కొండ మీద కామాఖ్య ఆల‌యం, కొండ శిఖ‌రం మీద భువ‌నేశ్వ‌రి ఆల‌యం గువాహ‌టి స్పెష‌ల్స్‌. భువ‌నేశ్వ‌రి ఆల‌యం నుంచి చూస్తే గువాహ‌టి న‌గ‌రం మొత్తం క‌నిపిస్తుంది.

ఈ న‌గ‌రానికి విమానంలో వెళ్లేట్ల‌యితే ఏరియ‌ల్ వ్యూని మిస్ కాకూడ‌దు. గ్రీన‌రీ మ‌ధ్య బ్ర‌హ్మ‌పుత్ర న‌ది అందంగా క‌నిపిస్తుంది. ఈ న‌ది అస్సాం రాష్ట్రాన్ని రెండుగా చీలుస్తూ ప‌శ్చిమం నుంచి తూర్పు వ‌ర‌కు సాగిపోతుంది ప్ర‌వాహం. బ్ర‌హ్మ పుత్ర నదికి ద‌క్షిణాన ఉంటుంది గువాహ‌టి న‌గ‌రం. సిటీ వేగంగా డెవ‌ల‌ప్ అవుతోంది.

కానీ, ప్రాచీన సంప్ర‌దాయాల‌ను వదలి పెట్ట‌డం లేదు. జంతుబ‌లుల వంటి దురాచారాలు ఇంకా ఉన్నాయ‌క్క‌డ‌. కామాఖ్య ఆల‌యం 51 శ‌క్తి పీఠాల్లో ఒక‌ట‌ని చెబుతారు. అమ్మ‌వారికి జంతుబ‌లి ఇవ్వ‌డం ఇక్క‌డ చాలా మామూలు విష‌యం. ఈ ఒక్క ఆచారాన్ని ప‌క్క‌న పెడితే ఆల‌య నిర్మాణ శైలిని ఎంజాయ్ చేయ‌కుండా ఉండ‌లేం.

ప‌ద‌వ శ‌తాబ్దంలో కోశ్ రాజు ఈ ఆల‌యాన్ని నిర్మించాడ‌ని చెబుతారు. భౌగోళిక స్థితిగ‌తులు భ‌వ‌న నిర్మాణానికి పెద్ద అనువుగా లేని చోట ఇంత గొప్ప నిర్మాణం చేప‌ట్ట‌డం మెచ్చుకోద‌గిన విష‌య‌మే కానీ, ఈ ప్ర‌య‌త్నం జ‌న‌హిత‌మైన ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాల కోసం చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అని కూడా అనిపిస్తుంది. అయ‌తే ఇప్పుడు గువాహ‌టికి మేజ‌ర్ టూరిస్ట్ అట్రాక్ష‌న్‌ల‌లో ఈ ఆల‌యానిదే తొలి స్థానం.

ఫెర్రీ ప్ర‌యాణం

ఇప్ప‌టి వ‌ర‌కు హ‌నీమూన్ క‌పుల్ టూరిస్ట్ స్పాట్ కాకుండా తీర్థ‌యాత్ర‌ను పోలిన జ‌ర్నీ చేసిన త‌ర్వాత ఇప్పుడు లాహిరి లాహిరి లాహిరిలో… అంటూ ఫెర్రీ బోట్‌లో బ్ర‌హ్మ‌పుత్ర న‌దిలో ప్ర‌యాణం చేస్తూ అస‌లైన హ‌నీమూన్‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

అయితే ఈ జ‌ర్నీ గ‌మ్యం కూడా ఓ ఆల‌య‌మే. బ్ర‌హ్మ‌పుత్ర న‌ది మ‌ధ్య‌లో చిన్న దీవి, ఆ దీవిలో ఉంటుంది ఉమానంద ఆల‌యం. ఆ త‌ర్వాత చూడాల్సిన న‌వ‌గ్ర‌హ ఆల‌యం ఖ‌గోళ విజ్ఞాన వేదిక‌. వీటిని చూసిన త‌ర్వాత వ‌శిష్ట ఆశ్ర‌మాన్ని చూడ‌డం ఒక చారిత్ర‌క అవ‌స‌రం.

ఎందుకంటే మ‌న‌దేశంలో దాదాపుగా ప్ర‌తి పుణ్య‌క్షేత్రంలోనూ, ప‌ర్యాట‌క ప్ర‌దేశంలోనూ అగ‌స్త్యుడు లేదా వ‌శిష్టుడు సంచ‌రించిన లేదా నివ‌సించిన ప్ర‌దేశాలుంటాయి. కొన్ని ఆన‌వాళ్ల తో ఒక స్థ‌ల పురాణ‌మూ ఉంటుంది.

ప్రాచీన కాలంలో వ‌శిష్టుడు ఇక్క‌డ ఆశ్ర‌మం నిర్మించి నివ‌సించాడ‌ని చెబుతారు. ఇక్క‌డ ప్ర‌కృతి ప‌చ్చ‌ద‌నంతోపాటు మూడు పాయ‌లు అల‌రిస్తాయి. ల‌లిత‌, కాంత‌, సంధ్య అనే నీటి పాయ‌లు (న‌ది అన‌లేం) ఇక్క‌డ బ్ర‌హ్మ‌పుత్ర న‌దిలో క‌లుస్తాయి.

క‌త్తిలాంటి సాంక్చురీలు

న‌గ‌రంలో జూ, బొటానిక‌ల్ గార్డెన్‌, ఆమ్‌చంగ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, నెహ్రూ పార్క్‌ల‌లో విహారం, దీపోర్ బీల్ స‌ర‌స్సులో బోట్ రైడ్ థ్రిల్‌నిస్తాయి.

వీట‌న్నింటికంటే అస్సాం స్టేట్ మ్యూజియం చూడ‌డం మంచి అనుభ‌వం. ఇది పురాత‌న కాలం నాటి శిల్పాలు, ఆధునిక చ‌రిత్ర‌కాలం నాటి క‌ళాఖండాల నిల‌యం. అస్సాం రాష్ట్రం అన‌గానే నేచ‌ర్ ల‌వ‌ర్స్ ఇష్ట‌ప‌డే ప్ర‌దేశం అనే అనుకుంటాం. కానీ హిస్ట‌రీ, ఆర్కియాల‌జీ, జాగ్ర‌ఫీ స్టూడెంట్స్‌కి కూడా ఇది మంచి టూరిస్ట్ స్పాట్‌.

ఇక్క‌డి వైల్ట్ లైఫ్ సాంక్చురీల‌ను చూస్తే ప్ర‌పంచంలో ఇంత గొప్ప ప్ర‌కృతి సౌంద‌ర్యాన్ని, జీవ వైవిధ్యాన్ని మ‌రెక్క‌డా చూడ‌లేమేమో అనిపిస్తుంది. అది కూడా అక్టోబ‌ర్ నుంచి మే నెల మ‌ధ్య‌లో చూడాలి. అస్సాం అడ‌వుల్లో ఖ‌డ్గ‌మ్రుగం క‌నిపించ‌లేదేంటా అని చూస్తే… అది ప‌బితోరా వైల్డ్‌లైఫ్ సాంక్చురీలో ఉంటుంది. ఇది గువాహ‌టి న‌గ‌రానికి దాదాపు 60 కిమీల దూరంలో ఉంటుంది. వ‌న్య‌ప్రాణుల‌ను చూడ‌డానికి స‌ఫారీలుంటాయి.

ఎలిఫెంట్ స‌ఫారీ, జీప్ స‌ఫారీ చేయ‌వ‌చ్చు. హ‌నీమూన్ క‌పుల్‌కి ఎలిఫెంట్ స‌ఫారీనే క‌రెక్ట్‌. ప్ర‌యాణిస్తున్న‌ట్లే ఉంటుంది కానీ దారి త్వ‌ర‌గా సాగ‌దు. ఇంకా ఇలా చాలా సేపు ప్రయాణించాల‌నిపించేట‌ట్లు ఉంటుంది ఏనుగు మంద‌గ‌మ‌నం. ల‌య‌బ‌ద్దంగా సాగే గంట‌ల చ‌ప్పుళ్లు, అంబారీలో ఉన్న వాళ్లు కూడా ఏనుగు క‌ద‌లిక‌ల‌తోపాటు క‌దులుతుంటారు. ప్ర‌యాణం త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని కూడా అనిపించ‌దు.

ఇంకా కొద్ది సేపు అలా సాగితే బావుణ్న‌నే అనిపిస్తుంది. ”మిమ్మ‌ల్ని మేము చూస్తున్నాం” అన్న‌ట్లు ప‌క్షులు కిల‌కిల‌మంటుంటాయి. ఈ సాంక్చురీలో ఏకంగా రెండు వేల ర‌కాల ప‌క్షులుంటాయి.

గువాహ‌టి… న‌గ‌రం కావ‌డంతో అక్క‌డ ర‌బ్బ‌రు చెట్లు, టీ తోట‌లు క‌నిపించ‌వు. ఆ లోటును ప‌బితోరా జ‌ర్నీ తీరుస్తుంది.

మూడు మ‌తాల స‌మ్మేళ‌నం

గువాహ‌టి నుంచి పాతిక కిలోమీట‌ర్లు వెళ్తే హాజో ప‌ట్ట‌ణం వ‌స్తుంది. ఇది ప్రాచీన యాత్రా స్థ‌లం.

విశేషం ఏమిటంటే… ఒకే ప్ర‌దేశాన్ని హిందువులు, ముస్లింలు, బౌద్ధులు కూడా ప‌విత్రంగా భావిస్తారు. మ‌నుషుల్లో దేవుడు క‌నిపించేది ఇలాంటి ప్ర‌దేశాల‌ను చూసిన‌ప్పుడే.

మంజీర‌

First Published:  27 Dec 2018 1:31 AM IST
Next Story