కేసీఆర్, జగన్ మధ్యనున్నది ఈ స్వామీజీనేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ వెళ్లివచ్చాక టీడీపీ శిబిరంలో ఆందోళన ఎక్కువైందట. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ల మధ్య ఏదో జరిగిందనే భావనలు టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయట… శారదా పీఠాధిపతి స్వరూపానంద ఆశ్రమం కేంద్రంగా కేసీఆర్, జగన్ లు ఏదో చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఘనవిజయం సాధించడంతో బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ వెళ్లివచ్చాక టీడీపీ శిబిరంలో ఆందోళన ఎక్కువైందట. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ ల మధ్య ఏదో జరిగిందనే భావనలు టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయట… శారదా పీఠాధిపతి స్వరూపానంద ఆశ్రమం కేంద్రంగా కేసీఆర్, జగన్ లు ఏదో చేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట.
తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి చంద్రబాబు అభాసుపాలయ్యారు. ఘనవిజయం సాధించడంతో బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించారు. మరి కేసీఆర్ ఇచ్చే ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటనే ఆసక్తి ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై అగ్గి రాజేసింది. తాజాగా కేసీఆర్ స్వామి ఆశీర్వాదం కోసమంటూ విశాఖ వచ్చి వెళ్లడంతో తెలుగు తమ్ముళ్లు కేసీఆర్ జగన్ తో కలిసి ఏదో స్కెచ్ గీయడానికే శారదా పీఠానికి వచ్చాడని… స్వామి స్వరూపానందను ఉపయోగించుకున్నాడనే చర్చ టీడీపీలో తీవ్రంగా జరుగుతోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్… చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తాననగానే ఆయన మిత్రుడు ఒవైసీ కూడా మద్దతు ప్రకటించాడు. ఐయామ్ కమింగ్ టు ఆంధ్రా అంటూ జగన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించాడు. మరి కేసీఆర్ ఆంధ్రాలో వేలు పెట్టాలంటే టీడీపీకి ప్రధాన పోటీదారుగా ఉన్న వైసీపీతోనే వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే జగన్ కు, కేసీఆర్ కు మధ్య ఎవరున్నారనే చర్చ టీడీపీలో తీవ్రమైందట.
కేసీఆర్ కు, జగన్ కు మధ్య స్వరూపానంద ఉన్నారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ అందుకు టీడీపీ నేతలు పలు కారణాలు చెబుతున్నారు. కేసీఆర్ తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు ముందు స్వరూపానంద చేతుల మీదుగానే రాజశూయ యాగం నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత ఆయన్ను విశాఖలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇక జగన్ పాదయాత్రకు ముహూర్తం పెట్టింది కూడా స్వరూపానందానే.. జగన్ కూడా పాదయాత్రకు ముందు స్వరూపానంద ఆశీస్సులు తీసుకొని తన యాత్రను మొదలు పెట్టారు. దీంతో వీరిద్దరి వెనుకాల ఉండి స్వరూపానంద కథ నడిపిస్తున్నారనే చర్చ టీడీపీలో వ్యక్తమవుతోందట. కేసీఆర్, జగన్ కు ఆది గురువుగా స్వరూపానంద ఉండడమే టీడీపీ అనుమానాలకు కారణమవుతోందట.. కానీ ఈ చర్చను స్వరూపానంద భక్తులు, ఆశ్రమ నిర్వాహకులు ఖండిస్తున్నారు.