Telugu Global
Family

గౌతముడు

“గౌతముడు” రామాయణ భారతాదుల్లో రెండింటా ఉన్నాడు! అహల్యను గుర్తు చేసుకుంటే గౌతముడూ గుర్తుకొస్తాడు. ఎందుకంటే అహల్యను పెళ్ళాడింది గౌతముడే! గౌతముడు చూస్తే ముని! అహల్య చూస్తే అందాల రాశి! అదికూడా బ్రహ్మ మెరుగులు దిద్దిన సౌందర్య రాశి! రూపవతి! గుణవతి! ఆమె అందానికి చలించని ఇంద్రాది దేవతలు లేనే లేరు. దిక్పాలకులు లేనే లేరు. అలాంటి సుందరాంగిని గౌతముడెలా పెళ్ళాడాడు? ఒకవైపు అహల్యను పెళ్ళాడడానికి దేవతలు పోటిపడ్డారు. నాకివ్వంటే నాకివ్వని అహల్యకోసం బ్రహ్మను అర్థించారు. భూ ప్రదక్షిణం […]

“గౌతముడు” రామాయణ భారతాదుల్లో రెండింటా ఉన్నాడు!

అహల్యను గుర్తు చేసుకుంటే గౌతముడూ గుర్తుకొస్తాడు. ఎందుకంటే అహల్యను పెళ్ళాడింది గౌతముడే!

గౌతముడు చూస్తే ముని! అహల్య చూస్తే అందాల రాశి! అదికూడా బ్రహ్మ మెరుగులు దిద్దిన సౌందర్య రాశి! రూపవతి! గుణవతి! ఆమె అందానికి చలించని ఇంద్రాది దేవతలు లేనే లేరు. దిక్పాలకులు లేనే లేరు. అలాంటి సుందరాంగిని గౌతముడెలా పెళ్ళాడాడు?

ఒకవైపు అహల్యను పెళ్ళాడడానికి దేవతలు పోటిపడ్డారు. నాకివ్వంటే నాకివ్వని అహల్యకోసం బ్రహ్మను అర్థించారు. భూ ప్రదక్షిణం చేసిన వారికే అహల్య నిచ్చి పెళ్ళిచేస్తానన్నాడు బ్రహ్మ.

గౌతముడు భూ ప్రదక్షిణ చేసి రాలేదు. సగం ఈనిన గోవుచుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చాడు. ప్రదక్షిణను సమతుల్యం చేశాడు. బ్రహ్మ మెచ్చాడు. అహల్యనిచ్చాడు. పెళ్ళి చేశాడు.

గౌతముడలా అహల్యను సాధించుకున్నాడు. అయితే ఒకరోజు కోడి కూతవిన్న గౌతముడు తెల్లవారు ఝాము అయిందని నదికి బయల్దేరాడు. నక్షత్రాలు చూస్తే నడినెత్తిన వున్నాయి. దిగువకు దిగిరాలేదు. అర్ధరాత్రిగానే వుందని అర్థం చేసుకొని గౌతముడు తిరిగి ఇంటికి వెళ్ళాడు. అహల్య పక్కన తన రూపంలో వున్న ఇంద్రుని చూశాడు. ఆగ్రహంతో అహల్యను పాషాణం కమ్మని శపించాడు. ఇంద్రున్ని శరీరమంతా యోనులుగా వుండేలా శపించాడు. అహల్య వేదన విని తన తప్పు లేదని గ్రహించి శాపవిముక్తమూ చెప్పాడు. రాయిలా వుండే అహల్య రామపాదం సోకి శాప విముక్తురాలైంది. ఇంద్రుని కామ దాహానికి మోసానికి శాపవిముక్తి లేదు. అయితే ఇంద్రుని వేడుకోలు విని అవి అందరికి కళ్ళుగా కనిపించేలా – తనకి మాత్రం యథావిథిగా కనిపించేలా చేశాడు.

గౌతముడు తీవ్రంగా శపించడం వలన తనకున్న గొప్ప శక్తుల్ని పోగొట్టుకున్నాడు. అలా కోల్పోయిన శక్తుల్ని తిరిగిపొందడానికి హిమాలయాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేశాడు. సాధించాడు.

అహల్య శాప విముక్తమైన సమయానికి గౌతముడు వస్తాడు.

గౌతమునికీ అహల్యకూ శతానీకుడు అనే కొడుకు కలిగినట్లు కూడా చెబుతారు. అహల్య విషయంలో గౌతముని ఆవేశం, శాపం ఇవే మనకు తెలుసు. అంతకు మించి తాను విత్తనాలు చల్లితే ఫలాలు వచ్చేలా బ్రహ్మ నుండి వరం పొందడంతో – ప్రజలను కరువు కాటకాల నుండి రక్షించాడు. అది తోటి మునులకు ఈర్ష్య కలిగించింది. దాంతో మాయాగోవును సృష్టించి పంట తినేసేలా చేయడంతో – గౌతముడు మంత్రించి నీళ్ళు చల్లి పొమ్మన్నాడు. ఆ నీళ్ళు పడగానే ఆగోవు చనిపోయింది. గోహత్య పాతకమని – అలాంటి ఇంట భోజనం చేసేది లేదని తోటి మునులు లేచి వెళ్ళబోతే పరిహారం కోరాడట గౌతముడు. శివుని గురించి తపస్సు చేసి ప్రత్యక్షమైతే గంగని విడవమని కోరాడట. శివుడు తలమీది జడపాయ తీసి యిచ్చాడట. ఆ పాయ గంగగా పారిందట. అదే గోదావరి నది అయ్యిందట. చనిపోయిన గోవు బతికి లేచిందట. స్త్రీగా మారిందట. ఈర్ష్య పడ్డ మునుల తప్పుడు బుద్దికి గౌతముని చేత శపించబడ్డారట.

సప్త ఋషులలో గౌతముడికీ స్థానం ఉంది!

– బమ్మిడి జగదీశ్వరరావు

———————————————————————————————

First Published:  25 Dec 2018 6:47 PM IST
Next Story