Telugu Global
Family

Christmas Santa: క్రిస్మస్‌ తాత

Christmas Santa: దేవుడు అడిగిన వాళ్లకే వరాలు ఇస్తే, అడగని వాళ్లకీ, అడగలేని చిన్న పిల్లలకూ బహుమతులిచ్చే తాత క్రిస్మస్‌ తాత! అందుకే మనకందరికీ 'క్రిస్మస్‌' అనగానే క్రిస్‌మస్‌ తాత గుర్తుకు వస్తాడు. అతనిచ్చే బహుమతులూ గుర్తుకొస్తాయి. ఆ అపురూపమైన ఆనందం కోసం ఏడాదికేడాదీ ఎదురుచూస్తూ ఉంటాం.

Christmas Santa
X

క్రిస్మస్‌ తాత

Christmas Santa: దేవుడు అడిగిన వాళ్లకే వరాలు ఇస్తే, అడగని వాళ్లకీ, అడగలేని చిన్న పిల్లలకూ బహుమతులిచ్చే తాత క్రిస్మస్‌ తాత! అందుకే మనకందరికీ 'క్రిస్మస్‌' అనగానే క్రిస్‌మస్‌ తాత గుర్తుకు వస్తాడు. అతనిచ్చే బహుమతులూ గుర్తుకొస్తాయి. ఆ అపురూపమైన ఆనందం కోసం ఏడాదికేడాదీ ఎదురుచూస్తూ ఉంటాం. ఆ సంతోషం సంబరం అంతా ఇంతా కాదు. ఎవరికి ఏ బహుమతి కావాలని కోరుకుంటారో ఆ బహుమతే వస్తుంది. కోరని వాళ్లకు ఊహించని బహుమతులు వస్తాయి. ఎవరెవరికి ఏయే బహుమతులు వచ్చాయో చూసుకుని మురిసిపోతూ ముచ్చటించుకుంటూ ఉంటే మరో పక్క క్రిస్మస్‌ తాత నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు.

నెత్తి మీద టోపి, పండు గడ్డం, ముఖం నిండా నల్లని ఎర్రని గుర్తుల రంగులూ, ఎర్రటి అంగరఖా పై నుంచి కింది వరకు అబ్బో చూడటానికి ఎంత బావుంటాడో కదా?! అందుకే అందరం క్రిస్మస్‌ తాతయ్య వెంట పడతాం. ఆ వేషం వేసినాయన నిజంగానే బహుమతులు పంచుతాడు. మరి అలాంటి క్రిస్మస్‌ తాతయ్య ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవద్దూ?

అప్పుడెప్పుడో మూడవ శతాబ్దంలో ఒక బిషప్‌ ఉండే వాడట. అతని పేరు సెయింట్‌ నికోలస్‌. పిల్లలంటే అతనికి చాలా ఇష్టం. మురిపెం. అలాగే పేదలన్నా చాలా కరుణ చూపేవాడట. ఆ ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడట. అతనికి ముగ్గురు ఆడపిల్లలట. వారికి పెళ్లిళ్లు చేయలేక ఆ రైతు కుమిలిపోయాడట. అది చూసి బిషప్‌ క్రిస్మస్‌ తాత వేషంలో వెళ్లాడట. ఎవ్వరూ చూడకుండా రహస్యంగా వెళ్లాడట. వెళ్లి ఆ రైతు ఇంటి కిటికీలోంచి బంగారు సంచులు జార విడిచాడు. అలా మొదలై ఎంతో మందికి బహుమతులు తీసుకొచ్చి ఇచ్చే తాతగా మారిపోయాడట. క్రిస్మస్‌ తాతనే 'శాంతాక్లాజ్‌' అని అంటారు. అంటే డచ్‌లో సెయింట్‌ నికోలస్‌ పేరు వాడుకలో అలా మారిందన్న మాట. అదిగో అప్పట్నుంచి ఆ మంచి పనిని అందరికీ సంతోషం కలిగించే పనిని నిజం చెప్పాలంటే 'సహకార గుణాన్ని కొనసాగించడంలో భాగంగానే' ఇప్పటికీ బహుమతులు పంచిపెట్టడం జరుగుతోందన్నమాట.

పండగొచ్చిందంటే చాలు స్నేహితులు, బంధువులు తామే బహుమతుల్ని పిల్లలకి పేరు పేరునా ఇచ్చి క్రిస్మస్‌ తాత ఇచ్చినట్లుగా చెపుతారన్న మాట.

తెలుసుగా, 'క్రిస్మస్‌ ట్రీ'కు బహుమతులు వేళాడదీస్తారు. రాత్రి బహుమతుల పూలు పూసిన చెట్టు - అది కూడా పేరు పేరునా పూసిన చెట్టు- పొద్దున్నే ఎవరి పేరు మీద ఉన్నవి వాళ్ల సొంతం కావడం చెప్పలేని అనుభూతి.

మనకి దగ్గరి వారికి ఏదో ఒకటి ఇవ్వడం, అలాగే లేని వారికి మనకున్నది ఇవ్వడం... అదీ క్రిస్మస్‌ తాత వేషం వేసుకుని బహుమతులు పంచి ఇవ్వడం, భలేభలే బాగుంటుంది కదా!?

మనమూ పెద్దయ్యాక క్రిస్మస్‌ తాత వేషం వేద్దాం. మనం తీసుకున్న వాటికన్నా ఎక్కువే పంచిపెడతాం! అందరి ఆనందంలోనే మన సంతోషం ఉంది!!

- బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  24 Dec 2022 6:32 PM GMT
Next Story