40 లక్షల మందికి రుణమాఫీ.... ఆశగా ఎదురుచూస్తోన్న రైతన్నలు!
భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్…. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడానికి కారణం రుణమాఫీ. అన్నదాతకు అండగా నిలిచిన టీఆర్ఎస్ సర్కార్… ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. ఈ మేరకు రెండవ సారి బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు… రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొంచేందుకు కసరత్తు ప్రారంభించారు. 2014లో ప్రభుత్వం 35.29 […]
భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్…. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడానికి కారణం రుణమాఫీ. అన్నదాతకు అండగా నిలిచిన టీఆర్ఎస్ సర్కార్… ఇప్పుడు లక్ష రూపాయల రుణమాఫీని అమలు చేసేందుకు కసరత్తును ప్రారంభించింది. ఈ మేరకు రెండవ సారి బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు… రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రూపొంచేందుకు కసరత్తు ప్రారంభించారు.
2014లో ప్రభుత్వం 35.29 లక్షల మంది రైతులకు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేసింది. గతంలో16,124 కోట్లు ఖర్చుచేయగా… ఈసారి 20వేల కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ప్రకటించే మార్గదర్శకాల ప్రకారమే ఎంతమందికి ఎంత మాఫీ కానుందో స్పష్టత రానుంది.
2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పుడు…. నాలుగు విడతలుగా మాఫీ చేసింది. 2017 మార్చి వరకు మాఫీ సొమ్మును బ్యాంకులకు రిలీజ్ చేసింది. ఈసారి 2017–18 ఖరీఫ్, రబీలు, 2018–19 ఖరీఫ్, రబీలలో పంటరుణాలు తీసుకున్న రైతులను పరిగణనలోకి తీసుకుంటారని వ్యవసాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే రబీని పరిగణనలోకి తీసుకోకపోవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది.
రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని….4సీజన్లలో రైతులు తీసుకున్న రుణాల్లో లక్షరూపాయల వరకు మాఫీ చేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. 2017-18 రబీ, ఖరీఫ్ లో39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే…. అందులో ఖరీఫ్ లో 26.20లక్షల మంది, రబీలో 12.90లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఆ ఏడాది రూ. 31,410 కోట్ల రుణాలను బ్యాంకులు రైతులకు ఇచ్చాయి.
2018–19లో ఇప్పటి వరకు 26.45 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులు మొత్తం రూ.23,488 కోట్లు రుణాలు ఇచ్చాయి. అందులో ఈ ఖరీఫ్‌లో 22.21 లక్షల మంది రైతులు రూ.19,671 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత రబీలో ఇప్పటివరకు 4.24 లక్షల మంది రైతులు రూ. 3,816 కోట్ల రుణాలు తీసుకున్నారు.
ప్రస్తుతం రుణాలు రీషెడ్యూల్ చేసుకునే సమయం ఇది. రబీకి సంబంధించి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మూడు నెలల్లో పంట రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించి కొత్త రుణాలు తీసుకుంటారు రైతులు. అయితే, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల సమయంలో రుణమాఫీ గురించి ప్రకటించడంతో రీషెడ్యూల్ చేయించుకోవడానికి రైతులు ముందుకు రావడం లేదు. ఎలాగైనా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకంతో రైతులు ఉన్నారు. అయితే గతంలో లాగా నాలుగు విడతల్లో కాకుండా…రుణాలన్ని ఒకే సారి మాఫీ చేస్తామని టీఆర్ఎస్ సర్కార్ చెప్పడంతో రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే 20వేల కోట్ల రూపాయల పైగానే ప్రభుత్వం ఈసారి బ్యాంకులకు చెల్లిస్తుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రుణమాఫీకి 20వేల కోట్లు, రైతుబంధు పథకానికి 15వేల కోట్లు అవసరం ఉంటుంది. ఈ రెండు కలిపి దాదాపు 35వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. వీటన్నింటిని ప్రభుత్వం ఎలా సర్ధుబాటు చేస్తుందోనన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది.