Telugu Global
NEWS

టీఆర్ఎస్ లో చేరికపై.... టీడీపీ ఎమ్మెల్యే సండ్ర కామెంట్స్

తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలనుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాలు దక్కించుకుంటామన్న సీఎం కేసీఆర్ అన్నట్లుగానే ఆ సంఖ్యకు చేరువయ్యారు. 88 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ టీఆర్ఎస్ గూటికి చేరడంతో… టీఆర్ఎస్ బలం 90కి చేరుకుంది. వంద సీట్లను టార్గెట్ చేసుకున్న కేసీఆర్…. టీడీపీని రాష్ట్రంలో […]

టీఆర్ఎస్ లో చేరికపై.... టీడీపీ ఎమ్మెల్యే సండ్ర కామెంట్స్
X

తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలనుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాలు దక్కించుకుంటామన్న సీఎం కేసీఆర్ అన్నట్లుగానే ఆ సంఖ్యకు చేరువయ్యారు. 88 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు.

ఇక స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ టీఆర్ఎస్ గూటికి చేరడంతో… టీఆర్ఎస్ బలం 90కి చేరుకుంది. వంద సీట్లను టార్గెట్ చేసుకున్న కేసీఆర్…. టీడీపీని రాష్ట్రంలో లేకుండా చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.

తెలుగు దేశం పార్టీని లేకుండా చేయాలనే పట్టుదలను నిజం చేసుకునేందుకు చక్రం తిప్పుతున్నారు. ఖమ్మం జిల్లాలో గెలుపొందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో కలుపుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతోనూ, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుతోనూ గులాబీ పార్టీ అగ్ర నేతలు టచ్ లో ఉన్నారు. మూడు రోజులుగా వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఆ విషయంలో స్పష్టత రానట్లు సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం ఉదయం సత్తుపల్లిలో స్పందించారు.

టీఆర్ఎస్ లో చేరే విషయంపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ అగ్రనేతలు నాతో సంప్రదింపులు జరిపారని…. తన నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో ఈ విషయంపై చర్చించానని.. తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదని తెలిపారు.

అయితే సండ్ర వెంకటవీరయ్య తనకు మంత్రి పదవి, అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు కార్పొరేషన్ పదవి హామీ ఇస్తే టీఆర్ఎస్ లో చేరుతానని టీఆర్ఎస్ ముందు డిమాండ్ పెట్టినట్టు సమాచారం. దానికి టీఆర్ఎస్ అధిష్టానం సంసిద్ధంగా లేకపోవడంతో వీరి చేరిక తాత్కాలికంగా వాయిదా పడినట్టు వార్తలొస్తున్నాయి.

First Published:  23 Dec 2018 4:06 AM GMT
Next Story