భారత మహిళా క్రికెట్ కు పురుష రక్తం
మహిళా కోచ్ లు పోయే… పురుష శిక్షకులు వచ్చే మహిళా క్రికెట్ దశదిశను మార్చే పురుష కోచ్ లు… దశాబ్దాలుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న భారత మహిళా క్రికెట్ దశదిశను మార్చడానికి బీసీసీఐ నడుం బిగించింది. పురుషులతో సమానంగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తూ… నిపుణులైన శిక్షకులను సైతం అందుబాటులో ఉంచుతోంది. ఇంతకాలం మహిళా శిక్షకులతో నెట్టుకొంటూ వచ్చిన భారత మహిళా క్రికెట్..ఇప్పుడు రామన్ లాంటి ఆధునిక శిక్షకుల నేతృత్వంలో దూసుకుపోడానికి సిద్ధమవుతోంది. ఐసీసీ ఆదేశాలతో…. […]
- మహిళా కోచ్ లు పోయే… పురుష శిక్షకులు వచ్చే
- మహిళా క్రికెట్ దశదిశను మార్చే పురుష కోచ్ లు…
దశాబ్దాలుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న భారత మహిళా క్రికెట్ దశదిశను మార్చడానికి బీసీసీఐ నడుం బిగించింది.
పురుషులతో సమానంగా మహిళలకు ప్రోత్సాహం అందిస్తూ… నిపుణులైన శిక్షకులను సైతం అందుబాటులో ఉంచుతోంది.
ఇంతకాలం మహిళా శిక్షకులతో నెట్టుకొంటూ వచ్చిన భారత మహిళా క్రికెట్..ఇప్పుడు రామన్ లాంటి ఆధునిక శిక్షకుల నేతృత్వంలో దూసుకుపోడానికి సిద్ధమవుతోంది.
ఐసీసీ ఆదేశాలతో….
భారత మహిళా క్రికెట్ కు మంచి రోజులొచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదేశాలతో భారత మహిళా క్రికెట్ సైతం బీసీసీఐకి అనుబంధంగా మారిపోడంతో…దశదిశ ఒక్కసారిగా మారిపోయాయి.
ఐసీసీ నిబంధనల మేరకు బీసీసీఐలో ఓ భాగంగా మారిన తర్వాత నుంచి..మహిళా క్రికెటర్లకు మెరుగైన శిక్షణ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టు మనీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన శిక్షకులను అందుబాటులో ఉంచడానికే బీసీసీఐ ప్రాధాన్యమిస్తోంది.
అరకొర సదుపాయాలతో….
భారత మహిళా క్రికెట్ బీసీసీఐ పరిథిలోకి రాకముందు వరకూ… సరైన శిక్షకులు, శిక్షణ సదుపాయాలు, మ్యాచ్ ఫీజులు లేక సతమతమవుతూ ఉండేది. మాజీ క్రికెటర్లనే శిక్షకులుగా ఎంచుకొని అంతర్జాతీయ టోర్నీలు, విదేశీ సిరీస్ ల్లో పాల్గొంటూ ఉండేది.
భారత మాజీ క్రికెటర్ పూర్ణిమారావు కోచ్ గా…భారత మహిళా క్రికెట్ గణనీయమైన ప్రగతి, పురోగతి సాధించిన సమయంలోనే…. అమర్యాదకరమైన రీతిలో పూర్ణిమను తొలగించి రంజీ మాజీ క్రిెకెటర్ తుషార్ ఆరోతీని శిక్షకునిగా నియమించారు.
తొలిపురుష కోచ్ తుషార్….
అప్పటి వరకూ …మహిళా శిక్షకుల నేతృత్వంలో పడుతూ లేస్తూ వచ్చిన భారత మహిళా క్రికెట్…తొలిసారిగా ఓ పురుష శిక్షకుడి పర్యవేక్షణలో దూకుడు పెంచింది.
ఓ పురుషుడు శిక్షకుడుగా ఉండటంతో శిక్షణ, వ్యూహాలు, ఆలోచనా విధానం సమూలంగా మారిపోయాయి. వన్డే జట్టుకు మిథాలీ రాజ్ ను, టీ-20 జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ ను కెప్టెన్లుగా నియమించడం ద్వారా మహిళా క్రికెట్ గాడిలో పడినట్లే కనిపించింది.
అయితే…కౌలాలంపూర్ వేదికగా ముగిసిన టీ-20 ఆసియాకప్ ఫైనల్లో భారత్ అనూహ్య ఓటమి చవిచూసింది. చివరకు బంగ్లాదేశ్ చేతిలో కంగుతిని రన్నరప్ స్థానంలో నిలవాల్సి వచ్చింది.
ఫైనల్లో ఆడిన తుదిజట్టు నుంచి పేస్ బౌలర్ వస్త్రార్ కర్ ను తప్పించడం, దానికితోడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో విభేదాల తో కోచ్ తుషార్ చివరకు తన పదవినే కోల్పోవాల్సి వచ్చింది.
తుషార్ స్థానంలో రమేశ్ పోవార్….
తుషార్ ఆరోతీ స్థానంలో కోచ్ గా భారత మాజీ క్రికెటర్ రమేశ్ పోవార్ పగ్గాలు చేపట్టాడు. కరీబియన్ ద్వీపాలు వేదికగా ముగిసిన 2018 టీ-20 ప్రపంచకప్ లో భారతజట్టు పాల్గొనటమే కాదు… గ్రూప్ లీగ్ లో నాలుగుకు నాలుగుమ్యాచ్ లూ నెగ్గి ..గ్రూప్ టాపర్ గా సెమీస్ బెర్త్ సంపాదించింది.
తొలిరౌండ్లో రెండోర్యాంకర్ న్యూజిలాండ్, ఆఖరిరౌండ్లో టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్లపై భారతజట్టు సాధించిన సంచలన విజయాలు, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సాధించిన మెరుపు సెంచరీతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
లీగ్ దశలో పాక్, ఐర్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్ లు మాత్రమే ఆడిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్…రెండు హాఫ్ సెంచరీలు సాధించినా…బంతికో పరుగు మాత్రమే సాధించడం ద్వారా…టీమ్ మేనేజ్ మెంట్ సహనానికి పరీక్ష పెట్టింది.
దీంతో…ఇంగ్లండ్ తో జరిగిన సెమీఫైనల్లో …వెటరన్ మిథాలీని పక్కన పెట్టి…స్ట్రయిక్ రేట్ ఎక్కువగా ఉన్న యువ ప్లేయర్ తాన్యాకు తుదిజట్టులో చోటు కల్పించారు. అయితే…సెమీఫైనల్లో భారతజట్టు ఆట అన్ని విభాగాలలోనూ విఫలమై 8 వికెట్ల ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
మిథాలీ ఎదురుదాడి….
అపార అనుభవం కలిగిన మిథాలీ లాంటి మేటి క్రికెటర్ ను పక్కనపెట్టిన భారత్ భారీమూల్యం చెల్లించదంటూ మిథాలీ మేనేజర్ ట్విట్టర్ ద్వారా ఆరోపణలు గుప్పించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కోచ్ రమేశ్ పోవార్లను విమర్శించింది.
ఇంగ్లండ్ తో ముగిసిన సెమీఫైనల్లో పోటీకి దిగిన భారత తుదిజట్టును కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్, సెలెక్టర్లతో కూడిన టీమ్ మేనేజ్ మెంట్ ఎంపిక చేసిందని… మిథాలీ స్ట్రయిక్ రేట్ తక్కువగా ఉన్న కారణంగానే విన్నింగ్ కాంబినేషన్ ను కొనసాగించినట్లు ప్రకటించింది. బీసీసీఐ పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ సైతం…సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించింది.
మరోవైపు… ప్రపంచకప్ లో తాను నిలకడగా రాణించినా…తనను పక్కనపెట్టి అవమానించారంటూ…సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ ఆందోళన వ్యక్తం చేసింది. కోచ్ రమేశ్ పొవార్, పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ..తన కెరియర్ ను అంతం చేయటానికి కుట్రపన్నారంటూ మండిపడింది. క్రికెట్ కోసం 20 ఏళ్లుగా తన జీవితాన్ని అంకితం చేస్తే…చివరకూ ఇలా అవమానిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
రమేశ్ పొవార్ అవుట్….
మిథాలీని ఉద్దేశపూర్వకంగానే తప్పించి అవమానించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న కోచ్ రమేశ్ పొవార్ సైతం చివరకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
నవంబర్ 30తోనే రమేశ్ పొవార్ పదవీకాలం సైతం ముగిసింది. దీంతో బీసీసీఐ తాజాగా మహిళా క్రికెట్ కోచ్ ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించింది. కోచ్ ఎంపిక కోసం…క్రికెట్ మాజీ దిగ్గజాలు కపిల్ దేవ్, అంశుమన్ గయక్వాడ్, శాంతా రంగస్వామిలతో…. ఓ అడహాక్ కమిటీని సైతం ఏర్పాటు చేసింది.
పొవార్ పోయే…రామన్ వచ్చే…
భారత మహిళా క్రికెట్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకొన్న ప్రముఖుల్లో…గ్యారీ కిర్ స్టెన్, డబ్లువి రామన్, వెంకటేశ్ ప్రసాద్, మనోజ్ ప్రభాకర్, ట్రెంట్ జాన్స్ టన్, దిమిత్రీ మస్కెరెనాస్, బ్రాడ్ హాగ్, కల్పనా వెంకటాచారి ఉన్నారు. చివరకు గ్యారీ కిర్ స్టెన్, రామన్ ల పేర్లను…షార్ట్ లిస్ట్ చేసినా….వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని…రామన్ వైపే బీసీసీఐ మొగ్గు చూపింది.
రామన్ కు టీమిండియా తరపున 11 టెస్టులు, 27 వన్డేలు ఆడిన రికార్డు ఉంది. అంతేకాదు…1992-93 సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికా గడ్డపై సెంచరీ సాధించిన భారత తొలిక్రికెటర్ గా కూడా రామన్ కు అరుదైన ఘనత ఉంది.
వివాద రహితుడుగా పేరున్న రామన్ నేతృత్వంలో భారత మహిళా క్రికెట్ ప్రమాణాలు కొత్త పుంతలు తొక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి 24 నుంచి న్యూజిలాండ్ లో జరిపే పర్యటనే…కోచ్ గా రామన్ ప్రతిభకు…. భారత ప్లేయర్ల సత్తాకు పరీక్షకానుంది.
భారత మహిళా క్రికెట్ తలరాతను… నయాశిక్షకుడు రామన్ మార్చాలని బీసీసీఐ మాత్రమే కాదు…భారత క్రికెట్ అభిమానులు సైతం కోరుకొంటున్నారు.