Telugu Global
NEWS

అందుకే ఒరిజినల్ ఫొటోలు వాడాను " వర్మ సమాధానం

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు పాటపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, విజయవాడలో డైరెక్టర్ వర్మ దిష్టిబొమ్మలను టీడీపీ కార్యకర్తలు దహనం చేశారు. పాటలో చంద్రబాబును కించపరిచారంటూ విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వర్మ ఒక టీవీ చానల్‌తో ఫోనోలో మాట్లాడారు. తనపై ఎందుకు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జరిగిన కథ ఆధారంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాం కాబట్టే పాటలో ఒరిజినల్ ఫొటోలు వాడామని చెప్పారు. […]

అందుకే ఒరిజినల్ ఫొటోలు వాడాను  వర్మ సమాధానం
X

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు పాటపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, విజయవాడలో డైరెక్టర్ వర్మ దిష్టిబొమ్మలను టీడీపీ కార్యకర్తలు దహనం చేశారు. పాటలో చంద్రబాబును కించపరిచారంటూ విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో వర్మ ఒక టీవీ చానల్‌తో ఫోనోలో మాట్లాడారు. తనపై ఎందుకు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. జరిగిన కథ ఆధారంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాం కాబట్టే పాటలో ఒరిజినల్ ఫొటోలు వాడామని చెప్పారు. ఫోటోల్లో ఒక్క చంద్రబాబే కాకుండా చాలా మంది ఉన్నారని చెప్పారు.

కేవలం చంద్రబాబును మాత్రమే తాను టార్గెట్ చేసి పాట విడుదల చేశానని టీడీపీ వాళ్లు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబునే టార్గెట్ చేశానని ఎవరైనా అనుకుంటే అది గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడమేనన్నారు.

పాటలో వాడిన ఫోటోల్లో చాలా మంది ఉన్నారని.. కానీ ఒక్క చంద్రబాబు అభిమానులే ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. సినిమాలో నిజాలు బయటకు వస్తే ఇబ్బంది వస్తుందని భావించే వారే ఇలా భయపడుతుంటారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక డైరెక్టర్‌గా సినిమా తీసే హక్కు తనకు ఉందన్నారు.

ఎన్టీఆర్‌ ఒక పబ్లిక్ లీడర్ అని ఆయనపై సినిమా తీయాలంటే కుటుంబసభ్యుల మద్దతు ఉండాల్సిన అవసరం లేదన్నారు. బాలకృష్ణ నిర్మిస్తున్న బయోపిక్‌ నిజమైనదా? లక్ష్మీస్ ఎన్టీఆర్‌ నిజమైనదా? అని ట్వీట్టర్లో పోల్‌ పెడితే 68 శాతం మంది నెటిజన్లు లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు మద్దతు పలికారని వర్మ చెప్పారు. దీన్ని బట్టే జనం ఎవరిని నమ్ముతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.

వెన్నుపోటు అన్నది తాను సృష్టించిన పదం కాదని… వైస్రాయ్‌ ఉదంతం నుంచి ఇప్పటి వరకు అనేక మంది చెప్పిన మాటేనన్నారు. ఎన్టీఆరే స్వయంగా తనకు వెన్నుపోటు పొడిచారు… నమ్మకద్రోహం చేశారన్నారని వర్మ గుర్తు చేశారు. పాటలో ఉన్న అభ్యంతరం ఏంటో చెప్పకుండా దిష్టబొమ్మలు దహనం చేస్తే ఏమొస్తుందని వర్మ ప్రశ్నించారు.

First Published:  22 Dec 2018 11:34 AM IST
Next Story