Telugu Global
Family

అంగదుడు

నరునికన్నా నారాయణుని కన్నా శక్తివంతమైన వానరుడు వాలి. అలాంటి వాలి కొడుకే అంగదుడు. తల్లి తార.           రాముడు రానంతవరకూ కిష్కింధకు వాలే రాజు. సుగ్రీవుని కారణంగా వాలిని చెట్టు చాటు నుండి బాణం వేసాడు రాముడు. వాలి మరణాంతరం కిష్కిందకు మళ్ళీ సుగ్రీవుడే రాజయ్యాడు. అంగదునికి యువరాజుగా పట్టాభిషేకమూ చేసారు.           తన తండ్రి వాలికీ సుగ్రీవునికీ వున్న వైరాన్నిగాని, తన తండ్రి మరణానికి కారణమైన సుగ్రీవుని పట్ల ద్వేషాన్ని గాని అంగదునిలో చూడం. పైగా […]

నరునికన్నా నారాయణుని కన్నా శక్తివంతమైన వానరుడు వాలి. అలాంటి వాలి కొడుకే అంగదుడు. తల్లి తార.

రాముడు రానంతవరకూ కిష్కింధకు వాలే రాజు. సుగ్రీవుని కారణంగా వాలిని చెట్టు చాటు నుండి బాణం వేసాడు రాముడు. వాలి మరణాంతరం కిష్కిందకు మళ్ళీ సుగ్రీవుడే రాజయ్యాడు. అంగదునికి యువరాజుగా పట్టాభిషేకమూ చేసారు.

తన తండ్రి వాలికీ సుగ్రీవునికీ వున్న వైరాన్నిగాని, తన తండ్రి మరణానికి కారణమైన సుగ్రీవుని పట్ల ద్వేషాన్ని గాని అంగదునిలో చూడం. పైగా సుగ్రీవుని పట్ల ఎంతో పితృ భక్తి కనిపిస్తుంది. సీతను వెతికే క్రమంలో మరెంతో భయమూ కనిపిస్తుంది.

సీత జాడ కనిపెట్టడానికి ఒక్కొక్కర్ని ఒక్కోదిక్కూ పంపించినప్పుడు అంగదునికి దక్షిణ దిక్కుగా వెతికి రమ్మని పంపిస్తారు. తోటి వానరుల పరివారంతో వెళ్తాడు అంగదుడు. సీతను రావణుడు ఎత్తుకు పోయాడని సంపాతి ద్వారా అంగదునికి తెలుస్తుంది.

అయితే అంగదుని శక్తి అంగదునికి తెలుసు. శత యోజనాల దూరం మాత్రమే ఎగిరి దాటగలడు. అంచేత లంకకు చేరగలడు. కాని తిరిగి వచ్చే ధైర్యమూలేదు. అలాగని సీతను చూడకుండా వెనక్కి వెళ్ళి సుగ్రీవుని ముందు నిలబడే ధైర్యమూలేదు. చింతించాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. జాంబవంతుడు అందుకు ఒప్పుకోకపోగా హనుమంతుణ్ని పరిష్కారంగా చూపించాడు.

అలాగని అంగదుడు ఏమీ చెయ్యకుండా ఊరుకోలేదు. రాముని పక్షం చేరాడు. పోరాడాడు. రాముడు తన సైన్యంతో లంకలో అడుగుపెట్టాక అంగదుడే రావణుని దగ్గరికి రాయబారిగా వెళ్ళాడు. యుద్ధం మానుకొమ్మన్నాడు. గెలవలేవన్నాడు. ధర్మంగా సీతను తిరిగి రామునికి అప్పగించమన్నాడు. శరణుకోర మన్నాడు. రావణుడు వినలేదు.

ఆ తరువాత యుద్ధంలో అంగదుడు రావణుని సేవాధిపతియైన మహాకాయుణ్ని సంహరించాడు. రావణుని ఎదుర్కొనే శక్తి లేకపోయినా ఎదిరించే సాహసం చేశాడు. రావణుని అంతఃపురంలో ప్రవేశించాడు. కోతేడుపులు ఏడ్చాడు. మండోదరికి మండింది. అంగదుని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి హోమం చేస్తున్న రావణుని ముందుకు తోసింది. రావణుడు తన భార్య మండోదరిని రక్షించుకొనే ప్రయత్నంలో హోమాన్ని నిలిపేసాడు. అంగదునికి మిగతా వానరులు తోడయ్యారు. మొత్తానికి రావణుని హోమం పూర్తి కాలేదు. దాంతో ఆశించిన శక్తుల్ని రావణుడు పొందలేకపోయాడు. రాముని విజయంలో అంగదుని పాత్ర కూడా వుంది.

అందుకే సీతారాముల వెంట అయోధ్యకు సుగ్రీవుడు వెళ్ళగా అంగదుడే కిష్కింధకు రాజయ్యాడు.

వాలి వారసత్వంగా రాజ్యం అంగదునికి దక్కింది!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  21 Dec 2018 6:32 PM GMT
Next Story