Telugu Global
International

17 గ్రహ శకలాల్లో నీటి జాడను కనుగొన్న జపాన్ శాస్త్రవేత్తలు

భూమి మీద జీవిరాశి ఉందంటే దానికి ప్రధాన కారణం నీరు. ఈ నీరే లేకుంటే జీవి పుట్టుక, మనుగడ సాధ్యమయ్యేదే కాదు. సూర్య కుటుంబంలో నీరు ఉన్న ఒకే ఒక గ్రహం భూమి. ఇంత వరకు ఇతర గ్రహాల్లో కాని, గ్రహ శకలాల్లో కాని నీటి జాడ ఉన్నట్లు ఏ నాడూ దృవీకరించబడలేదు. కాని, ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 17 గ్రహ శకలాల్లో నీటి జాడ ఉన్నట్లు గుర్తించారు. అయితే అది ఘన ఖనిజ […]

17 గ్రహ శకలాల్లో నీటి జాడను కనుగొన్న జపాన్ శాస్త్రవేత్తలు
X

భూమి మీద జీవిరాశి ఉందంటే దానికి ప్రధాన కారణం నీరు. ఈ నీరే లేకుంటే జీవి పుట్టుక, మనుగడ సాధ్యమయ్యేదే కాదు. సూర్య కుటుంబంలో నీరు ఉన్న ఒకే ఒక గ్రహం భూమి.

ఇంత వరకు ఇతర గ్రహాల్లో కాని, గ్రహ శకలాల్లో కాని నీటి జాడ ఉన్నట్లు ఏ నాడూ దృవీకరించబడలేదు. కాని, ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 17 గ్రహ శకలాల్లో నీటి జాడ ఉన్నట్లు గుర్తించారు. అయితే అది ఘన ఖనిజ రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

విశ్వాంతరాళాన్ని పరిశోధించడానికి జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా (జేఏఎక్స్ఏ) 2006లో అకారి అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది. ఇన్‌ఫ్రారెడ్ కెమెరా కల్గిన ఈ శాటిలైట్ 2006 నుంచి 2011 వరకు పని చేసింది. ఆ సమయంలో అక్కడి నుంచి చాలా సమాచారాన్ని భూమ్మీదకు పంపింది. ముఖ్యంగా గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్) ఏర్పడిన విధానం, అందులోని ఖనిజాలపై విస్త్రృతమైన డేటాను పంపింది.

ఈ డేటాను కూలంకషంగా పరిశోధించిన శాస్త్రవేత్తలు తొలి సారిగా నీటి జాడను కనుగొన్నారు. సూర్య కుటుంబంలో నీళ్లు అసలు ఎలా ప్రవేశించాయి.. భూమ్మీదకు ఎలా వచ్చాయనే విషయంపై ఒక అవగాహనకు వచ్చారు. గ్రహశకలాల్లో నీరు ఘన ఖనిజ రూపంలో ఉన్నదని.. నీరు అనేక రసాయనిక చర్యలకు గురై రాతి శిలల రూపంలో గ్రహశకలాల మధ్యన ఉండిపోయిందని వారు పరిశోధనలలో తేల్చారు. అలాంటి గ్రహశకలమే భూమిని ఢీకొట్టడం వల్ల నీరు భూమిపైకి చేరినట్లు వారు చెబుతున్నారు.

ఘనస్థితిలో ఉన్న ఈ నీరు ఉత్పతన ఉష్ణోగ్రత (ఘన పదార్థం ద్రవంగా మారకుండా నేరుగా వాయు స్థితికి వెళ్లే ఉష్ణోగ్రత) వద్ద ఎలాంటి మార్పు చెందకుండా స్థిరంగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇన్‌ఫ్రారెడ్ తరంగాలు పలు మూలకాలు, ఖనిజాలు, మంచు తదితర పదార్థాలపై పడినప్పుడు అవి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనబరుస్తాయి. దీని ఆధారంగానే శాస్త్రవేత్తలు గ్రహశకలాలను అధ్యయనం చేస్తున్నారు.

భూమిపైన అమర్చిన టెలిస్కోప్స్‌లో కూడా ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలు ఉపయోగిస్తున్నా.. భూమిపై ఉండే వాతావరణం.. ముఖ్యంగా తేమ, కార్బన్ డై ఆక్సైడ్ వల్ల సరైన ఫలితాలు రావడం లేదు. భూవాతావరణం ఆవల ఈ కెమేరాలను ఉపయోగించడం వల్ల కచ్చితమైన ఫలితాలు చూడగలుగుతున్నారు.

1995లో ప్రారంభించిన ఇన్‌ఫ్రారెడ్ స్పేస్ అబ్జర్వేటరీ, 2003లో ప్రారంభించిన స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్‌లు తగినంత తరంగదైర్గ్యం లేకపోవడం వల్లే ఆస్టరాయిడ్స్‌ను పూర్తిగా పరిశోధించలేకపోయాయి. అయితే 2011లో పని చేయడం మానేసిన అకారీ మాత్రం గ్రహశకలాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించింది. 66 గ్రహశకలాలకు సంబంధించి అతి సూక్ష్మమైన పరిశీలనను కూడా అందించింది.

జపాన్ శాస్త్రవేత్తలు నీటి జాడను కనుగొన్న ఆ 17 శకలాలు సీ-టైప్ ఆస్టరాయిడ్స్. ఈ ఆస్టరాయిడ్స్ పూర్తి కృష్ణ వర్ణంలో (చిక్కటి నలుపు) ఉండి నీరు, ఖనిజాలు కలిగి ఉంటాయి. అకారీ పంపిన డేటా ఆధారంగానే వీటిలో ఘన ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు.

సూర్యుడి నుంచి వచ్చే వేడిని తీసుకొని గానీ.. రేడియో ఆక్టీవ్ ఐసోటోప్స్ ద్వారా వచ్చే వేడి వల్ల గాని ఈ ఆస్టరాయిడ్స్ ఏర్పడి ఉండవచ్చు. రాళ్లు, ఘన స్థితిలోని నీరు అన్నీ కలసిపోయి హైడ్రేటెడ్ మినిరల్స్‌లా మారిపోయి.. ఆ తర్వాత అవి గ్రహశకలాల మధ్యకు చేరినట్లు జపాన్ పరిశోధకులు చెబుతున్నారు.

ఏదైమైనా జీవి మనుగడకు ఆధారమైన నీరు మరో చోట కూడా ఉందంటే…. భవిష్యత్‌లో ఇతర గ్రహాలపై మానవుడి జీవనం కొనసాగించడం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో కొంత సఫలం చెందినట్లే.

First Published:  20 Dec 2018 10:31 AM IST
Next Story