రిచర్డ్ మాడ్లే పోయే.... హుగ్ ఎడ్మెడ్స్ వచ్చే....!
ఐపీఎల్-12 వేలంలో సరికొత్త ఆక్షనీర్ వేలం నిర్వహించడంలో ఆరితేరిన మాడ్లే, ఎడ్మడ్స్ భారత దేశవాళీ క్రికెట్ ఐపీఎల్ అంటే…బౌండ్రీల హోరు, సిక్సర్ల జోరు మాత్రమే కాదు….వేలం రోజున జరిగే హంగామా కూడా. గత 11 సీజన్లుగా…. ముంబై, బెంగళూరు నగరాలకే పరిమితమైన ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని…ప్రస్తుత 12వ సీజన్లో జైపూర్ వేదికగా నిర్వహించారు. అంతేకాదు…2008 ప్రారంభ ఐపీఎల్ సీజన్ నుంచి గత ఏడాది ముగిసిన 11వ సీజన్ వరకూ వేలం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రిచర్డ్ మాడ్లేను….బీసీసీఐ ఈసారి […]
- ఐపీఎల్-12 వేలంలో సరికొత్త ఆక్షనీర్
- వేలం నిర్వహించడంలో ఆరితేరిన మాడ్లే, ఎడ్మడ్స్
భారత దేశవాళీ క్రికెట్ ఐపీఎల్ అంటే…బౌండ్రీల హోరు, సిక్సర్ల జోరు మాత్రమే కాదు….వేలం రోజున జరిగే హంగామా కూడా. గత 11 సీజన్లుగా…. ముంబై, బెంగళూరు నగరాలకే పరిమితమైన ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని…ప్రస్తుత 12వ సీజన్లో జైపూర్ వేదికగా నిర్వహించారు.
అంతేకాదు…2008 ప్రారంభ ఐపీఎల్ సీజన్ నుంచి గత ఏడాది ముగిసిన 11వ సీజన్ వరకూ వేలం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రిచర్డ్ మాడ్లేను….బీసీసీఐ ఈసారి పక్కనపెట్టి… హ్యూగో ఎడ్మడోస్ ను తెరమీదకు తెచ్చింది.
ప్రస్తుతం జైపూర్ లో జరుగుతున్న 12వ సీజన్ వేలం కార్యక్రమాన్ని బ్రిటన్ కు చెందిన వెటరన్ ఆక్షనీర్ హ్యూగో ఎడ్మడోస్ నిర్వహిస్తున్నారు.
మాడ్లే లబోదిబో….
ఐపీఎల్ వేలం కార్యక్రమం నుంచి తనను తప్పించడాన్ని …60 ఏళ్ల ఆక్షనీర్ రిచర్డ్ మాడ్లే ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రారంభ ఐపీఎల్ సీజన్ నుంచి గత 11 సంవత్సరాలుగా తాను వేలం కార్యక్రమాన్ని… విజయవంతంగా, వినూత్నంగా నిర్వహిస్తూ వచ్చానని…బీసీసీఐ తనను ఎందుకు పక్కనపెట్టిందో అర్థం కావడంలేదని మాడ్లే లబోదిబో అంటున్నారు.
గత దశాబ్దకాలంగా…. ఐపీఎల్ వేలం కార్యక్రమం తన జీవితంలో ఓ భాగంగా ఉంటూ వచ్చిందని… ఐపీఎల్ తో తాను మమేకమైపోయానని… తనకంటే వయసులో పెద్ద, భారీకాయం ఉన్న వ్యక్తికి వేలం బాధ్యతలు అప్పజెప్పడం ఎంత వరకూ సబబని మాడ్లే ప్రశ్నిస్తున్నాడు. డబుల్ సెంచరీ సాధించిన ఓ క్రికెటర్ ను ఆ తర్వాతి టెస్ట్ కు ఎంపిక చేయనట్లుగా తన ప్రస్తుత పరిస్థితి ఉందని వాపోతున్నాడు.
ఎవరీ హ్యూగో….
మాడ్లే స్థానంలో ఆక్షనీర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న హ్యూగోకు….పురాతన వస్తువుల వేలం నిర్వహణలో మాత్రమే అనుభవం ఉంది. కళాఖండాలు, వింటేజ్ కార్ల వేలం నిర్వహించే వ్యక్తి…హఠాత్తుగా… ఐపీఎల్ ఆటగాళ్ల వేలాన్ని ఏవిధంగా నిర్వహించగలరన్న ప్రచారం సైతం జోరందుకొంది. అయితే..హ్యూగో ఎడ్మడోస్ మాత్రం ఐపీఎల్ -12 తొలిరోజు వేలం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి… ఆక్షన్ కు హద్దులు, పరిమితులు లేవని…వేలం ఏదైనా వేలమేనని చాటి చెప్పారు.
351 క్రికెటర్లు- 70 బెర్త్ లు….
ఐపీఎల్ 12వ సీజన్ వేలంలో …వివిధ ఫ్రాంచైజీలు మొత్తం 70 ఖాళీల భర్తీకి వేలం బరిలోకి దిగాయి. స్వదేశీ, విదేశీ క్రికెటర్లు మొత్తం 351 మందితో జాబితా సిద్ధం చేసి…వేలం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పోటీల తొలిరోజు వేలంలో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ చెల్లని రూపాయిగా మిగిలిపోతే….తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో అసాధారణంగా రాణించిన యువ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి…అనూహ్యంగా 8 కోట్ల 40 లక్షల రూపాయల ధర దక్కించుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. తన విలువకు 42 రెట్లు అధికంగా వేలం ధరను దక్కించుకోడం విశేషం.