శూర్పణఖ
నాతి అంటే ఆడది. ఎలాంటి నాతి? చుప్పనాతి! ఎవరూ.. ఇంకెవరు? శూర్పణఖ!! రాములోరి సీతను రావణాసురుడు ఎత్తుకుపోయినా – అందుకు కారణం మాత్రం శూర్పణఖే!? శూర్పణఖ ఎవరో కాదు, రావణుని చెల్లెలే! విశ్వవో బ్రహ్మకూ కైకసికీ పుట్టిన కూతురు. రావణ కుంభకర్ణుల తోడ… విభీషణ ఖరులతోడ ఒక్కగా నొక్క చెల్లెలు. ఆడింది ఆటగా, పాడింది పాటగా ముద్దుగానే పెంచారు. పెద్ద చేశారు. పెళ్ళి కూడా చేసారు. ఎవరితో? విద్యుజిహ్వుడితో! కాలకేయులతో రావణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు విద్యుజిహ్వుణ్ని శత్రువనుకొని […]
నాతి అంటే ఆడది. ఎలాంటి నాతి? చుప్పనాతి! ఎవరూ.. ఇంకెవరు? శూర్పణఖ!!
రాములోరి సీతను రావణాసురుడు ఎత్తుకుపోయినా – అందుకు కారణం మాత్రం శూర్పణఖే!?
శూర్పణఖ ఎవరో కాదు, రావణుని చెల్లెలే! విశ్వవో బ్రహ్మకూ కైకసికీ పుట్టిన కూతురు. రావణ కుంభకర్ణుల తోడ… విభీషణ ఖరులతోడ ఒక్కగా నొక్క చెల్లెలు. ఆడింది ఆటగా, పాడింది పాటగా ముద్దుగానే పెంచారు. పెద్ద చేశారు. పెళ్ళి కూడా చేసారు. ఎవరితో? విద్యుజిహ్వుడితో!
కాలకేయులతో రావణుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు విద్యుజిహ్వుణ్ని శత్రువనుకొని చంపేసాడు. శూర్పణఖ వైధవ్యానికి అన్న రావణుడే కారణమయ్యాడు.
శూర్పణఖ దుఃఖానికి బాధపడి ఓదార్చిన రావణుడు దండకారణ్యములో ఖరుదూషణులున్నారు, అక్కడ నీకు సుఖ సౌఖ్యాలుంటాయని చెప్పి పంపించాడు.
అలా దండకారణ్యంలోనే శూర్పణఖ వుండేది. ఆమెకి జంబుకాసురుడు అనే కొడుకు కూడా వుండేవాడు. వాడు పొదలలో కూర్చొని తపస్సు చేసుకుంటూ వుండగా పళ్ళు కోసుకోవడానికి వచ్చిన లక్ష్మణుడు చూడకుండా కత్తి దూసాడు. అంతే.. జంబుకాసురుడు చనిపోయాడు.
కొడుకు చావుకు కారణమెవరో తెలియక దుఃఖంతో, ఆగ్రహంతో శూర్పణఖ అడవులన్నీ వెతికింది. ఆ వెతుకులాటలో రాముణ్ని చూసింది. మనసు చలించింది. కొడుకు చావును మరిచిపోయి మోహించింది. తన యిష్టాన్ని కోరికను బయట పెట్టింది. రాముడు కాదన్నాడు. తనకు పెళ్ళయిందని, కూడదన్నాడు. లక్ష్మణుడు ఒంటరిగా వున్నాడన్నాడు. వేడుకో అన్నాడు. వాంఛ తీర్చుకో అన్నాడు. తాపంతో వున్న శూర్పణఖ లక్ష్మణుడి వెంట పడింది. లక్ష్మణుడు కూడా ఆమెను కాదన్నాడు. కాదు పొమ్మన్నాడు. అవమానంతో వున్న శూర్పణఖ కళ్ళకు సీత కనిపించింది. ఈర్ష్య కలిగింది. అసూయ పెరిగింది. దాంతో సీత మీదకు వెళ్ళింది శూర్పణఖ. భయ పెట్టబోయింది. లక్ష్మణుడు సహించలేదు. శూర్పణఖను పట్టుకొని ముక్కూ చెవులూ కోసాడు. శూర్పణఖ పెద్దపెట్టున బాధతో అరిచింది. అవమానంతో రగిలిపోయింది. కడకు అన్నకడకు పోయింది. “నాకు జరిగిన అవమానం నీది కాదా?” అని నిలదీసింది. అక్కడితో ఆగక సీత అందాలను వర్ణించి చెప్పి అన్నలో ఆశను పెంచింది. సీతకు నువ్వే సరిజోడువు అని కూడా రావణునిలో ధ్యాసను పెంచింది. సీతను ఎత్తుకు రమ్మంది. అదే వారికి తగిన శిక్ష అంది.
శూర్పణఖ మాట వినే రావణుడు సీతను ఎత్తుకొచ్చి లంకలో దాచాడు. తరువాత లంకే నాశనమయి పోయింది.
శూర్పణఖ వైధవ్యానికి రావణుడు కారణమైతే, రావణుడు రాజ్యమూ సర్వమూ కోల్పోయి మృత్యువుని చేరడానికి శూర్పణఖ కారణమయ్యింది!.
– బమ్మిడి జగదీశ్వరరావు