బాబు కోటరీ కంపెనీల్లో కొప్పుల భార్య.... డీల్ కుదిరింది ఆ దారిలోనే....
కొప్పుల రాజు. మాజీ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోటరీలో కీలక సభ్యుడు. తెలంగాణ ఎన్నికల ఎత్తుగడల్లో కొప్పుల రాజు కీలకంగా పనిచేశారు. టీడీపీతో పొత్తు కుదర్చడంలో ఈయనే ప్రధాన సూత్రధారి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కను అమరావతికి పంపించి చంద్రబాబుతో చర్చలు జరిపించారు. టీడీపీతో పొత్తుపై మీడియా సంస్థల అధినేతలతో ఈయనే భేటీలు జరిపారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ఇప్పుడు పలువురు కాంగ్రెస్ నేతలు కొప్పుల రాజును […]
కొప్పుల రాజు. మాజీ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోటరీలో కీలక సభ్యుడు. తెలంగాణ ఎన్నికల ఎత్తుగడల్లో కొప్పుల రాజు కీలకంగా పనిచేశారు. టీడీపీతో పొత్తు కుదర్చడంలో ఈయనే ప్రధాన సూత్రధారి.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కను అమరావతికి పంపించి చంద్రబాబుతో చర్చలు జరిపించారు. టీడీపీతో పొత్తుపై మీడియా సంస్థల అధినేతలతో ఈయనే భేటీలు జరిపారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ఇప్పుడు పలువురు కాంగ్రెస్ నేతలు కొప్పుల రాజును టార్గెట్ చేస్తున్నారు. ఆయన వల్లే రాష్ట్ర కాంగ్రెస్‌కి ఈ దుస్థితి వచ్చిందని హైకమాండ్‌కు నివేదికలు పంపుతున్నారు.
ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈమేరకు రాహుల్‌గాంధీకి ఓ నివేదిక పంపారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును కార్యకర్తలే కాదు…. జనాలు కూడా చీ కొట్టారని ఆయన వాపోయారు.
చంద్రబాబు కోటరీకి చెందిన కంపెనీలతో కొప్పుల రాజు భార్య దమయంతికి సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ కార్పొరేట్ డీలింగ్స్‌తోనే కాంగ్రెస్, టీడీపీ పొత్తు కుదిర్చారని ఆయన అన్నారు.
టీడీపీతో పొత్తు వల్ల ఒక్క ఖమ్మంలో మాత్రమే సీట్లు వచ్చాయని…. కానీ తొమ్మిది జిల్లాల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి పొత్తు నుంచి బయటకు రావాలని కోరారు. ముఖ్యంగా కొప్పుల రాజును రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టకుండా చూడాలని సూచించారు.
మరోవైపు గద్దర్, మందకృష్ణను కాంగ్రెస్ వైపు తీసుకొచ్చిన కొప్పుల రాజు….. వారి చేత ప్రచారం చేయించలేదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. పేపర్లో యాడ్‌లు, టీవీల్లో ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శిస్తున్నారు.
ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క పూర్తి స్థాయి ప్రచారం చేయలేదని… కొన్ని నియోజక వర్గాలను అసలు పట్టించుకోలేదని అంటున్నారు. ప్రచార వైఫల్యం, వ్యూహత్మక ఎత్తుగడలు లేకపోవడంతో కాంగ్రెస్ మట్టికరిచిందని వారు విశ్లేషిస్తున్నారు.