Telugu Global
Family

తార

తార అంటే నక్షత్రం. కంటి నల్లగుడ్డు అని కూడా అర్థం వుంది. బృహస్పతి భార్య తార. అయితే ఇక్కడ మనం వాలి భార్య అయిన తార కథేమిటో తెలుసుకుందాం! పగకీ ప్రతీకారానికీ – అసూయకీ ద్వేషానికీ – ఆగ్రహానికీ ఆవేశానికీ – రాగబంధాలకీ రాజ్యకాంక్షలకీ లోనైన అన్నదమ్ములకీ అపనమ్మకాలకీ మధ్య నలిగిపోయిన తార లాంటి పాత్ర మరొకటి రామాయణం అంతా వెతికినా అగుపడదు.తారుని కుమార్తె తార. వానర రాజ్యమైన కిష్కింధకు రాజైన వాలి భార్య తార. వాలీ […]

తార అంటే నక్షత్రం. కంటి నల్లగుడ్డు అని కూడా అర్థం వుంది. బృహస్పతి భార్య తార. అయితే ఇక్కడ మనం వాలి భార్య అయిన తార కథేమిటో తెలుసుకుందాం! పగకీ ప్రతీకారానికీ – అసూయకీ ద్వేషానికీ – ఆగ్రహానికీ ఆవేశానికీ – రాగబంధాలకీ రాజ్యకాంక్షలకీ లోనైన అన్నదమ్ములకీ అపనమ్మకాలకీ మధ్య నలిగిపోయిన తార లాంటి పాత్ర మరొకటి రామాయణం అంతా వెతికినా అగుపడదు.తారుని కుమార్తె తార. వానర రాజ్యమైన కిష్కింధకు రాజైన వాలి భార్య తార. వాలీ తారల సంతానమే అంగదుడు.

ఒకరోజు వాలి మాయావిపై యుద్ధానికి వెళితే – అతని వెంట భార్యగా తార వెళుతుంది. తమ్ముడుగా సుగ్రీవుడూ వెళతాడు.

అరవీర భయంకరమైన యుద్ధమది. రాక్షసుడైన మాయావితో తలపడ్డ వాలీ తగ్గలేదు. మాయావి వొక బిలంలో అంటే గుహలో దూరేసరికి వాలీ దూరుతాడు. బిలంలోంచి రక్తం ధార కట్టిందే గాని ఎవ్వరూ బయటకు రాలేదు. ఎటువంటి అలికిడీ లేకపోవడంతో వాలి చనిపోయాడని తార, సుగ్రీవుడు భావిస్తారు. మాయావి నుంచి ప్రమాదం కలగకుండా తప్పించుకోవడానికి బిలాన్ని ఒక పెద్దరాతితో మూస్తారు. కిష్కింధకు తిరిగి వెళతారు.

వాలి స్థానంలోకి సుగ్రీవుడొస్తాడు. తారకు పతిగా, రాజ్యానికి అధిపతిగా, అర్ధాంగీ రాజ్యమూ ఒకే అర్థం! అప్పటి కదే ధర్మం. రాజే ప్రభువు, ప్రభువే దైవం. యిది దైవ ధర్మం. తార దైవధీనంలో అంటే సుగ్రీవుని ఆధీనంలో వుంది.

అప్పుడు వాలివచ్చాడు. ఉగ్రుడయ్యాడు. సుగ్రీవుడు ఉద్దేశ పూర్వకంగానే చేసాడని నమ్మి అతనితో యుద్ధం చేసి ఓడించి పారిపోయేలా చేసాడు వాలి. తిరిగి అర్ధాంగినీ రాజ్యాన్నీ వశం చేసుకున్నాడు.

తార జీవితం తనఅదీనంలోకాక ఎవరో ఒకరి ఆదీనంలో వున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే – సీతజాడ కనిపెట్టడానికి సహకరించిన సుగ్రీవునికి సాయం చేయడానికే రాముడు చెట్టు చాటున వుండి వాలి పై బాణం వేసి సంహరించాడు.

వాలిని చూసి తార దుఃఖం పట్టలేకపోయింది. రాముణ్ని నిందించింది. అనరాని మాటలు అన్నది. ‘సీత మళ్ళీ దొరికినా.. మళ్ళీ మీకు ఎడబాటు తప్పదు’ అని శపించింది. రాముడు దోషిలా తలదించుకున్నాడే తప్ప పెదవి విప్పలేదు.

వాలి కొన ప్రాణంతో వుండగానే ఒక రాణిగా తార రాజధర్మాన్ని వీడలేదు. అందుకనే అంగదుని పట్టాభిషేకం జరిపించమని కోరుతుంది. రాముని సమక్షంలోనే సుగ్రీవుని నుండి మాట తీసుకుంటుంది. భార్యని మెచ్చుకోలుగా చూసిన కళ్ళలోంచే వాలి ప్రాణం విడుస్తాడు.

మళ్ళీ రాజ్యం సుగ్రీవుని వశమవుతుంది. తార కూడా! అయితే సుగ్రీవుడు మదుపానానికి మద్యపానానికి ఆసక్తుడవుతాడు. దాంతో రాముని దుఃఖం, లక్ష్మణుడి రౌద్రం భర్త సుగ్రీవునిపై పడకుండా తార తన విజ్ఞతనీ వివేకాన్ని ప్రదర్శిస్తుంది. ఇచ్చిన మాట తప్పేదిలేదంటూనే – జరిగిన ఆలస్యానికి మన్నింపు కోరుతూనే-సుగ్రీవుని కర్తవ్యాన్ని గుర్తు చేసి కార్యోణ్ముఖున్ని చేస్తుంది.

సుఖ దుఃఖాల్ని కష్టనష్టాల్ని ఎన్నింటినో చవి చూసిన తార జీవితం ఆచంద్ర తారార్కమే!.

– బ‌మ్మిడి జ‌గ‌దీశ్వ‌ర‌రావు

First Published:  16 Dec 2018 1:45 PM IST
Next Story