ఎంపీ సీట్లపై కాంగ్రెస్ పెద్దల గురి !
గులాబీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల అడ్రస్ గల్లంతైంది. ఆరుసార్లు గెలిచిన నేతలే మట్టికరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చాలా మంది సీనియర్ నేతలు ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని తమ సన్నిహితులను సలహాలు అడుగుతున్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి జిల్లాలోని లోక్‌సభ సీట్లకు ఈ సారి భారీగా పోటీ ఉండే అవకాశం కన్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు వేరు. లోక్‌సభ ఎన్నికలు వేరు. అంశాల […]
గులాబీ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల అడ్రస్ గల్లంతైంది. ఆరుసార్లు గెలిచిన నేతలే మట్టికరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చాలా మంది సీనియర్ నేతలు ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని తమ సన్నిహితులను సలహాలు అడుగుతున్నారు. నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి జిల్లాలోని లోక్‌సభ సీట్లకు ఈ సారి భారీగా పోటీ ఉండే అవకాశం కన్పిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు వేరు. లోక్‌సభ ఎన్నికలు వేరు. అంశాల వారీగా ఈ ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మోడీ, రాహుల్ మధ్య ఈ సారి మంచి యుద్ధమే జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఏదో ఒక విధంగా ప్రజల్లో ఉండేందుకు… ఓ పదవిలో ఉండేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే ఆరు నెలల్లో జరిగే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు ప్లాన్ చేస్తున్నారు.
మహబూబ్ నగర్ ఎంపీ సీటుపై ఇప్పటికే జైపాల్ రెడ్డి కర్చీప్ వేశారు. తాను పార్లమెంట్‌కు మాత్రమే పోటీ చేస్తానని చెప్పారు. అయితే ఇదే సీటు నుంచి వీలు కుదిరితే పోటీ చేయాలని డీకే అరుణ, రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కుదరకపోతే చేవేళ్ల ఎంపీ సీటు బరిలో పోటీ చేయాలనేది రేవంత్ ప్లాన్. మరోవైపు నల్గొండ, భువనగిరి నుంచి పోటీ చేసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఓడిపోయిన తర్వాత కోమటిరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో ఎంపీగా బరిలో ఉండాలని ఆయన్ని కార్యకర్తలు కోరారు.
సికింద్రాబాద్ నుంచి అంజన్‌కుమార్ యాదవ్ రంగంలో ఉంటారు. దీంతో పాటు మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు పలువురు రెడీ అవుతున్నారు. మెదక్ నుంచి విజయశాంతి లేదా దామోదర రాజనర్సింహ్మ లేదా సునీతారెడ్డి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. నాగర్‌కర్నూలు ఎస్సీ రిజర్వ్‌డ్ సీటుకు కూడా పోటీ పెరుగుతోంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తో పాటు మల్లురవి ఇక్కడి నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి బలరాం నాయక్ పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్‌డ్ సీటుపై ఇటీవల చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకటేష్ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.