Telugu Global
Family

విక‌ర్ణుడు

మ‌న‌కి క‌ర్ణుడు తెలుసు! విక‌ర్ణుడి గురించి అంత‌గా తెలీదు! దాన వీర శూర క‌ర్ణుడికి ఉన్న‌ది ధాతృత్వ‌మూ వీర‌త్వ‌మూ శూర‌త్వ‌మూ – అయితే విక‌ర్ణుడికి ఇవి ఏవీ లేవు. వీట‌న్నింటితో స‌రిస‌మాన‌మైన ధ‌ర్మ మార్గాన్ని మాత్రం అనుస‌రించాడు. భారతంలో త‌న‌కంటూ స్థానం సంపాదించాడు. అంచేత గుర్తుపెట్టుకోండి. కర్ణుడు వేరు. విక‌ర్ణుడు వేరు. కౌర‌వులు వంద మంది. వారంద‌రి గురించి ప్ర‌త్యేకించి చెప్పుకోం. ధుర్యోధ‌నుడు దుశ్శాస‌నుడు… ఇలా కొన్ని పేర్లే చెప్పుకుంటాం. అలాగే ప‌దిహేడో వాడిగా పుట్టిన విక‌ర్ణుడి […]

మ‌న‌కి క‌ర్ణుడు తెలుసు! విక‌ర్ణుడి గురించి అంత‌గా తెలీదు! దాన వీర శూర క‌ర్ణుడికి ఉన్న‌ది ధాతృత్వ‌మూ వీర‌త్వ‌మూ శూర‌త్వ‌మూ – అయితే విక‌ర్ణుడికి ఇవి ఏవీ లేవు. వీట‌న్నింటితో స‌రిస‌మాన‌మైన ధ‌ర్మ మార్గాన్ని మాత్రం అనుస‌రించాడు. భారతంలో త‌న‌కంటూ స్థానం సంపాదించాడు. అంచేత గుర్తుపెట్టుకోండి. కర్ణుడు వేరు. విక‌ర్ణుడు వేరు. కౌర‌వులు వంద మంది. వారంద‌రి గురించి ప్ర‌త్యేకించి చెప్పుకోం. ధుర్యోధ‌నుడు దుశ్శాస‌నుడు… ఇలా కొన్ని పేర్లే చెప్పుకుంటాం. అలాగే ప‌దిహేడో వాడిగా పుట్టిన విక‌ర్ణుడి గురించీ చెప్పుకుంటాం. అంద‌రూ గాంధారీ ధృత‌రాష్ట్రుని పుత్రులే అయినా వారి వారి న‌డ‌వడిక‌ను బ‌ట్టి ప్రాధాన్య‌త పొందారు.

పాండ‌వులూ కౌర‌వులూ చిన్నాయ‌న పెద‌నాయ‌న పిల్ల‌లు. జూదంలో ఓడిన పాండ‌వులు తాము ఓడ‌డ‌మే కాదు, ద్రౌప‌దినీ ఓడారు. ద్రౌప‌ది వ‌స్త్రాప‌హ‌ర‌ణ ఘ‌ట్టం మీరెరిగిందే. నిండు కొలువులో ద్రౌప‌ది వ‌స్త్రాన్ని దుశ్శాస‌నుడు లాగి వివ‌స్త్ర‌ను చేస్తున్నప్పుడు కురువంశ పెద్ద‌లెవ్వ‌రూ నోరుతెరవ లేదు. అన్యాయ‌మ‌ని అన‌లేదు. ధృత‌రాష్ట్రుడూ భీష్ముడూ స‌హా ఒక్క‌రు కూడా ధ‌ర్మం మాట్లాడ‌లేదు. నోళ్లుండి త‌ల‌లు దించుకు నిల‌బ‌డ్డారే త‌ప్ప పంచ‌పాండ‌వులు అయిదుగురూ అదేమ‌ని మాట్లాడ‌లేదు.

ద్రౌప‌ది వేసిన ప్ర‌శ్న‌కెవ్వ‌రూ స‌మాధాన‌మివ్వ‌లేదు. నోరు విప్పిందీ – గుండె విప్పిందీ – మాట్లాడిందీ ఒక్క‌డే – విక‌ర్ణుడే! జ‌రుగుతున్న‌ది ధ‌ర్మం కాద‌న్నాడు. అధ‌ర్మ‌మ‌న్నాడు. అన్యాయ‌మ‌న్నాడు. ధుర్యోధ‌నుడికి అంతా బ‌ద్ధులైతే, విక‌ర్ణుడు మాత్రం ధ‌ర్మానికి బ‌ద్ధుడైనాడు. ధుర్యోధనుడినే త‌ప్పుప‌ట్టాడు. మూగ‌గా ఉండిపోయిన కురు పాండ‌వులనంద‌ర్నీ త‌ప్పుబ‌ట్టాడు. ద్రౌప‌ది వేసిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌మ‌న్నాడు. తాను ధ‌ర్మం ప‌క్షం నిలిచాడు. నిల‌దీశాడు. రాజ్య బ‌హిష్కారానికి గురైనాడు విక‌ర్ణుడు.

ద్రౌప‌ది ఆ కృత‌జ్ఞ‌త‌తోనే త‌న భ‌ర్త‌లను ఒక కోరిక కోరింది. పాండ‌వులు కూడా ఆ కోరిక తీర్చ‌డానికి ఒప్పుకున్నారు. అదే విధంగా విక‌ర్ణుడిని చంప‌కుండా విడిచిపెడ‌తామ‌న్నారు. కాని మాట త‌ప్పారు. విక‌ర్ణుడు త‌న త‌ల్లి మాట‌కు బ‌ద్ధుడై కౌర‌వుల ప‌క్షానే యుద్ధంలో నిల‌బ‌డ్డాడు. ధ‌ర్మ నిర‌తి క‌ల‌వాడైనా స‌రే శ‌త్రుప‌క్షంలో ఉండ‌డం వ‌ల్ల భీముని గ‌దా ఘాతానికి గురికాక త‌ప్ప‌లేదు. ప్రాణం విడువ‌కా త‌ప్ప‌లేదు! ధ‌ర్మాన్ని అనుస‌రించి స్త్రీని గౌర‌వించిన విక‌ర్ణుడుని పోలిన మ‌రొక‌రు కౌర‌వ పాండ‌వులలోనే కాన‌రారు!

– బ‌మ్మిడి జ‌గ‌దీశ్వ‌ర‌రావు

First Published:  13 Dec 2018 11:45 PM IST
Next Story