Telugu Global
NEWS

ట్రబుల్ షూట‌ర్ ఆప‌రేష‌న్ విజ‌యవంతం ! రేపు ఏ ప‌ద‌వి ఇస్తారో ?

సిద్ధిపేట‌లో రికార్డు విజ‌యంతో హ‌రీష్‌రావు మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. అయితే ఒక్క సిద్ధిపేట‌లోనే కాదు…. త‌న‌కు కేటాయించిన కీల‌క నియోజ‌క‌ వర్గాల్లో కూడా ఆయ‌న చ‌క్రం తిప్పారు. కాంగ్రెస్ కీల‌క నేత‌లను ఓడించారు. ఇంట గెల‌వ‌డ‌మే కాదు. ర‌చ్చ కూడా గెలిచారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాతో పాటు కాంగ్రెస్ కీలక నేత‌ల నియోజ‌క‌ వ‌ర్గాల్లో ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. కేసీఆర్ నియోజ‌క‌ వ‌ర్గం గ‌జ్వేల్‌లో కేసీఆర్‌కు 50 వేల ఓట్ల మెజార్టీ రావ‌డం వెనుక తన […]

ట్రబుల్ షూట‌ర్ ఆప‌రేష‌న్ విజ‌యవంతం !  రేపు ఏ ప‌ద‌వి ఇస్తారో ?
X

సిద్ధిపేట‌లో రికార్డు విజ‌యంతో హ‌రీష్‌రావు మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. అయితే ఒక్క సిద్ధిపేట‌లోనే కాదు…. త‌న‌కు కేటాయించిన కీల‌క నియోజ‌క‌ వర్గాల్లో కూడా ఆయ‌న చ‌క్రం తిప్పారు. కాంగ్రెస్ కీల‌క నేత‌లను ఓడించారు. ఇంట గెల‌వ‌డ‌మే కాదు. ర‌చ్చ కూడా గెలిచారు.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాతో పాటు కాంగ్రెస్ కీలక నేత‌ల నియోజ‌క‌ వ‌ర్గాల్లో ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. కేసీఆర్ నియోజ‌క‌ వ‌ర్గం గ‌జ్వేల్‌లో కేసీఆర్‌కు 50 వేల ఓట్ల మెజార్టీ రావ‌డం వెనుక తన వ్యూహాలే పని చేశాయి. 2014 ఎన్నికల్లోనూ కేసీఆర్‌ విజయంలో హరీష్‌ కీలక పాత్ర పోషించారు. తాజా ఎన్నికల్లోనూ హరీష్‌ చక్రం తిప్పారు.

అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి హరీష్‌రావు ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీష్‌…. రంగంలోకి దిగితే వార్‌ వన్‌సైడే అన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా కొడంగల్‌లో సీన్‌ మార్చింది హరీష్‌రావే అంటున్నారు. ఎన్నికలకు ముందు కొడంగల్‌లో పర్యటించడం, పోలింగ్‌ ముందు కేసీఆర్‌ సభ ఏర్పాటు…. ఇలా కొడంగల్‌ రాజకీయాన్ని మార్చేశారు హరీష్‌రావు. నరేందర్‌రెడ్డి గెలుపు వెనుక కీలకంగా వ్యవహరించారు.

గ‌ద్వాల ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రించిన హ‌రీష్‌రావు…డీకె అరుణ ఓడిపోవ‌డానికి ప‌క్క‌గా ప్లాన్ చేశారు. అన్ని వ‌ర్గాలు, నేత‌ల‌ను క‌లిపి ముందుకు న‌డిపించారు. గ‌ద్వాల కోట‌కే జేజ‌మ్మ ప‌రిమితం అయ్యేలా చూశారు. అయినా ఆమె భారీ తేడాతో ఓడిపోయింది.

మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాలు మాత్రమే కాదు…. హుస్నాబాద్‌లో సతీష్‌ గెలుపుకు కారణం ఆయనే..! ప్రచారం మాత్రమే కాదు…. తెరవెనుక వ్యూహాలు, వాటిని సమర్థంగా అమలు చేయడం హరీష్‌ రావు స్ట్రాటజీ.

ఉద్యమం కాలం నుంచి…. ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ కీలక విజయాల వెనుక హరీష్‌రావే ఉంటారు. అందుకే కేసీఆర్‌ సైతం ప్రచారం చివరి సమయంలో ఆయనకు ఓ హెలికాప్టర్‌ ఇచ్చి మరీ…. ప్రచారం చేయించారు. ఇందులో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఈ స్థాయిలో సీట్లు రావడం వెనుక కూడా హరీష్‌ పాత్ర ఉంది. సాగునీటి ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేయడమే కాదు…. ఆ పనిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా…. పక్కాగా ప్లాన్ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం తిరిగి ప్రచారం చేశారు హరీష్‌రావు. అందుకే అందరి అంచనాలు తారుమారు చేస్తూ.. 14లో 13 స్థానాలను గెలిచింది టీఆర్‌ఎస్‌. దటీజ్‌ హరీష్‌రావు అంటున్నారు.

First Published:  13 Dec 2018 2:47 AM IST
Next Story