Telugu Global
NEWS

కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి షాక్? కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేయను: జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీకి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఝలక్ ఇవ్వనున్నారా? కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలను వమ్ము చేయనున్నారా? తెలంగాణ అసెంబ్లీలో సీనియర్లు లేని లోటును తీరుస్తారనుకుంటే చేతులెత్తేశారా? జగ్గారెడ్డి మాటలు వింటుంటే అవుననే అర్థమవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19స్థానాలకే పరిమితమైంది. కానీ పార్టీ సీనియర్ నాయకులంతా ఓడిపోయారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొట్టే నాయకులంతా…ఇంటి బాట పట్టారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, […]

కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి షాక్? కేసీఆర్ పై ఎలాంటి విమర్శలు చేయను: జగ్గారెడ్డి
X

కాంగ్రెస్ పార్టీకి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఝలక్ ఇవ్వనున్నారా? కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలను వమ్ము చేయనున్నారా? తెలంగాణ అసెంబ్లీలో సీనియర్లు లేని లోటును తీరుస్తారనుకుంటే చేతులెత్తేశారా? జగ్గారెడ్డి మాటలు వింటుంటే అవుననే అర్థమవుతుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19స్థానాలకే పరిమితమైంది. కానీ పార్టీ సీనియర్ నాయకులంతా ఓడిపోయారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొట్టే నాయకులంతా…ఇంటి బాట పట్టారు. రేవంత్ రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ, డి.కే అరుణ, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యా ఇలా హేమాహేమీలంతా ఘోరపరాజయం పాలయ్యారు. దీంతో ఇప్పుడు అందరి చూపు జగ్గారెడ్డివైపు మళ్లింది.

కానీ జగ్గారెడ్డి మాత్రం తన రూటు మార్చినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ అడుగుజాడల్లో నడవనున్నట్లు అర్థమవుతుంది. దీంతో అసెంబ్లీలో జగ్గారెడ్డి ఒక్కడే కేసీఆర్ ను ఎదుర్కోగలడన్న కాంగ్రెస్ ఆశలు ఆవిరైనట్లు కనిపిస్తున్నాయి. కేసీఆర్ పాలనపై నాలుగేళ్లు వేచి చూస్తానని ఆయన చెప్పారు.

దీంతో జగ్గారెడ్డి ప్రజాసమస్యలపై గళమెత్తుతారనే చర్చ సాగుతోంది. ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని అందరూ భావించినప్పటికీ…. ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కు పట్టం కట్టారని జగ్గారెడ్డి అన్నారు. తనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన సంగారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి సహాకారంతో తన నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని జగ్గారెడ్డి చెప్పారు. వారు సహకరించకపోయినా… నాలుగేళ్లు ఏమీ అనను అన్నారు. అంతేకాదు వచ్చే నాలుగేళ్ల వరకు ప్రభుత్వంపై కానీ, కేసీఆర్ కుటుంబంపై కానీ తాను ఎలాంటి రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయనని చెప్పారు.

నియోజకవర్గ సమస్యలను లేఖల రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తన ప్రతిపాదనలను తిరస్కరిస్తే సభలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తానన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మాత్రం మారేది లేదని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు.

First Published:  13 Dec 2018 2:45 AM IST
Next Story